దేవ్ సినిమా రివ్యూ

Thu,February 14, 2019 02:20 PM

తమిళ చిత్రసీమలో వైవిధ్యతకు మారుపేరుగా నిలుస్తుంటారు హీరో కార్తి. తాను ఎంచుకునే ప్రతి కథలో కొత్తదనంతో పాటు సహజత్వం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంటారాయన. ఆ విలక్షణీయతే ఆయన్ని తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసింది. అవారా, ఖాకీ లాంటి తమిళ అనువాదాలతో తెలుగులో హీరోగా మంచి మార్కెట్‌ను సృష్టించుకున్నారాయన. కార్తి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం దేవ్. ఖాకీ తర్వాత కార్తి, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నటించిన ఈ చిత్రానికి రజత్‌ రవి శంకర్ దర్శకత్వం వహించారు. భిన్నమైన ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రం లవర్స్‌డే రోజున ప్రేక్షకుల ముందుకొచ్చింది.


మనసుకు నచ్చినట్లుగా జీవితాన్ని గడపాలన్నది దేవ్ రామలింగం(కార్తి) సిద్ధాంతం. అడ్వెంచర్స్ చేస్తూ ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా స్నేహితులతో సంతోషంగా బతుకుతుంటాడు. ఫేస్‌బుక్‌లో మేఘన (రకుల్‌ప్రీత్‌సింగ్) ఫొటో చూసి ఆమెను ఇష్టపడతాడు. మేఘన అమెరికాలో ఉద్యోగం చేస్తుంటుంది. పనే తన ప్రపంచం. ప్రేమ, పెళ్లి బంధాల పట్ల తనకు నమ్మకం ఉండదు. మేఘన తల్లి పద్మావతిని ప్రేమ పేరుతో ఒకరు మోసం చేస్తారు. దాంతో మగాళ్లు అందరూ అలాగే ఉంటారనే నమ్మకం మేఘనలో బలంగా నాటుకుపోతుంది. దాంతో దేవ్ ప్రేమను తిరస్కరించి అతడిని ద్వేషిస్తుంది మేఘన. కాలగమనంలో దేవ్ మంచితనం మేఘన ప్రవర్తనలో మార్పును తీసుకొస్తుంది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. పెళ్లి చేసుకోవాలని కలలు కంటారు. అపార్థాలు, అపోహల కారణంగా సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో కలతలు రేగుతాయి. దేవ్‌కు దూరంగా వెళ్లిపోతుంది మేఘన. ఆ తర్వాత ఏం జరిగింది?మేఘన ప్రేమ కోసం తపించిన దేవ్ ఏం చేశాడు?వారిద్దరు ఎలా ఏకమయ్యారు అన్నదే మిగతా కథ...

సినిమాలో ప్రధాన అంశం ప్రేమ అయినప్పుడు కథను నడిపించడానికి బలమైన సంఘర్షణ ఉండాలి. అది వాస్తవమేననిపించే అనుభూతిని ప్రేక్షకుడిలో కలిగించాలి. తాను ఏం చెప్పాలనుకున్నాడో ఆ పాయింట్‌ను ఎలాంటి తడబాటు లేకుండా అందంగా, నేర్పుగా దర్శకుడు తెరపై చెప్పగలగాలి. అలాకాకుండా అసంపూర్తి కథ, అనాసక్తిని కలిగించే కథనంతో తాను ఏం చెబుతున్నాడో అర్థంకాని అయోమయంలో దర్శకుడే పడిపోతే ఆ సినిమా ప్రేక్షకుల పాలిట ట్రాజెడీగా మారుతుంది. వారి చేత దేవుడా అనిపిస్తుంది. దేవ్ అలాంటి సినిమానే.
భిన్న ధృవాల్లాంటి ఓ జంట ప్రేమకథతో దేవ్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రజత్‌ రవి శంకర్ ఆద్యంతం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు. ప్రథమార్థం మొత్తం పాత్రల పరిచయానికే కేటాయించారు దర్శకుడు. ఇతరులు చెప్పింది కాకుండా మన మనసు చెప్పింది మాత్రమే వినాలనే సిద్ధాంతం కలిగిన కుర్రాడిగా కార్తి పాత్రను ఆవిష్కరించిన దర్శకుడు అతడి మంచితనాన్ని చూపిస్తూ కాలక్షేపం చేస్తూ పోయారు. ఆ సన్నివేశాలన్ని వాస్తవానికి దూరంగా సాగాయి. డబ్బు, ఉద్యోగమే ప్రపంచంగా బతికే అమ్మాయిగా రకుల్‌ప్రీత్‌సింగ్ పాత్రను కథకు ఏం మాత్రం అతకని అనవసరపు సన్నివేశాలతో పొడగిస్తూ పోయాడు. వారి మధ్య పరిచయం, ప్రేమ చిగురించడానికి దారి తీసిన సన్నివేశాలు అన్ని కృత్రిమంగా ఉంటాయి. దేవ్ అంటే ఇష్టం ఉన్నా అతడు ఎక్కడ తనను వదిలివెళిపోతాడోననే సంశయంతోనే నిరంతరంబతికే మేఘన అతడిని అపార్థం చేసుకొనే సన్నివేశాల్లో సంఘర్షణ సరిగా పండలేదు. మేఘన ఊహల్లోనే బతికే దేవ్ ఆమెపట్ల తనకున్న ప్రేమను నిరూపించుకోవడానికి ఎవరెస్ట్ శిఖరం ఎందుకు ఎక్కుతాడో? అది చూసి రకుల్‌ప్రీత్‌సింగ్ దేవ్ ప్రేమను అర్థం చేసుకోవడం ఏమిటో అంతుపట్టదు. దర్శకుడిగానే కాకుండా కథకుడిగా రజత్‌ రవి శంకర్ మెప్పించలేకపోయారు.

కార్తి, రకుల్‌ప్రీత్ సింగ్ పాత్రల నేపథ్యంలోనే కథను నడిపించిన దర్శకుడు వారి కెమిస్ట్రీని తెరపై అందంగా ఆవిష్కరించలేకపోయారు. జీవితానికి, ప్రేమకు మధ్య సంఘర్షణకు లోనయ్యే యువకుడిగా కార్తి నటన బాగుంది. ప్రేమించిన అమ్మాయి దూరమయ్యే సన్నివేశాల్లో ఎమోషనల్‌గా చక్కటి నటనను ప్రదర్శించాడు. రకుల్‌ప్రీత్‌సింగ్ పాత్రలో క్లారిటీ మిస్సయింది. ఆమెలో ఉండే సంశయాల్ని అర్థవంతంగా చెప్పలేకపోయారు. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ లాంటి అనుభవజ్ఞులైన నటీనటులు ఉన్నా వారికి కేవలం అతిథులుగానే చూపించారు దర్శకుడు. వారిని కథలో భాగం చేస్తే బాగుండేది.

హరీష్ జైరాజ్ బాణీల్లో ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఏటో వెళ్లినావే పాట బాగుంది. వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రకృతి అందాలను కథలో భాగం చేసిన తీరు మెప్పిస్తుంది.
ప్రేమికుల మధ్య ఉండే అపోహలు, సంశయాలతో గతంలో తెలుగు, తమిళ భాషల్లో చాలా సినిమాలు వచ్చాయి. కథ, కథనాల్లో ఎలాంటి కొత్తదనం లేకుండా పాత సినిమాల ఛాయలతోనే రొటీన్ లవ్‌స్టోరీగా రూపొందిన దేవ్ ప్రేక్షకుల్ని మెప్పించడం అనుమానమేనని చెప్పవచ్చు.

రేటింగ్:2.25/5


3554
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles