సినిమాల కోసం ఉద్యోగం వదులుకున్నా..

Sun,April 22, 2018 06:50 PM
Cinematographer Ratnavelu exclusive interview

వెండితెరపై ఆయన కెమెరా అద్భుతాల్ని సృష్టిస్తుంది. ప్రతీ ఫ్రేమ్ ఓ అందమైన కథచెబుతుంది. పాత్రలకు ప్రాణం పోస్తుంది. అదే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ప్రత్యేకత. ఛాయా్రగ్రాహకుడిగా ప్రతి సినిమానూ సహజత్వానికి దగ్గరగా దృశ్యకావ్యంగా మలిచేందుకు తపిస్తుంటారాయన. ఆపరేటివ్ కెమెరామన్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించిన రత్నవేలు ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిభావంతుడైన సినిమాటోగ్రాఫర్స్‌లో ఒకరిగా గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా సేతు నుంచి రంగస్థలం వరకూ తన 21 ఏళ్ల సినీ ప్రయాణంపై గురించి రత్నవేలు చెప్పిన ముచ్చట్లివి...

చెన్నై నా స్వస్థలం. పుట్టి పెరిగిందంతా అక్కడే. ఉన్నత విద్యావంతుల కుటుంబం మాది. నాన్న డాక్టర్. అన్నయ్య బీటెక్, ఎమ్‌బీఏ పూర్తిచేశారు. ఓ సోదరి డాక్టర్ అయితే మరొకరు అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. మా కుటుంబం నుండి ఎవరూ సినీ పరిశ్రమలో లేరు. నాకు హాబీగా మొదలైన ఫొటోగ్రఫీపై మెల్లిగా ఇష్టం పెరిగింది. 1987లో వచ్చిన ఓ తమిళ సినిమా నా ఆలోచనల్ని మార్చింది. విద్యావంతులు కూడా సినిమాల్లో రాణించవచ్చని ఆ సినిమాతో అర్థమైంది. ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను. దర్శకుడు మణిరత్నం, సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ సినిమాలకు నేను వీరాభిమానిని. వారిద్దరి కలయికలో వచ్చిన మౌనరాగం, గీతాంజలి, నాయకుడు సినిమాలు చాలాసార్లు చూశాను. కానీ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో అడుగుపెట్టిన తర్వాత ఇండియన్ సినిమాలకు, ప్రపంచ సినిమాలకు ఉన్న బేధమేమిటో అర్థమైంది. యూరోపియన్, ఫ్రెంచ్‌తో పాటు భాషాభేదాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అన్ని సినిమాలూ చూడటం మొదలుపెట్టాను. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో కెమెరామన్ రాజీవ్‌మీనన్ తెరకెక్కిస్తున్న వాణిజ్య ప్రకటనను ప్రత్యక్షంగా చూశాను. ఆయన వర్కింగ్‌ైస్టెల్, నటీనటుల నుంచి అభినయాన్ని రాబట్టుకున్న విధానం నాకు చాలా నచ్చింది. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరిపోవాలని నిర్ణయించుకున్నాను. శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత దూరదర్శన్‌లో గెజిటెడ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగం వచ్చింది. మరోవైపు రాజీవ్‌మీనన్ అసోసియేట్ ఆపరేటివ్ కెమెరామన్‌గా పనిచేసే అవకాశం దొరికింది. తల్లిదండ్రులు ఉద్యోగంలో చేరిపో జీవితం బాగుంటుందని చెప్పారు. నా కలలకు అనుగుణంగా ఉద్యోగాన్ని వదులుకొని రాజీవ్‌మీనన్ వద్ద ఐదో అసిస్టెంట్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించాను. ఎనిమిది నెలల్లోనే అసిస్టెంట్ కెమెరామన్ స్థాయికి ఎదిగాను. ఆ రోజుల్లో రాజీవ్‌మీనన్ ఎక్కువగా వాణిజ్య ప్రకటనలకు పనిచేస్తుండేవారు. నెలకు రెండు యాడ్స్ మాత్రమే తీస్తుండేవారు. నాలుగు రోజులు మాత్రమే పని ఉండేది. మిగిలిన సమయంలో సినిమాటోగ్రఫీ అంటే ఏమిటి? దానికి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలపై ఆయన వద్ద అవగాహన పెంచుకున్నాను. మణిరత్నం దర్శకత్వంలో బొంబాయి చిత్రానికి రాజీవ్‌మీనన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. 72 రోజుల్లో చాలా అద్భుతంగా ఆ సినిమాను రూపొందించారు మణిరత్నం. వృత్తిపరంగా నాకో కొత్త అనుభవాన్ని ఆ సినిమా మిగిల్చింది. నాకు ఇష్టమైన మణిరత్నం, రాజీవ్‌మీనన్‌లతో ఒకేసారి కలిసి పనిచేసే అవకాశం మర్చిపోలేను.

బొంబాయి చిత్రానికి పనిచేసిన అనుభవంతో సొంతంగా వాణిజ్య ప్రకటలను రూపొందించడం మొదలుపెట్టాను. అప్పుడే నా స్నేహితుడి ద్వారా అరవిందన్ అనే తమిళ సినిమాకు కెమెరామన్‌గా పనిచేసే అవకాశం లభించింది. శరత్‌కుమార్, నగ్మా, ప్రకాష్‌రాజ్, పార్తిబన్ వంటి అగ్ర నటీనటుల కలయికలో రూపొందిన చిత్రమది. తొలుత ట్రైలర్‌ను రూపొందించమని చెప్పారు. అది బాగుంటే సినిమా అవకాశమిస్తామని అన్నారు. నేను చిత్రీకరించిన ట్రైలర్ శరత్‌కుమార్‌తో పాటు దర్శక నిర్మాతలకు బాగా నచ్చింది. దాంతో ఓ పెద్ద సినిమాటోగ్రాఫర్‌ను పక్కనపెట్టి నాకు కెమెరామన్‌గా అవకాశమిచ్చారు. వెంటనే వారి ఆఫర్‌ను అంగీకరించలేదు. నా సమ్మతిని చెప్పడానికి ఇరవై నాలుగు గంటలు సమయం కావాలని అడిగాను. అప్పటివరకు వాణిజ్య ప్రకటనల కోసం తక్కువ మంది నటీనటులు, పరిమితుల మధ్య పనిచేసే నాకు ఒకేసారి ఎక్కువ మందితో షూటింగ్, చాలా కెమెరాలతో పనిచేయడమంటే భయం వేసింది. ధైర్యం చేసి సినిమాను అంగీకరించాను. సినిమాటోగ్రాఫర్‌గా ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. బాలా దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా తెరకెక్కిన సేతు చిత్రం నా సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. తక్కువ బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులనూ తెచ్చిపెట్టింది. ఛాయాగ్రాహకుడిగా నాకు ఎనలేని పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చింది. తొలుత 20 ప్రింట్లతో విడుదలైన ఈ చిత్రానికి ఆ తర్వాత మెల్లగా ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. తొలుత ఆ సినిమాను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. విడుదలకు ముందు యాభై ప్రివ్యూలను వేశారు. ఎన్నో కష్టాల కోర్చి సినిమా చేస్త్తే ఇలా అవుతుందేమిటి అనుకొని బాధపడ్డాం. అయినా బాలా, విక్రమ్, నేను ధైర్యాన్ని కోల్పోలేదు. మా నమ్మకం నిజమై సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్‌గా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇండస్ట్రీలోకి వచ్చి 21 ఏళ్లు అవుతుంది. 24 ఏళ్ల వయసులో సినిమాటోగ్రాఫర్‌గా నా సినీ జీవితాన్ని మొదలుపెట్టాను. సుకుమార్‌తో 14 ఏళ్ల అనుబంధం నాది. ఆయన దర్శకుడిగా పరిచయమైన ఆర్య సినిమాతో నేను తెలుగులో అడుగుపెట్టాను. నాన్నకు ప్రేమతో, 100 పర్సెంట్ లవ్ తప్ప సుకుమార్ దర్శకత్వం వహించిన ప్రతీ సినిమాకు నేనే సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాను. ఒకరిపై మరొకరికి ఉన్న నమ్మకం, గౌరవమే ఇన్నేళ్లు మేమిద్దరం కలిసి పనిచేయడానికి స్ఫూర్తినిచ్చింది. తెలుగు చిత్రసీమలో ఉన్న గొప్ప స్క్రీన్‌ప్లే రైటర్స్‌లో ఆయన ఒకరు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా కథల్ని సన్నివేశాల్ని తెరకెక్కించాలని ఇద్దరం ఆలోచిస్తాం. ఈ ఆలోచన విధానమే మమ్మల్ని కలిపింది.

2010 సమయంలో ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మక సినిమా రోబో చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. హాలీవుడ్ నుంచి స్ఫూర్తి పొంది ఏదో ఒకలా సినిమాను పూర్తిచేయాలనే ఆలోచనతో కాకుండా మా సర్వశక్తుల్నీ ఒడ్డి రూపొందించాం. నా కెరీర్‌లో ఇప్పటివరకూ ఎక్కువగా కష్టపడిన సినిమా అదే. కంప్యూటర్‌గ్రాఫిక్స్ పరంగా కొత్త ఒరవడికి నాంది పలికింది. బాహుబలితో పాటు ఎన్నో గొప్ప సినిమాల్ని తెరకెక్కించడానికి స్ఫూర్తిని నింపింది. ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్స్ మధ్య పోటీ ఎక్కువగా ఉంది. ఈ తరుణంలో రజనీకాంత్, చిరంజీవి, సూర్య లాంటి అగ్రనటులు తమ సినిమాలకు నన్నే సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయమని కోరడం ఆనందంగా ఉంది. సినిమాల పట్ల నాకున్న ఇష్టం, తపనతో పాటు నాణ్యమైన పనితనమే నా విజయానికి కారణమని అనుకుంటున్నాను. ప్రతి సినిమాను అందంగా, సహజంగా నాదైన శైలిలో తెరపై ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాను. చాలా వేగంగా పనిచేస్తాననే పేరూ నాకుంది. డబ్బు కోసం ఆలోచించి ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయడం నాకు రాదు. ఓ సినిమాను అంగీకరిస్తే దానికి వందశాతం న్యాయం చేయాలని తపిస్తాను. అందుకే ఇండస్ట్రీలో అడుగుపెట్టి 21 ఏళ్లయినా ఇప్పటి వరకు 25 సినిమాలకు మాత్రమే పనిచేశాను. భవిష్యత్తులో తప్పకుండా దర్శకత్వ బాధ్యతల్ని చేపడుతాను. సినిమాటోగ్రాఫర్‌కు దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం పెద్ద కష్టమేమీ కాదని అనుకుంటున్నాను. ఛాయాగ్రహకుడిలో మంచి కథకుడు ఉంటాడని నమ్ముతాను. షూటింగ్‌కు ప్యాకప్ చెప్పగానే ప్రతిరోజు అరగంటైనా సాంకేతిక పరిజ్ఞానం పరంగా వస్తున్న మార్పుల్ని ఇంటర్‌నెట్‌లో చూసి తెలుసుకుంటాను. సాంకేతిక పరిజ్ఞానం ఒక్కటే సినిమా విజయానికి ఉపయోగపడదని నా నమ్మకం. దానికి మనవైన, భావోద్వేగాలు మేలవిస్తూ కథను అందంగా చెప్పినప్పుడే విజయాన్ని అందుకోగలం. కథకు మాత్రమే నేను విలువ ఇస్తాను. సుకుమార్ నా స్నేహితుడైనా అతడు కథ చెప్పిన తర్వాతే అంగీకరించిన సినిమాలు చేశాను.తెలుగు సినిమా గమనంలో పదేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం పలు విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఉన్నత విద్యావంతులైన దర్శకనిర్మాతలు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి కొత్త ఆలోచనలతో సినిమాలు చేస్తున్నారు. మార్కెట్ చాలా అభివృద్ధి చెందింది. విదేశాల్లో తెలుగు సినిమాలు మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. ఒకప్పుడు సినిమాలు 200 నుంచి మూడు వందల ప్రింట్లతో విడుదల చేస్తుండేవారు. అలాంటిది రోబో సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రింట్లతో విడుదల చేశాం. ప్రతి సినిమా మార్కెట్, వసూళ్ల పరంగా కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తున్నది. తెలుగు చిత్రసీమలో 25కి పైగా అగ్ర నటులు ఉండటం ఇండస్ట్రీ అభివృద్ధికి దోహదం చేస్తున్నది. ఎక్కువ మంది హీరోలు ఉన్నప్పుడే కొత్త కథలు వస్తాయి.

సినిమాటోగ్రాఫర్‌గా ప్రతి సినిమాలో వైవిధ్యం కనబరచడానికే ప్రయత్నిస్తాను. మూసధోరణితో పనిచేయడం నాకు నచ్చదు. గతంలో నేను చేసిన సినిమాల్ని ఇప్పుడు చూసుకుంటే నాకే పూర్తిగా నచ్చవు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలో నా సినిమాటోగ్రఫీకి చాలామంది పేరు వచ్చింది. బాగా చేశానని చాలామంది మెచ్చుకున్నారు. అలాగని ప్రతిసారి అలాగే పనిచేస్తానంటే కుదరదు. ఆ శైలి నుంచి వెంటనే బయటకు వచ్చి మళ్లీ కొత్తగా రోబో సినిమా కోసం ప్రయత్నించాను. తాజాగా రంగస్థలం నా గత చిత్రాలకు పూర్తిభిన్నంగా గ్రామీణ నేపథ్యంలో విజువల్స్ ద్వారానే నేచురల్‌గా కథ చెప్పడానికి ప్రయత్నించాను. మనం చేస్తున్న పనిలో కొత్తదనం కనిపించినప్పుడే వృత్తిలో సంతృప్తి దొరుకుతుందని నమ్ముతాను. ప్రతి రోజు కొత్త విషయాల్ని నేర్చుకోవడానికే ఇష్టపడతాను. అంతిమంగా ఓ సినిమా హిట్టయినప్పుడే రియల్ సక్సెస్ అందుకున్నట్లుగా భావిస్తున్నాను.. సేతు తర్వాత సినిమాటోగ్రాఫర్‌గా నాకు ఎక్కువ సంతృప్తిని మిగిల్చిన చిత్రం రంగస్థలం. ఈ సినిమా కోసం 1980 నాటి కాలాన్ని, గ్రామీణ వాతావరణాన్ని పాత్రల్ని సహజత్వానికి దగ్గరగా చూపించడానికి చాలా హార్డ్‌వర్క్ చేశాం. సవాల్‌గా భావించి ఈ సినిమా చేశాం. అంతిమంగా ఈ సినిమా బ్లాక్‌బాస్టర్‌గా నిలవడం ఆనందంగా ఉంది. మహేష్‌బాబుతో పాటు ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి మెచ్చుకుంటున్నారు. సినిమాలోని ప్రతిషాట్‌ను గురించి వివరంగా చెప్పడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇమ్మాన్యుయేల్ లుబెజ్కీ(మెక్సికో) జానుస్జ్ కిమిన్‌స్కీ(పోలాండ్) నా అభిమాన సినిమాటోగ్రాఫర్స్. వారి సినిమాలన్నీ చూస్తుంటాను. దక్షిణాదిలో రాజీవ్‌మీనన్, పీసీశ్రీరామ్ అంటే చాలా ఇష్టం. రంగస్థలం తర్వాత చిరంజీవి కథానాయకుడిగా తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రానికి పనిచేస్తున్నాను. తొలుత రంగస్థలంతో బిజీగా ఉండటంతో ఈ సినిమాకు పనిచేసే అవకాశాన్ని వదులుకున్నాను. కానీ చిత్రీకరణ ఆలస్యంగా మొదలవడంతో చేజారిన అవకాశం నన్నే వెతుక్కుంటూ వచ్చింది. ఓ సినిమా తర్వాత వెంటనే మరో సినిమా మొదలుపెట్టడం నాకు నచ్చదు. అందుకే ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలు ప్రత్యేకంగా కసరత్తులు చేశాను. చిత్రీకరణ చాలా బాగా వస్తుంది.
-నరేష్ నెల్కి, సెల్ : 9182777280

6354
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles