టైం మెషిన్ కథాంశంతో చిరంజీవి కొత్త సినిమా

Sat,May 12, 2018 02:24 PM
Chiranjeevis new movie based on time machine story

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి తాజాగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ తేజ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కతుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుండగానే మరో వైపు చిరు తన తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేశారు. మహానటి సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకోవడమే గాక ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న దర్శకుడు నాగ్ అశ్విన్ మెగా స్టార్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

కీర్తి సురేష్ టైటిల్ రోల్‌లో నటించిన మహానటి చిత్రం మే 9వ తేదీన విడుదల కాగా బాక్సాఫీస్ వద్ద చక్కని విజయం సాధించింది. ఈ క్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు స్వప్న, ప్రియాంకలు మెగాస్టార్ చిరును ఆయ‌న ఇంట్లో కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి వారికి చిత్ర విజయం పట్ల అభినందనలు తెలిపారు. అనంతరం తన తదుపరి చిత్ర వివరాలను చిరంజీవి వెల్లడించారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తన కొత్త సినిమా ఉంటుందని చిరంజీవి ప్రకటించారు. ఆ సినిమాను వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తుందని అన్నారు. తాను గతంలో ఆ సంస్థ బ్యానర్‌లో నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే త్వరలో అదే బ్యానర్‌పై తన తదుపరి సినిమా ఉంటుందని అన్నారు. ఆ సినిమా ఎన్‌టీఆర్ నటించిన పాతాళభైరవి సినిమాను పోలి ఉంటుందని, టైం మెషిన్ కథాంశంతో సినిమా సాగుతుందని తెలిపారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేయడానికి ఏడాది పడుతుందని అన్నారు. కాగా మరో వైపు చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

3873
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS