ప్రముఖ దర్శకుడు, నిర్మాత విజయ బాపినీడు(82) ఈ రోజు ఉదయం తన స్వగృహంలో కన్నుమూశారు. దాదాపు 22కి పైగా సినిమాలకి దర్శకత్వం వహించిన బాపినీడు చిరంజీవి, శోభన్‌బాబులతో పాటు పలువురు స్టార్స్‌తో హిట్ చిత్రాలు చేశారు. విజయ అనే పత్రిక నడపడం ద్వారా విజయాన్ని తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా బాపినీడు ఇంటికి వెళ్లి ఆయన పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిరంజీవి- బాపినీడు కాంబినేషన్లో వచ్చిన ఖైదీ నెం 786, గ్యాంగ్ లీడర్ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన సంగతి తెలిసిందే. చిరంజీవి హీరోగా వచ్చిన 'మగ మహారాజు'తో ఆయన దర్శకుడిగా మారారు.విజయ బాపినీడు మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, సినీ నటుడు మంచు మోహన్ బాబు సంతాపం వ్యక్తం చేశారు. బాపినీడు మరణం తననెంతో బాధించిందని మోహన్ బాబు అన్నారు. మయూరి సంస్థలో పని చేస్తున్నప్పటి నుండి ఆయనతో సాన్నిహిత్యం ఉందని పేర్కొన్నారు. ఆయన గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. దర్శకుడిగాననే కాదు మంచి రచయిత, సంపాదకుడు. అభిరుచి గల నిర్మాత. ఆయనలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు అని మోహన్ బాబు తెలిపారు. గురువారం రోజు విజయ బాపినీడు అంత్యక్రియలు జరపనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అమెరికాలో ఉన్న ఆయన పెద్ద కుమార్తె రావడానికి సమయం పడుతున్న కారణంగా గురువారం జరపనున్నట్టు తెలుస్తుంది. మహా ప్రస్థానంలో విజయ బాపినీడు అంత్యక్రియలు జరగనున్నాయి.