ఛలో మూవీ రివ్యూ..

Fri,February 2, 2018 05:17 PM
chalo movie review


ఊహలు గుసగుసలాడే, కల్యాణవైభోగమే, జ్యో అచ్యుతానంద చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు నాగశౌర్య. గత కొంతకాలంగా ఆయన నటించిన సినిమాలేవి సరైన ఫలితాల్ని అందుకోకపోవడంతో కథల ఎంపికలో తన పంథాను మార్చుకున్నారు. విజయం కోసం ఛలో సినిమాతో వినోదాల దారి పట్టారు. నాగశౌర్య తల్లిదండ్రులు ఉష, శంకర్‌ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు. వెంకీ కుడుముల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. నాగశౌర్య ఈ సినిమాతో మళ్లీ విజయాల బాట పట్టాడో? లేదో?చూద్దాం.

హరి(నాగశౌర్య) హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతుంటాడు. చిన్నప్పటి నుంచి గొడవలంటే మహాసరదా. తనకు సంబంధం లేకపోయినా తగాదాల్లో తలదూర్చుతుంటాడు. అతడి పోరు భరించలేక తల్లిదండ్రులు హరిని ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లోని తిరుప్పురం అనే ఊరిలోని కాలేజీకి పంపిస్తారు. ఆ ఊళ్లో తెలుగు వారికి, తమిళులకు కొన్ని ఏళ్లుగా శత్రుత్వం ఉంటుంది.ఆ ఊరి జమీందార్ రెండు వర్గాలను విభజిస్తూ ఓ కంచెను ఏర్పాటుచేస్తాడు. ఒకరివైపు మరొకరు రాకూడదనే ఆజ్ఞలు జారీచేస్తాడు. ఆ ఊరిలో అడుగుపెట్టిన హరి పొరపాటుగా తమిళులు నివసించే ప్రాంతం వైపు వెళతాడు. అక్కడివారి అతడిని చంపడానికి ప్రయత్నిస్తారు. వారి బారి నుంచి ప్రాణాలతో బయటపడతాడు హరి. కాలేజీలో తొలిచూపులోనే కార్తీక(రష్మిక మందన) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమె కూడా హరిని ప్రేమిస్తుంది. ఇద్దరు ఒకటయ్యే తరుణంలోనే కార్తిక తమిళ అమ్మాయనే నిజం హరికి తెలుస్తుంది. హరి తెలుగవాడు కావడంతో తన కూతురును అతడికి ఇవ్వడానికి కార్తీక తండ్రి(మైమ్‌గోపి) నిరాకరిస్తాడు. తన ప్రేమ కోసం రెండుగా విడిపోయినా ఆ ఊరిని ఏకం చేయడానికి హరి ఏం చేశాడు? ఆ ఊరు రెండుగా విడిపోవడానికి కారణమేమిటన్నదే ఈ చిత్ర కథ.

భాషల మధ్య ఉన్న వైరుధ్యాల కారణంగా విడిపోయినా ఓ ఊరిని కలపడం కోసం హీరో చేసే ప్రయత్నాలు, అందుకు ఎంచుకున్న మార్గాలతో ఆద్యంతం వినోదభరితంగా ఈ సినిమా సాగుతుంది. సున్నితమైన ఈ అంశాన్ని ఎక్కడ తడబాటు లేకుండా ప్రతి సన్నివేశం నుంచి చక్కటి హాస్యాన్ని రాబట్టుకున్నారు దర్శకుడు వెంకీ కుడుముల. కాలేజీలో బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలు, తెలుగు, తమిళ విద్యార్థుల మధ్య తగువులు, వారిని కలపడానికి హీరో చేసే ప్రయత్నాలు విఫలమయ్యే సన్నివేశాలు నవ్విస్తాయి. సత్య, సుదర్శన్, వైవా హర్ష కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు, ద్వితీయార్థంలో వెన్నెల కిషోర్ పాత్ర సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అయితే ప్రథమార్థంలో ఉన్న స్పీడు ద్వితీయార్థంలో కొంత తగ్గుతుంది. ఊరు విడిపోయే కారణం నుంచి కూడా దర్శకుడు వినోదాన్ని పండించాలని అనుకున్నారు. ఆ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. వాటిని మరింత బలంగా రాసుకుంటే బాగుండేది. దర్శకుడిగానే కాకుండా సంభాషణల రచయితగా వెంకీ కుడుముల ఆకట్టుకున్నారు. తొలి సినిమా అయినా ఆ అనుభూతి కలగకుండా చాలా చక్కగా సినిమాను మలిచారు.

గొడవలంటే అమితంగా ఇష్టపడే కుర్రాడిగా నాగశౌర్య పాత్రచిత్రణ విభిన్నంగా సాగుతుంది. తన పంథాకు భిన్నమైన పాత్రతో ఆకట్టుకున్నాడు. ఆద్యంతం అతడి పాత్ర హుషారుగా తీర్చిదిద్దారు వినోదంతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కటి నటనను ప్రదర్శించాడు. కన్నడ కథానాయిక రష్మిక మందనగ్లామర్, అభినయంతో ఆకట్టుకుంటుంది. తెలుగులో తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నది. వెన్నెలకిషోర్, సత్య, వైవాహర్ష, రఘుబాబు, నరేష్‌తో పాటు తెలుగు చిత్రసీమలోని హాస్యనటులంతా నవ్వించారు. తమిళ నటులు గుండు రాజేంద్రన్, మైమ్‌గోపి పాత్రలను ఆకట్టుకుంటాయి.

సాంకేతికంగా సాయిశ్రీరామ్ ఛాయాగ్రహణం, మహతి స్వరసాగర్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. మెలోడీ ప్రధానంగా సాగే మహతి స్వరసాగర్ బాణీలు వీనులవిందుగా సాగాయి. నేపథ్య సంగీతం కథను మరింత శక్తివంతంగా ఆవిష్కరించడానికి దోహపడింది. ఉషా మూల్పూరి, శంకర్‌ప్రసాద్ మూల్పూరి నిర్మాణ విలువలు బాగున్నాయి. కొడుకు కథానాయకుడిగా నటించిన సినిమా కావడంతోనిర్మాణపరంగా ఎక్కడ రాజీపడకుండా తెరకెక్కించారు.

సీరియస్ కథాంశానికి వినోదాన్ని జోడించి తెరకెక్కించిన చిత్రమిది. కామెడీయే ఈ సినిమాను పెద్ద ఎస్సెట్. వినోదాత్మక చిత్రాలను ఇష్టపడే వారిని ఈ చిత్రం తప్పకుండా అలరిస్తుంది. అయితే కథలోని లాజిక్‌లు ఆలోచించకుండా..మనసారా నవ్వుకుంటే సినిమా పూర్తి సంతృప్తినిస్తుంది. అయితే దర్శకుడు ఇంకాస్త శ్రద్ధ తీసుకుని మిగతా భావోద్వేగాలపై దృష్టి సారిస్తే ఛలో అన్ని వర్గాలను అలరించే సినిమాగా రూపుదిద్దుకునేది. ఏది ఏమైనా, నేటి ప్రేక్షకులు కోరుకునే కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రం ఫక్తు టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్‌గా వినోదాన్ని పంచుతుంది.

రేటింగ్: 3/5

4689
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles