బాహుబ‌లి స్టార్‌కి శుభాకాంక్ష‌ల వెల్లువ‌

Wed,October 23, 2019 08:41 AM

తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటి చెప్పిన బాహుబ‌లి సినిమాతో ఆ హీరో పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా పాకింది. ఆయ‌న‌పై అభిమానం హ‌ద్దులు లేకుండా చేసింది. ఆ హీరోని ఎల్ల‌లు దాటి మ‌రి ప్రేమించేలా చేసింది. మ‌రి ఆ హీరో ఎవ‌రో కాదు డార్లింగ్ ప్ర‌భాస్. బాహుబ‌లి కోసం దాదాపు నాలుగున్న‌ర ఏళ్లు క‌ష్ట‌ప‌డ్డ ప్ర‌భాస్ అందుకు త‌గ్గ ప్ర‌తిఫ‌లం పొందాడు. నేష‌న‌ల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఎంత ఎదిగిన ఒదిగి ఉండాల‌నే గుణం ప్ర‌భాస్‌ది. ఈ రోజు ఆయన బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌ల వెల్లువ కురుస్తుంది.


2002లో ఈశ్వ‌ర్ సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైన ప్రభాస్ వ‌ర్షం సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో ప్ర‌భాస్‌కి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ ఇటు క్లాస్ అటు మాస్ చిత్రాలు చేశాడు. ఛ‌త్ర‌ప‌తి చిత్రం ప్ర‌భాస్‌కి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మ‌రింత పెరిగేలా చేసింది. డార్లింగ్, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌, మిర్చి ఇలా వ‌రుస హిట్స్ తో స్టార్ స్టేట‌స్ పొందాడు ప్ర‌భాస్. అయితే మంచి క్రేజ్ ఉన్న సమ‌యంలో సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌భాస్ అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయేలా బాహుబ‌లి సినిమా కోసం ఐదుఏళ్ళు కాల్ షీట్స్ ఇచ్చాడు.

బాహుబ‌లి సినిమా విజ‌యం వెనుక రాజ‌మౌళి క‌ష్టం ఎంత ఉందో, అంత క‌న్నా ఎక్కువ ప్ర‌భాస్ క‌మిట్‌మెంట్ ఉంద‌నే చెప్పాలి. బాహుబ‌లి సినిమా కోసం ఐదేళ్ళ పాటు రేయింబ‌వ‌ళ్ళు క‌ష్ట‌ప‌డ్డాడు. రాజ‌మౌళి డీలాప‌డ్డ స‌మ‌యంలోను అత‌నిలో ధైర్యం నింపి తెలుగు సినిమా ఖ్యాతి ఎల్ల‌లు దాటించిన బాహుబ‌లి చిత్రం రూపొందేలా చేశాడు. టాలీవుడ్‌లో సినిమాకి సంబంధించిన ఏ రికార్డ్ అయినా కూడా నాన్ బాహుబలి అనే క్యాటగిరిలో లెక్కిస్తున్నారు. ఇంత‌టి ఘ‌న‌కీర్తిలో ప్ర‌భాస్ హ‌స్తం లెక్కకి మించి ఉంద‌నే చెప్పాలి.

ఆర‌డుగుల క‌టౌట్‌గా చెప్పుకునే ప్ర‌భాస్ బాహుబ‌లి లాంటి భారీ విజ‌యం సాధించిన‌ప్పుడు కూడా మాములు వ్య‌క్తిగానే ఉన్నాడు. ఏ మాత్రం అహం లేకుండా సాదా సీదాగానే ఉన్నాడు. అంద‌రిని క‌లుపుకుంటూ ముందుకు సాగుతున్నాడు. బాహుబ‌లి భారీ విజ‌యం సాధించిన‌ప్పుడు పొంగిపోని ప్ర‌బాస్, సాహో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న‌ప్పుడు కూడా కుంగిపోలేదు. అందుకే అత‌ను మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అని అంద‌రితో అనిపించుకుంటున్నాడు. త్వ‌ర‌లో మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించ‌నున్న ప్రభాస్ ఇలాంటి పుట్టిన రోజు వేడుక‌లు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని మ‌న‌సారా కోరుకుందాం.

1488
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles