అలీ రాజాపై ఫుల్ ఫైర్.. విల‌నిజం చూపిస్తాన‌న్న త‌మ‌న్నా

Fri,August 2, 2019 08:45 AM
big fight between tamannah and ali

దాదాపు 12 రోజుల త‌ర్వాత బిగ్ బాస్ తొలి కెప్టెన్‌ని ఎంపిక చేశాడు. ప‌ద‌కొండు రోజుల పాటు ఇంటికి కెప్టెన్ లేకుండా న‌డవ‌గా, గురువారం ఎపిసోడ్‌లో వ‌రుణ్ సందేశ్‌, హిమ‌జ‌, అలీ రాజాల‌లో ఒకరిని కెప్టెన్‌గా ఎంపిక చేసుకోవాల‌ని ఇంటి స‌భ్యుల‌ని ఆదేశించాడు బిగ్ బాస్. దీంతో ఎక్కువ మంది వ‌రుణ్ సందేశ్‌కే ఓటు వేయ‌డంతో బిగ్ బాస్ సీజ‌న్ 3 తొలి కెప్టెన్‌గా వ‌రుణ్ ఎంపిక‌య్యాడు. ఇక అంత‌క ముందు జైలులో ఉన్న‌ వ‌రుణ్ సందేశ్, త‌మ‌న్నాలు విడుద‌ల కావ‌డం, ఇంటి స‌భ్యుల‌కి ప‌లు టాస్క్‌లు ఇవ్వ‌డం ఎపిసోడ్ 12లో చూపించారు.

ప‌ద‌కొండో రోజు బిగ్ బాస్ హౌజ్ లివింగ్ రూంలో హిమ‌జ‌, సావిత్రి, అషూ, జాఫ‌ర్ కూర్చొన‌గా హిమజ మిగ‌తా వారితో వ‌రుణ్ సందేశ్ జైలుకి వెళ్ల‌డం గురించి చ‌ర్చించింది. బిహేవియ‌ర్ బాగోలేక‌, స‌రిగ్గా ప‌ర్‌ఫార్మెన్స్ చేయ‌లేద‌ని అనిపించ‌డంతో వ‌రుణ్ సందేశ్ జైలుకి వెళ్లేందుకు సిద్ధ‌మై ఉంటాడ‌ని చెప్పుకొచ్చింది హిమ‌జ‌. ఇది విన్న వితిక‌.. హిమ‌జ‌పై కాస్త ఫైర్ అయింది. ఈ విష‌యాన్నే త‌న భ‌ర్తకి చెప్ప‌గా ఎవ‌రితో ఎలాంటి వాద‌న‌లు చేయ‌కు, కూల్‌గా ఉండ‌మ‌ని స‌ల‌హా ఇచ్చాడు. కాని హిమ‌జ‌.. వ‌రుణ్‌ని ఇలా అన్న‌ద‌న్న విష‌యం తెలుసుకున్న అలీరాజా ఆమెపై కాస్త గ‌రం గ‌రం అయ్యాడు. మిగ‌తా స‌భ్యులు అలీని కూల్ చేసి బ‌య‌ట‌కి తీసుకెళ్ళారు. ఇంత‌లో బిగ్ బాస్ .. వ‌రుణ్ సందేశ్‌, త‌మన్నాల‌ని జైలు నుండి విముక్తి క‌లిపించాడు.

ఇక గురువారం ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి ప‌వ‌ర్ గేమ్‌ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ ప్ర‌కారం గార్డెన్ ఏరియాలో టేబుల్‌పై ఉంచిన డైమండ్‌ని ఎవ‌రైతే ముందు ద‌క్కించుకుంటారో వారు ఇంటి పెత్త‌నం చ‌లాయించొచ్చు అని తెలిపారు. మ‌ళ్లీ బ‌జ‌ర్ మోగే వ‌ర‌కు వారు ఆదేశించిన ప‌నులు మిగ‌తా ఇంటి స‌భ్యులు చేయాల్సి ఉంటుంద‌ని అన్నారు. బ‌జ‌ర్ మోగ‌గా తొలిసారి వ‌రుణ్ సందేశ్ డైమండ్‌ని ద‌క్కించుకున్నాడు. డైమండ్ ద‌క్కించుకునే క్ర‌మంలో వితికాకి చిన్న‌పాటి గాయం కాగా, సావిత్రి కింద ప‌డిపోయింది.

తొలిసారి డైమండ్ అందుకున్న వ‌రుణ్ సందేశ్ కింగ్‌గా మార‌గా, ఆయ‌న మంత్రిగా బాబా భాస్కర్‌ని ఎంచుకున్నారు. ఆయ‌న ఆదేశాల ప్ర‌కారం హిమజ.. వ‌రుణ్ సందేశ్ బ‌ట్ట‌లు ఉత‌క‌గా, బెడ్‌రూంను శ్రీముఖి, మహేష్ స‌ర్ధారు. ఇక బాబా భాస్క‌ర్‌, త‌మ‌న్నాలు నాగిని డ్యాన్స్ తో అల‌రించారు. ఆ త‌ర్వాత రాహుల్‌ని పాటపాడ‌మ‌ని ఆదేశించ‌డంతో ఆయ‌న రంగ రంగస్థలాన పాటను పాడారు. దీనికి జాఫర్‌, పునర్నవిలు త‌మ‌దైన స్టెప్పులు వేసి సంద‌డి చేశారు.

కొద్ది సేప‌టి త‌ర్వాత బ‌జ‌ర్ మోగ‌గా మ‌ళ్ళీ డైమండ్ ద‌క్కించుకునే ప్ర‌య‌త్నం చేశారు ఇంటి స‌భ్యులు. ఈ క్ర‌మంలో అలీరాజా.. సావిత్రిని ప‌క్క‌కు నెట్ట‌డంతో ఆమె బొక్కబోర్లా ప‌డింది. దీంతో అంద‌రు ఆమెని లేపే ప్ర‌య‌త్నం చేయ‌గా, త‌న‌కి ఏమి కాలేద‌ని చెప్పింది సావిత్రి. అలీ రాజానే కిరీటాన్ని అందుకోవాల‌ని కోరింది. దీంతో ఇంటికి కింగ్‌గా అలీ రాజా మారాడు. ఆయ‌న ఆదేశాల ప్ర‌కారం ఇంట్లో ఉన్న మ‌గ‌వారందరిని ఆడ‌వారిగా మార‌మ‌ని వారికి ఆడ‌వాళ్లు సాయం చేయాల‌ని కోరాడు. దీంతో మ‌గ‌వాళ్లు అంద‌రు ఆడవాళ్లుగా మారేందుకు వెళ్ల‌గా జాఫ‌ర్, వ‌రుణ్ సందేశ్‌, వితికా, త‌మ‌న్నాలు మాత్రం సోఫాలో సైలెంట్‌గా కూర్చున్నారు.

ఆడ‌వాళ్ళుగా మారిన మ‌గ‌వాళ్ళు త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో కింగ్ అలీరాజాని ఎంట‌ర్‌టైన్ చేస్తున్న క్ర‌మంలో త‌మ‌న్నా ఒక్క సారిగా అలీపై ఫైర్ అయింది. నువ్వు ఏమ‌న్నా సూప‌ర్ స్టార్‌వి అనుకుంటున్నావా.. తెల్ల‌గా ఉండి, కండ‌లు పెంచిన వాళ్లంద‌రు సూప‌ర్ స్టార్ లు కాలేరు. నువ్వు అయ్యేందుకు ప్ర‌య‌త్నించిన నేను నీకు అడ్డు ప‌డ‌తా. కింగ్ అని చెప్పి ప‌క్క‌న అమ్మాయిని కూర్చో పెట్టుకొని నాట‌కాలు చేస్తున్నావు అంటూ ఘాటు విమ‌ర్శ‌లు చేసింది. ఆమె తీరుని మిగ‌తా ఇంటి స‌భ్యులు త‌ప్పు ప‌ట్టారు. ఇష్టం లేక‌పోతే పార్టిసిపేట్ చేయోద్దు. అంతేకాని ఇలాంటి విమ‌ర్శులు చేయోద్ద‌ని వారు సూచించారు. ఆమెని బ‌య‌ట‌కి తీసుకెళ్ళి స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం కూడా చేశారు. నేను ఇప్ప‌టి నుండి అలీరాజాకి విల‌న్‌గా ఉంటానంటూ జాఫ‌ర్‌తో చెప్పుకొచ్చింది త‌మ‌న్నా .

మూడో సారి హిమ‌జ డైమండ్‌ని అందుకోగా , ఆమె పీఠాన్ని ద‌క్కించుకుంది. మీ గురించి చెప్పుకునే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని త‌మ‌న్నాకి హిమ‌జ అవ‌కాశం ఇవ్వ‌డంతో తన ఫ్లాష్ బ్యాక్ అంతా వివ‌రించింది. చిన్న‌ప్పటి నుండి త‌న‌కి అమ్మాయిలా ఉండడం ఇష్ట‌మ‌ని, పూలు, గాజ‌లు పెట్టి వాళ్ల అమ్మ అమ్మాయిలా త‌యారు చేసేద‌ని పేర్కొంది. ఎలాంటి స‌పోర్ట్ లేక‌పోయిన ఏదో ఒక‌టి సాధించాల‌నే బ‌తుకుతున్నాన‌ని చెప్పింది. ఆ సాధించే పోరాటంలో ఫ్యామిలీని, ప‌ర్స‌ర‌ల్ లైఫ్‌ని మిస్ అయి సింగిల్‌గా బ‌తుకుతున్న‌ట్టు తెలిపింది. త‌న‌కి ఒక‌ప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడ‌ని, వాడు మాన‌సికంగా వేధించాడు. అప్పుడు చ‌నిపోవాల‌ని అనిపించింది. కాని గుండె నిబ్బ‌రం చేసుకొని ధైర్యంగా బ‌తుకుతున్నాను అని త‌మ‌న్నా పేర్కొంది.

లీడ‌ర్‌గా రావాల‌ని అనుకున్నాను. సోష‌ల్ యాక్టివిస్ట్‌గా ఉండాల‌ని అనుకున్నాను.నేనేం త‌క్కువ కాదు అని అనుకొని బ్యూటీని మెయింటైన్ చేస్తున్నాను. 2010లో మిస్ ముంబై కూడా అయ్యాను. రానున్న ట్రాన్స్‌కి నేను రోల్ మోడ‌ల్‌గా ఉండాల‌ని చాలా క‌ష్ట‌ప‌డుతున్నాను. బిగ్ బాస్ ఫ్లాట్ ఫాం అనేది నాకు దేవుడు వ‌రం. అతి త‌క్కువ స‌మ‌యంలో నాకు ఈ అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా గ‌ర్వ‌ప‌డుతున్నాను. ఈ స్టేజ్‌ని త‌ప్ప‌క స‌ద్వినియోగం చేసుకుంటానంటూ భావోద్వేగానికి గురైంది త‌మ‌న్నా. ఆ త‌ర్వాత మాట్లాడిన బాబా భాస్క‌ర్ కోపాన్ని త‌గ్గించుకొని ప్ర‌శాంతంగా ఉండాల‌ని అంద‌రికి స‌ల‌హా ఇచ్చాడు. కోపం వ‌ల‌న జీవితంలో చాలా మిస్ అయ్యానంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ప‌వ‌ర్ గేమ్‌ టాస్క్ టాస్క్‌లో డైమండ్‌ను చేజిక్కించుకుని రాజులుగా మారిన వరుణ్‌ సందేశ్‌, అలీ రెజా, హిమజలలో ఒకరిని బిగ్ బాస్ హౌజ్‌కి మొదటి కెప్టెన్ గా ఎంపిక చేసుకోవాల‌ని ఇంటి స‌భ్యుల‌ని అదేశించాడు. వ‌రుణ్ సందేశ్, అలీ రాజాకి సేమ్ ఓటింగ్ ప‌డ‌గా హిమ‌జ ఓటు వ‌రుణ్‌కి ప‌డ‌డంతో ఆయ‌న ఇంటికి తొలి కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు. దీంతో ఈ వారం ఆయ‌న నామినేష‌న్ నుండి బ‌య‌ట‌ప‌డ్డాడు. దీంతో ఈ వారం ఎలిమినేషన్‌లో శ్రీముఖి, హిమ‌జ‌,జాఫ‌ర్‌, మ‌హేష్‌, వితికా, పున‌ర్న‌వి, రాహుల్ ఉన్నారు. నేటి ఎపిసోడ్‌లో ఇంటి స‌భ్యులు త‌మ జీవిత ప్రయాణంలో ఎదురైన క‌ష్ట‌, సుఖాలు గురించి వివ‌రిస్తూ కంట‌త‌డి పెట్టారు. వారి విష‌యాల‌ని విన్న మిగ‌తా ఇంటి స‌భ్యులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.

3050
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles