జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం అరవింద సమేత. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల కానుంది. స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలతో టీజర్ విడుదల కాగా, ఇందులో జగపతి బాబు డైలాగ్స్, ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. కంట పడ్డావా కనికరిస్తానేమో, వెంటపడ్డానా నరికేస్తా అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానుల రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది. ఇక వినాయక చవితి శుభాకాంక్షలతో ఈ రోజు సాయంత్రం 5.40ని.లకి టీం నుండి ఓ సర్ప్రైజ్ రానుందని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ‘అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రధమార్ధంలో సిద్ధార్ధ్ గౌతమ్ పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్ ద్వితీయార్ధంలో వీర రాఘవగా కనిపించి అలరించనున్నాడట. సెకండాఫ్ లో ఎన్టీఆర్ పాత్ర పవర్ఫుల్ గా ఉండడంతో పాటు ఇది పూర్తి రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ నెల 20న నోవాటెల్లో మూవీ ఆడియో వేడుకని జరపాలని చిత్ర బృందం భావిస్తుందట.