అరవింద సమేత వీరరాఘవ సినిమా రివ్యూ

Thu,October 11, 2018 02:33 PM
aravinda sametha veera raghava Review

ఎన్టీఆర్ ఫ్యాక్షన్ కథ చేసి చాలా ఏళ్లవుతోంది. అలాంటి తను తనని స్టార్‌గా నిలబెట్టిన అదే ఫ్యాక్షన్ కథతో సినిమా చేస్తున్నాడంటే..దానికి మాటల తూటాలతో మాయచేసే త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ తోడైతే ఆ చిత్రంపై అంచనాలు ఏస్థాయిలో వుంటాయో ఊహించుకోవచ్చు. అలాంటి అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల క్రేజీ కాంబినేషన్ కలవడానికి 12 ఏళ్లు పట్టింది. ఇన్నేళ్లుగా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్ వెండితెరపై అద్భుతాన్ని ఆవిష్కరించిందా?. కమర్షియల్ ఫ్యాక్షన్ ఫార్ములాతో వచ్చిన ఈ చిత్రం సగటు ప్రేక్షకుడిని ఏ స్థాయిలో ఆకట్టుకుంది?. మాటలతో మేకింగ్‌తో మెస్మరైజ్ చేసే త్రివిక్రమ్ వెండితెరపై ఎన్టీఆర్ నటి విశ్వరూపాన్ని సమర్థవంతంగా ఆవిష్కరించగలిగాడా? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

పేకాటలో ఒడిపోయిన బసిరెడ్డి(జగపతిబాబు) ఐదు రూపాల కోసం తన ప్రత్యర్థి అయిన నారపరెడ్డి (నాగబాబు) వర్గానికి చెందిన వ్యక్తి తల నరికేస్తాడు. ఆ హత్య నుంచి రెండు ఊళ్ల మధ్య వైరం మొదలవుతుంది. ఒక వర్గాన్ని మరో వర్గం నరుక్కోవడం 30 ఏళ్లుగా నిత్యకృత్యంగా మారుతుంది. ఈ దశలో నారపరెడ్డి కుమారుడు వీరరాఘవరెడ్డి (ఎన్టీఆర్) ఊళ్లోకొస్తాడు. అది తెలిసిన బసిరెడ్డి మందీ మార్బలంతో ఊరి పొలిమేరళ్లో మాటు వేసి దాడి చేస్తాడు. ఆ దాడిలో నారపరెడ్డి చనిపోతాడు. కళ్లముందు తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని వీరరాఘవరెడ్డి కత్తిపట్టి ఉగ్రనరసింహుడై బసిరెడ్డి పీక కోస్తాడు?. ఆ తరువాత ఏం జరిగింది?. కసితో కత్తిపట్టిన వీరరాఘవరెడ్డి నానమ్మ మాట విని సీమ వదిలి ఎందుకు వెళ్లిపోయాడు?. అనుకోని పరిస్థితుల్లో పరిచయమైన అరవింద అతనిలో ఎలాంటి మార్పులకు కారణమైంది?. హింసను వద్దనుకున్న వీరరాఘవరెడ్డి సంకల్పం నెరవేరిందా? లేదా అనేది తెరపైన చూడాల్సిందే.

అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు వాడే గొప్పోడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత ఏం జరిగింది? ఎలాంటి భీతావాహ వాతావరణం వుంది. దాన్ని ఎలా ఎదుర్కొన్నారు అనే అంశం ఆధారంగా త్రివిక్రమ్ ఈ కథను అళ్లుకున్నారు. పగలు ప్రతీకారాల్ని పక్కన పెట్టాలనే సందేశాత్మక కథాంశాలతో గతంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. దానికితోడు మళ్లీ ఫ్యాక్షన్ ఫార్ములా కథ అనగానే గత చిత్రాలకు భిన్నంగా వుంటుందా? అని ఎన్టీఆర్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు ఈ సినిమా ఎలా వుంటుందో అని ఎదురుచూశారు. ఆ అంచనాలకు అనుగుణంగానే ఫ్యాక్షన్ కథలకు పూర్తి భిన్నంగా దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఫ్యాక్షన్ కథల్లోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. ముఠా కక్షల కోసం కత్తిపట్టుకుని బయటికి వెళ్లిన భర్త క్షేమంగా వస్తాడా? రాడా? అని తల్లడిల్లే ఓ భార్య కోణంలో ఈ చిత్రాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇలాంటి కథని ఎన్టీఆర్ చేయడం ఓ సాహసమే. మొదటి ఇరవై నిమిషాలు పతాక స్థాయి సన్నివేశాల తరహాలో సాగిన ఈ చిత్ర గమనం ఆ తరువాత హైదరాబాద్‌కు చేరి మందగిస్తుంది. హీరో, హీరోయిన్‌ల పరిచయం, సునీల్ మధ్య వచ్చే సన్నివేశాలల్లో త్రివిక్రమ్ తన మార్కును చూపిస్తూ కథను పరుగులు పెట్టించాడు. కథకు కీలకంగా నిలిచిన పాత్ర బసిరెడ్డి. కురుడు గట్టిన ఫ్యాక్షనిస్టుగా బసిరెడ్డి పాత్రలో జగపతిబాబును మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. తనకు ఎన్టీఆర్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు నచ్చుతాయి. ద్వితీయార్థంలోనూ..ప్రీ ైక్లెమాక్స్‌లోనూ కథనం మందగించినట్టుగా అనిపిస్తుంది. అయితే ైక్లెమాక్స్‌కు వచ్చేసరికి సినిమాను త్రివిక్రమ్ మళ్లీ గాడిలోకి తీసుకొచ్చాడు. త్రివిక్రమ్ సినిమా అంటే పంచ్‌లు..ప్రాసలు వుండాల్సిందే కానీ ఈ సినిమాలో అవి వినిపించవు.

త్రివిక్రమ్‌లోని రచయిత, దర్శకుడు కలిసి సినిమా ఆద్యంతం రక్తికటించారు. అయితే తొడగొట్టి మీసాలు తిప్పడమేనా మగతనం...పాలిచ్చి పెంచిన చేతులు పాలించలేవా.. అంటూ ఎన్టీఆర్ నోట పలికే డైలాగ్‌లు ధియేటర్‌లో చప్పట్లు కొట్టిస్తాయి. హీరోయిజాన్ని పక్కన పెట్టి తను అనుకున్న కథను కథగా చెప్పాలని త్రివిక్రమ్ చేసిన ప్రయత్నం అరవింద సమేత వీరరాఘవ. అయితే కొన్ని సన్నివేశాల్ని కుదిస్తే బాగుండేది.
త్రివిక్రమ్ రాసుకున్న కథకు ఎన్టీఆర్ హండ్రెడ్ పర్సంట్ న్యాయం చేశాడు. భావోద్వేగభరిత సన్నివేశాల్లో ఎన్టీఆర్ నటన ఆకట్టుకుంది. ఇంత లోతైన పాత్రలో ఎన్టీఆర్ ఇంత వరకు కనిపించలేదు. ఇటీవల తను చేసిన పాత్రలకు ఈ సినిమాలో చేసిన పాత్ర చాలా భిన్నంగా వుంది. తొలి ఇరవై నిమిషాల్లో ఎన్టీఆర్‌ని ఎగ్రెసీవ్‌గా చూపించిన త్రివిక్రమ్ ఆ తరువాత సన్నివేశాల్లో అందుకు పూర్తిభిన్నంగా చూపించాడు. కథానాయికగా పూజాహెగ్డేని గ్లామర్ కోసం కాకుండా కథలో భాగం చేశాడు దర్శకుడు.

బసిరెడ్డిగా జగపతిబాబు మరో గుర్తుండిపోయే పాత్రలో నటించాడు. వీరరాఘవరెడ్డి కథ చెప్పే పాత్రలో నీలాంబరిగా సునీల్ తన పరిధిమేరకు నటించాడు. తమణ నేపథ్య సంగీంత, రం రుధిరుం, పెనిమిటి, అరవిందట తన పేరు పాటలు ఆకట్టుకుంటాయి. పీఎస్ వీనోద్ ఛాయాగ్రహణం, తమన్ నేపథ్య సంగీతం, నవీన్ నూలి ఎడిటింగ్, హారిక అండ్ హాసిని నిర్మాణ విలువలు బాగున్నాయి. భావోద్వేగభరితంగా సాగిన ఈ సినిమాకు ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ దర్శకత్వ ప్రతిభ బలాన్ని చేకూర్చాయి. యుద్దం చేసేవాడికంటే యుద్ధాన్ని ఆపేవాడే గొప్పోడనే సందేశంతో ఆడవారి ఔన్నత్యాన్ని చాటిచెప్పిన అరవింద సమేత వీర రాఘవ ఎన్టీఆర్ అభిమానులతో పాటు, సగటు ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. పూర్తి కమర్షియల్ ఫార్మట్‌లో తెరెకక్కిన ఈ చిత్రం కమర్షియల్‌గా బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశాలు పుష్కలంగా వున్నాయి.


రేటింగ్: 3.5

8350
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS