ఆనందో బ్రహ్మ సినిమా రివ్యూ

Fri,August 18, 2017 04:34 PM
Anando Bramha cinema review

హారర్ కామెడీ జోనర్ తెలుగులో కొత్తేమీ కాదు. ప్రేమకథా చిత్రమ్, గీతాంజలి, రాజుగారి గదితో పాటు ఈ తరహా కథాంశాలతో తెలుగులో రూపొందిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. మినిమం గ్యారెంటీ అనే ముద్ర పడిపోవడంతో నవతరం దర్శకులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు హారర్ కామెడీ సినిమాల బాట పడుతున్నారు. తాజాగా తాప్సీ కథానాయికగా మహి.వి. రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ చిత్రం ఆనందోబ్రహ్మ. మనుషులను చూసి దయ్యాలు భయపడటమనే కథాంశంతో దర్శకుడు చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకుల్ని ఎలా నవ్వించింది? చాలా కాలం తర్వాత తెలుగులో సినిమా చేసిన తాప్సీకి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందించిందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...

సిద్ధు(శ్రీనివాసరెడ్డి) గుండెజబ్బుతో బాధపడుతుంటాడు. తన ప్రాణం నిలవాలంటే ఇరవై ఐదు లక్షలు అవసరమని డాక్టర్లు చెబుతారు. తులసి(తాగుబోతు రమేష్) తన పిల్లాడి ఆపరేషన్ కోసం కష్టపడి కూడబెట్టుకున్న డబ్బును తాగుడు అలవాటుతో పోగొట్టుకుంటాడు. ఫూట్ల్ రాజుకు(వెన్నెల కిషోర్) రేచీకటితో పాటు చెముడు ఉంటుంది. కానీ తన సమస్యలు ఎదుటివారికి తెలియకుండా జాగ్రత్తపడే క్రమంలో అనుకోకుండా ఓ దొంగతనం నేరంలో ఇరుక్కుంటాడు. వారం రోజుల్లో ఆ డబ్బును తిరిగి చెల్లించి నేరం నుంచి బయటపడాలని చూస్తుంటాడు. బాబు(షకలక శంకర్) సినిమా పిచ్చోడు. ఎప్పటికైనా హీరో అయిపోవాలని కలలుకంటుంటాడు. అతడి బలహీనతను కనిపెట్టిన మాణిక్యం(తనికెళ్లభరణి)హీరోగా అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేస్తాడు. దాంతో తాను అమ్ముకున్న సెలూన్ షాప్‌ను తిరిగి కొనడానికి అతడికి పదిలక్షలు అవసరమవుతాయి. ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి రాము(రాజీవ్‌కనకాల) అనే వ్యక్తి తనకు చెందిన లక్ష్మీనిలయం అనే ఇంట్లో మూడు రోజులు గడిపితే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని ఆశచూపుతాడు.ఆ ఇంట్లో అడుగుపెట్టిన వారికి అక్కడ ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి? ఇంట్లో అడుగుపెట్టిన వారందరు దయ్యాలకు భయపడి పారిపోతే ఈ నలుగురు మాత్రం దయ్యాలను ఎలా భయపెట్టారు? నాలుగు ఆత్మలు ఆ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నాయి? వారి మరణానికి కారకులు ఎవరన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

దయ్యాలను చూసి మనుషులు భయపడటం, వాటి బారి నుంచి తప్పించుకునేందుకు వారి చేసే ప్రయత్నాల నేపథ్యంలో గతంలో తెలుగు తెరపై చాలా హారర్ సినిమాలు వచ్చాయి. మూసధోరణికి భిన్నంగా మనుషులను చూసి దయ్యాలు పడితే అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు మహి.వి.రాఘవ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇలాంటి వైవిధ్యమైన పాయింట్‌కు ప్రధాన పాత్రల బలహీనతలు, సమస్యల్ని మేళవించి సినిమాను వినోదభరితంగా నడిపించే ప్రయత్నం చేశారు. కథలో కొత్తదనం ఉన్న కథనాన్ని మాత్రం రొటీన్ హారర్ సినిమాల తరహాలోనే తీర్చిదిద్దారు. వికృతమైన మేకప్‌లతో మనుషులను దయ్యాలు భయపెట్టే సన్నివేశాలు అనాసక్తిని కలిగిస్తాయి. ప్రథమార్థం మొత్తం పాత్రధారుల పరిచయంతో నడిపించారు దర్శకుడు. ఆ సన్నివేశాలను వినోదాత్మకంగా మలచడంలో విఫలమయ్యారు. జంధ్యాలతో పాటు పలు సినిమాల్లోని పేరడీలను తీసుకొని చేసిన సన్నివేశాలేవి ఆకట్టుకోవు. ద్వితీయార్థంలోనే అసలు కథ మొదలవుతుంది. నాలుగు పాత్రలు లక్ష్మీనిలయంలో అడుగుపెట్టిన తర్వాత వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. పతాక ఘట్టాల్లో వచ్చే మలుపు ఆసక్తిని రేకెత్తిస్తుంది.

సినిమాలో తాప్సీ కథానాయిక అయినా కథ మొత్తం శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ పాత్రల చుట్టే తిరుగుతుంది. వారి పాత్రలే తెరపై ఎక్కువగా కనిపిస్తాయి. అతిగా భయం వేసినపుడు కూడా నవ్వితేనే ప్రాణాలు నిలిచే వింత గుండె జబ్బుతో బాధపడే వ్యక్తిగా శ్రీనివాసరెడ్డి తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. చిరంజీవి, రామ్‌గోపాల్‌వర్మ, కె.ఏ పాల్, రాందేవ్‌బాబాలను అనుకరిస్తూ షకలక శంకర్ చేసే పేరడీ సన్నివేశాలు నవ్వులను కురిపిస్తాయి.అతడి పాత్రే సినిమాకు హైలైట్‌గా నిలిచింది. తనలో ఉండే లోపాల్ని ఎదుటివారికి తెలియకుండా ఉండేందుకు తాపత్రయపడే వ్యక్తి వెన్నెల కిషోర్ మరోసారి తనదైన శైలిలో నవ్వించారు. తనకు అచ్చొచ్చిన తాగుబోతు పాత్రలోనే మరోసారి కనిపించారు తాగుబోతు రమేష్. దయ్యంగా తాప్సీ పాత్రలో ఎలాంటి కొత్తదనం కనిపించదు. అభినయాన్ని ప్రదర్శించడానికి అవకాశం లేదు. కే అందించిన నేపథ్య సంగీతం, అనిష్ తరుణ్ కుమార్ ఛాయగ్రహణం సినిమాకు ప్రాణంపోశాయి. హారర్ సినిమాలోని ఫీల్‌ను ఉన్నతంగా తెరపై చూపించడానికి తోడ్పడ్డాయి. ఆనందో బ్రహ్మ రొటీన్‌కు భిన్నంగా సాగే హారర్ సినిమా. ఈ చిత్రం టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అయితే తక్కువ బడ్జెట్‌తో నిర్మించడంతో ఈ చిత్రం కమర్షియల్‌గా కూడా సేఫ్‌జోన్‌లోకి వచ్చే అవకాశం వుంది.
రేటింగ్: 3/5

5282
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles