అదృశ్య‌మైన అమిత్‌.. ఆశ్చ‌ర్య‌పోయిన హౌజ్ మేట్స్‌

Tue,July 17, 2018 08:41 AM

బిగ్ బాస్ సీజ‌న్ 2.. 37వ ఎపిసోడ్‌లో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. నాలుగో వారంలో భాగంగా ఇంటి నుండి భాను శ్రీ ఎలిమినేట్ అయింది. ఆమె ఇంట్లో లేద‌నే బాధ‌తో అమిత్‌, దీప్తి సున‌య‌న‌లు వెక్కి వెక్కి ఎడ్చారు. అమిత్‌ని రోల్ ఓదార్చ‌గా, దీప్తి సున‌య‌న‌ని గీతా మాధురి కూల్ చేసింది. ఇక ఆ త‌ర్వాత ఈ వారం ఎలిమినేష‌న్ కోసం నామినేష‌న్‌లో భాగంగా ఇంటి స‌భ్యుల‌కి బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. ఇంట్లో ఎక్కువ మంది స‌భ్యుల‌కి ఎవ‌రితో మాట్లాడ‌డం ఇష్టం లేదో ఆ ఇంటి స‌భ్యుడు పేరు చెప్పాల‌ని బిగ్ బాస్ సూచించ‌డంతో ఇంటి స‌భ్యులు అంద‌రు అమిత్ పేరు సూచించారు. దీంతో ఆయ‌న డైరెక్ట్‌గా నామినేట్ అయ్యారు.


అమిత్ ఇంటి నుండి అదృశ్య‌మైపోతాడ‌ని బిగ్ బాస్ సూచించ‌డంతో అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. అదృశ్యం అంటే అమిత్ ఇంట్లోనే తిరుగుతుంటాడు కాని అంద‌రు ఆయ‌న లేన‌ట్టుగా ప్ర‌వ‌ర్తించాలి. మ‌ళ్లీ బిగ్ బాస్ సూచించే వ‌ర‌కు అమిత్‌ని అంద‌రు అదృశ్య‌వ్య‌క్తిలానే ప‌రిగ‌ణించాల‌ని బిగ్ బాస్ కోరారు. ఇక ఆ త‌ర్వాత నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఒక్కో ఇంటి సభ్యుడు లేదా సభ్యురాలు తమకు ఇష్టమైన సభ్యుడు లేదంటే సభ్యురాలిని ఎంచుకుని జంటలుగా ఏర్పడాలని బిగ్ బాస్ చెప్పారు. బిగ్ బాస్ సూచన మేరకు బాబు గోగినేని - రోల్ రైడా, దీప్తి - గణేశ్, కౌశల్ - సామ్రాట్, సునయన - తనీష్, తేజస్వి - నందిని జంటలుగా ఏర్పడ్డారు. ఈ జంటలకు ఈ వారం కెప్టెన్ అయిన గీతా మాధురి సంకెళ్లు వేశారు.

బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా ఇంట్లో ఐదు సార్లు బ‌జ‌ర్ మోగుతుంది. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రిలో ఒక‌రు సంకెళ్ళు విడిపించుకొని త‌న‌కి జ‌త‌గా ఉన్న మ‌రొక‌రిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. చివరికి సంకెళ్లు ఎవ‌రికి ఉంటాయో వారు నామినేట్ అవుతారు. ఈ ప్ర‌క్రియ‌లో భాగంగా తేజస్వి, సామ్రాట్, తనీష్, రోల్ రైడా, దీప్తి ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు.అయితే దీప్తి- గ‌ణేష్ జంట సంకెళ్లు తీసుకోవ‌ల‌సిన స‌మ‌యంలో ఎవ‌రు సంకెళ్ల నుండి విముక్తి పొందాలా అని కాసేపు చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇద్ద‌రికి గేమ్‌లో విజేత‌గా నిల‌వానే కోరిక బలంగా ఉండ‌డంతో సంకెళ్లు ఉంచుకునేందుకు ఇద్ద‌రు ఆస‌క్తి చూప‌లేదు.

నేను ఐదుసార్లు నామినేట్ అయ్యాను కాబట్టి ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ కావాలని నాకు లేదు. నాని అన్న కూడా నీకు నువ్వు ఎందుకు నామినేట్ చేసుకుంటున్నావ్ అని తిట్టారు అని గణేష్ అన్నాడు. దీంతో నిర్ణ‌యాన్ని గ‌ణేష్ కే వ‌దిలేసింది దీప్తి. కాని గణేష్ నిర్ణయం మేరకు కెప్టెన్ గీతా మాధురి అతన్నే విడుదల చేసింది. దీంతో దీప్తి నామినేట్ కావ‌ల‌సి వ‌చ్చింది. అయితే అమిత్‌కి బిగ్ బాస్ ఓ సీక్రెట్ టాస్క్ ఇవ్వగా, ఇందులో ఉండే ఐదు టాస్క్‌ల‌ని పూర్తి చేయాల్సి ఉంటుంద‌ని తెలిపాడు. టాస్క్‌ల‌ని బాత్ రూమ్‌లో లేదా స్మోకింగ్ ఏరియాలోకి వెళ్లి గట్టిగా చదవాల్సి ఉంటుంది. ఇంటి సభ్యులందరికీ ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడాలి అన్నారు.

అమిత్ నువ్వు నామినేషన్ నుంచి బయటపడాలి అంటే ఐదు బజర్లు పూర్తయ్యేలోపు ఈ ఐదు టాస్క్‌లు పూర్తి చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు. మ‌రి బిగ్ బాస్ ఇచ్చిన ఐదు టాస్క్‌లు ఏంటంటే.. సునయనను ఏడిపించాలి, ఎవరైనా ఇంటి సభ్యుడి తలపై గుడ్డు పగలగొట్టాలి, ఎవరైనా ఇంటి సభ్యుడి బట్టలు, షూస్‌ను స్విమ్మింగ్ పూల్‌లో పడేయాలి, ఎవరైనా ఒక ఇంటి సభ్యుడిని డైనింగ్ టేబుల్‌పై డాన్స్ చేసేలా చేయాలి, వండిన ఒక వంటను పాడుచేయాలి. టాస్క్‌లో భాగంగా సున‌య‌న‌ని ఏడిపించాడు. బ‌ట్టలు స్విమ్మింగ్ పూల్ లో వేసాడు. వంట‌ని చెడ‌గొట్టాడు. ఇంటి సభ్యుడు ఒక‌రితో డ్యాన్స్ చేయించాడు. కాని త‌లపై గుడ్డు ప‌గ‌ల‌గొట్టే క్ర‌మంలో గణేష్ తలపై గుడ్డు పగలగొట్టడంతో వార్ మొద‌లైంది.

అమిత్ .. గ‌ణేష్‌తో మాట్లాడుతూ.. నామినేష‌న్‌కి నా వైపు వేలు చూపిస్తావా.. నా కోపం ఎలా ఉంటుందో చూపిస్తానంటూ గ‌ణేష్ త‌ల‌పై బ‌లంగా గుడ్డు ప‌గ‌ల‌గొడ‌తాడు. విష‌యం తెలియ‌ని గ‌ణేష్ , కావాల‌నే అమిత్ ఇలా చేసాడ‌ని వెక్కి వెక్కి ఏడుస్తాడు. గ‌ణేష్ బాధ‌ని చూడ‌లేక అమిత్ ఇది త‌న‌కిచ్చిన సీక్రెట్ టాస్క్ అని చెబుతూ, గ‌ణేష్‌కి సారీ చెబుతాడు. అయితే ఇచ్చిన ఐదింట్లో నాలుగు టాస్క్‌లు విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌డంతో అత‌ను నామినేష‌న్ నుండి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్టు బిగ్ బాస్ చెబుతారు. అంటే ఫైన‌ల్‌గా ఎలిమినేష‌న్‌లో తేజస్వి, సామ్రాట్, తనీష్, రోల్ రైడా, దీప్తి ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన‌ట్టు తెలుస్తుంది. ఇక నేటి ఎపిసోడ్‌లో ఎలాంటి ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయో చూడాలి.

4082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles