మోదీ బ‌యోపిక్‌లో అమిత్ షా లుక్ ఇదే

Wed,February 13, 2019 11:38 AM

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల సీజ‌న్ న‌డుస్తుంది. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జీవిత నేప‌థ్యంలో ఒమంగ్ కుమార్ ‘పీఎం నరేంద్ర మోదీ’ అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. మోదీ పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబేరాయ్ న‌టిస్తుండ‌గా, ఆయ‌న ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌ల విడుద‌లైంది. అహ్మ‌దాబాద్‌లో ప్రారంభ‌మైన ఈ చిత్ర షూటింగ్, గుజ‌రాత్‌లోని ప‌లు ప్రాంతాల‌లోను చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంది. బొమన్‌ ఇరానీ, దర్శన్‌ కుమార్ ,జ‌రీనా వ‌హ‌బ్, మ‌నోజ్ జోషి, ప్ర‌శాంత్ నారాయ‌ణ‌న్‌, బ‌ర్క బిష్ట్ సేన్‌గుప్తా, అక్ష‌త్ ఆర్ స‌లుజా, అంజ‌న్ శ్రీవాత్స‌వ్, రాజేంద్ర గుప్తా, య‌తిన్ క‌రేయ్ క‌ర్ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. న‌రేంద్ర‌మోదీ త‌న రాజ‌కీయ ప్ర‌యాణంలో ముఖ్య‌మంత్రిగా త‌న హ‌వా కొన‌సాగిస్తూ ప్ర‌ధాన మంత్రి ఎలా అయ్యాడో బ‌యోపిక్‌లో చూపించ‌నున్న‌ట్టు నిర్మాత‌లు తెలిపారు.


తాజాగా భాజ‌పా అధ్య‌క్షుడు అమిత్‌ షా పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఆయన పాత్రలో టీవీ న‌టుడు మనోజ్ ‌జోషి నటిస్తున్నారు. అమిత్‌ షా పాత్రలో ఆయన ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నారు. అమిత్ షా పాత్ర‌లో న‌టించ‌మని నిర్మాత కోర‌డంతో మ‌రో మారు ఆలోచించ‌కుండా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాన‌ని మ‌నోజ్ జోషి అన్నారు. నేను పోషించిన ఆస‌క్తిక‌ర పాత్ర‌ల‌లో ఇది ఒక‌టి అని మ‌నోజ్ చెబుతున్నారు. బుల్లితెర‌పైనే కాదు వెండితెర‌పై కూడా ప‌లు పాత్ర‌ల‌లో క‌నిపించారు మ‌నోజ్ జోషి. చివ‌రిగా వ‌రుణ్ ధావన్ జుడ్వా 2, స‌ల్మాన్ ఖాన్ ప్రేమ్ ర‌తన్ ధ‌న్ పాయో చిత్రాల‌లో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించారు. వివేక్‌ తండ్రి సురేశ్‌ ఒబెరాయ్‌, సందీప్‌ సింగ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టుగా తెలుస్తుంది.

1578
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles