అమర్ అక్బర్ ఆంటోని రివ్యూ

Fri,November 16, 2018 04:34 PM
Amar Akbar Anthony Movie Review

తెలుగు చిత్రసీమలో విజయవంతమైన కాంబినేషన్స్‌లో హీరో రవితేజ, దర్శకుడు శ్రీనువైట్లలది ఒకటి. వీరిద్దరి కలయికలో రూపొందిన నీకోసం, వెంకీ, దుబాయ్‌శీను చిత్రాలు మంచి విజయాల్ని అందుకున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత వీరు కలిసి చేసిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ. కొంతకాలంగా రవితేజతో పాటు శ్రీనువైట్ల పరాజయాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇద్దరి కెరీర్‌కు ఈ చిత్రం కీలకంగా మారింది.

ఆనంద్‌ప్రసాద్, సంజయ్ ప్రాణమిత్రులు. భార్యాపిల్లలతో అమెరికాలో స్థిరపడతారు. ఫిడో అనే ఫార్మాకంపెనీకి అధిపతులైన వారు తమ సంస్థలోనే పనిచేసే నలుగురు ఉద్యోగులను(తరుణ్ అరోరా, విక్రమ్ జీత్, ఆదిత్యమీనన్, రాజ్‌వీర్) వాటా దారులుగా చేర్చుకుంటారు. పైకి మంచి వారుగా నటిస్తూనే స్నేహితులిద్దరిని చంపి కంపెనీ హస్తగతం చేసుకుంటారా నలుగురు. ఈ ప్రమాదంలో ఆనంద్‌ప్రసాద్ తనయుడు అమర్(రవితేజ), సంజయ్ కూతురు ఐశ్వర్య(ఇలియానా) ప్రాణాలతో బయటపడతారు. తన కుటుంబాలను బలి తీసుకున్న వారిపై పగను పెంచుకున్న అమర్ ఒక్కొక్కరిని హతమారుస్తుంటాడు. ఈ ప్రయత్నంలో అతడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అనుకోని పరిస్థితుల్లో బాల్యంలోనే ఐశ్వర్యకు దూరమైన అమర్ తిరిగి ఆమెను ఎలా కలుసుకున్నాడు? అన్నదే ఈ చిత్ర కథ.

ప్రతీకారంతో ముడిపడిన కథ ఇది. ఈ పాయింట్‌కు స్లిట్ పర్సనాలిటీ అనే మానసిక వ్యాధిని జోడించి దర్శకుడు శ్రీనువైట్ల ఈ సినిమాను తెరకెక్కించారు. మానసిక సమస్య కారణంగా ఒకే వ్యక్తి ముగ్గురు భిన్నమైన మనుషులుగా ప్రవర్తించడమనే అంశం నుంచి వినోదాన్ని, ఉత్కంఠతను రాబట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే రొటీన్ రివేంజ్ డ్రామాతో కథను రాసుకోవడం, కథనంలో క్లారిటీ లోపించడంతో ఈ చిత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా నిలిచింది. తెలిసిన కథను కొత్తగా చెప్పినప్పుడే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. శ్రీనువైట్ల ఆ దిశగా అడుగులు వేయలేదు. హీరోతో పాటు విలన్ పాత్రలను బలంగా రాసుకోలేదు. దానికి తోడు విలన్‌ను రవితేజ చంపే సన్నివేశాలన్ని ఊహాతీతంగా సాగడం మైనస్‌గా మారింది.

నాయకానాయికల మధ్య ప్రేమకథను హృద్యంగా ఆవిష్కరించే అవకాశం ఉండి కూడా అనవసరపు కామెడీ ట్రాక్‌లకే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. రవితేజతో పాటు ఇలియానా ఇద్దరూ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు చూపించారు. కథలో ఆ అంశాన్ని అంతర్భాగంగా చూపించడంలో శ్రీనువైట్ల తడబడ్డారు. దాంతో ఆ సన్నివేశాలన్నీ గందరగోళానికి గురిచేస్తాయి.

కామెడీని పండించడంలో శ్రీనువైట్ల సిద్ధహస్తుడు. వినోదాన్ని నమ్మి ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ పెద్ద విజయాల్ని సాధించాయి. గత సినిమాల్లో వర్కవుట్ అయినా వినోదం ఈసినిమాలో లోపించింది. వాటా పేరుతో అమెరికాలోని తెలుగు సంఘాలపై విమర్శలు గుప్పిస్తూ శ్రీనివాసరెడ్డి, వెన్నెలకిషోర్, రఘుబాబు, సత్యలతో చేసిన కామెడీ సన్నివేశాల్లో ఒకటి రెండు మినహా పెద్దగా నవ్వించలేకపోయాయి. సునీల్ కామెడీ టైమింగ్, పంచ్ డైలాగుల్లో మునుపటి మ్యాజిక్ కనిపించలేదు.

మూడు భిన్న పార్శాలున్న పాత్రలో రవితేజ చక్కటి నటనను ప్రదర్శించారు. అమర్ పాత్ర భావోద్వేగభరితంగా సాగగా, అక్బర్ మాస్ పంథాలో, ఆంటోనీ క్లాస్ టచ్‌తో కూడి ఉంటుంది. మూడు పాత్రల్లో ఒదిగిపోయారు. సుదీర్ఘ విరామం తర్వాత ఈసినిమాతో తెలుగులో పునరాగమనం చేసింది ఇలియానా. అభినయానికి ఆస్కారమున్న పాత్రలో నటించింది. ఆమె పాత్ర మరింత శక్తివంతంగా ఆవిష్కరిస్తే బాగుండేది. ప్రతినాయకులుగా తరుణ్ అరోరా, విక్రమ్ జీత్, ఆదిత్యమీనన్, రాజ్‌వీర్‌ల నటన, పాత్రలు రొటీన్‌గా ఉన్నాయి. పోలీస్ అధికారిగా అభిమన్యుసింగ్ పాత్రలో అతి ఎక్కువగా కనిపిస్తుంది.
సాంకేతికంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు చెప్పిన కథను నమ్మి అమెరికాలో భారీ హంగులతో ఈసినిమాను తెరకెక్కించారు. వెంకట్.సి. దిలీప్ ఛాయాగ్రహణం బాగుంది. తమన్ బాణీల్లో ఆకట్టుకోలేదు.

దర్శకుడిగానే కాకుండా కథకుడిగా శ్రీనువైట్ల ఈ సినిమాతో నిరాశపరిచారు. నవ్యమైన ఇతివృత్తాలకు పట్టం కడుతున్న ప్రస్తుతం తరుణంలో ఇలాంటి మూసధోరణితో కూడిన ప్రతీకార కథ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కొంత కష్టమేనని చెప్పవచ్చు.

19651
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles