దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ (డీజే) మూవీ రివ్యూ

Fri,June 23, 2017 12:44 PM
Allu Arjun Duvvada Jagannadham DJ Movie Review

రేసుగుర్రం, సరైనోడుతో పాటు వరుసగా మాస్ కథాంశాలతో సినిమాలు చేస్తూ విజయాల్ని దక్కించుకుంటున్నాడు అల్లు అర్జున్. తను ఎంచుకునే ప్రతి కథలో హీరోయిజంతో పాటు మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే అన్ని హంగులు ఉండేలా జాగ్రత్తపడుతున్నారు. ఆ పంథాలోనే ఆయన చేసిన మరో మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం డీజే దువ్వాడ జగన్నాథం. గబ్బర్‌సింగ్‌చిత్రంతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిన హరీష్‌శంకర్ మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకోవాలనే కృతనిశ్చయంతో చేసిన సినిమా ఇది. బన్నీ విజయాల పరంపరను ఈసినిమా కొనసాగించగలిగిందా? హరీష్‌శంకర్ ఈ సినిమాతో మళ్లీ విజయాల బాట పట్టగలిగాడా?లేదా? అనేది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...

బెజవాడలోని సత్యనారాయణపురం అగ్రహారానికి చెందిన బ్రాహ్మణ యువకుడు దువ్వాడ జగన్నాథశాస్త్రి(అల్లు అర్జున్). వంటలు చేయడం అతడి వృత్తి. కుటుంబంతో కలిసి ఓ క్యాటరింగ్ సంస్థను నడుపుతుంటాడు. ఎదుటివాళ్లు కష్టాల్లో ఉంటే సహించిన మనస్తత్వం అతడిది. ఓ పెళ్లిలో ఫ్యాషన్ డిజైనర్ పూజను(పూజహెగ్డే)ను చూసి ఇష్టపడతాడు. తొలుత అతడి ప్రేమను తిరస్కరిస్తుంది పూజ. కానీ అతడి మంచితనాన్ని చూసి ఆమె జగన్నాథశాస్త్రిని ప్రేమిస్తుంది. మరోవైపు పోలీస్ అధికారి పురుషోత్తం(మురళీశర్మ) సహాయంతో హైదరాబాద్‌లో అక్రమార్కులను, రౌడీలను హత్యచేస్తుంటాడు డీజే(అల్లు అర్జున్). అతడికి రొయ్యలనాయుడు(రావు రమేష్) అనే బడా వ్యాపారవేత్తతో వైరం ఏర్పడుతుంది. అందుకు గల కారణమేమిటి? దువ్వాడ జగన్నాథశాస్త్రి, డీజే ఒకరేనా? డీజే హత్యలు ఎందుకు చేస్తుంటాడు? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

ప్రతీకారంతో ముడిపడి ఉన్న మాస్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. సాధారణ కథకు బ్రాహ్మణ నేపథ్యాన్ని జోడించి దర్శకుడు హరీష్‌శంకర్ ఈ సినిమాను రూపొందించారు. గబ్బర్‌సింగ్‌తో మాస్ ప్రేక్షకుల నాడిని పట్టిన హరీష్‌శంకర్ మరోసారి తనకు అచ్చొచ్చిన ఫార్ములాను ఫాలో అయ్యారు. బ్రాహ్మణ శైలికి, సామాజిక ఇతివృత్తాన్ని చక్కగా మిళితం చేశారు. స్కీమ్‌ల, తక్కువ రేటుతో గృహాల పేరిట గతంలో తెలుగు రాష్ర్టాల్లో జరిగిన కొన్ని కుంభకోణాలను స్ఫూర్తిగా తీసుకొని దానికి హీరోయిజాన్ని జోడించి సినిమాను నడిపించిన తీరు బాగుంది. మలుపులు తక్కువగా ఉన్నా కథ, కథనాలు మాత్రం ఆసక్తిని పంచుతాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ పాత్రను తీర్చిదిద్దిన తీరు బాగుంది.

స్వతహాగా బ్రాహ్మణ కుటుంబాల పట్ల అవగాహన కలిగిఉండటం హరీష్‌శంకర్‌కు కలిసివచ్చింది. ఆయన సంభాషణలు ఆసక్తిని పంచుతాయి.ముఖ్యంగా పతాక ఘట్టాలను వినోదాత్మక కోణంలో ముగించిన తీరు కొత్తగా ఉంది. అదే సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. వంటలు చేసే బ్రాహ్మణ యువకుడు జగన్నాథశాస్త్రిగా, అన్యాయాల్ని ఎదురించే డీజేగా భిన్న పార్శాల్లో సాగే పాత్రకు చక్కటి న్యాయం చేశారు అల్లు అర్జున్. బంధాలకు విలువనిచ్చే మంచి మనసున్న యువకుడిగా, అన్యాయాల్ని సహించిన వ్యక్తిగా రెండు పాత్రల మధ్య చక్కటి వైవిధ్యాన్ని ప్రదర్శించారు. బ్రాహ్మణ యువకుడి పాత్ర కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. వంటలతో పాటు పౌరోహిత్యం, వేదాలపై అవగాహన పెంచుకొని నటించారు. అగ్రహారం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్యమైన అనుభూతిని పంచుతాయి.

ఇలాంటి సంప్రదాయ తరహా పాత్రలో అల్లు అర్జున్ కనిపించడం ఇదే తొలిసారి కావడం అభిమానులకు నవ్యమైన అనుభూతిని పంచుతుంది. డీజేగా ైస్టెలిష్ లుక్‌తో కనిపించారు. ఎమోషన్స్‌కు, వినోదాన్ని జోడించి ఆయన పంచిన అభినయం ఆకట్టుకుంటుంది. పూజ హెగ్డే గ్లామర్‌తో అలరించింది. బికినీతో ఆకట్టుకుంది. అభినయ పరంగా ఆమె పాత్రకు ప్రాధాన్యత లేకున్నా అందచందాలతో మంచి మార్కులను సంపాదించింది. ఆ ఒక్కటి అడక్కు సినిమాలో రావు గోపాలరావు నటించిన రొయ్యలనాయుడు పాత్రను స్ఫూర్తిగా తీసుకొని అదే పేరుతో ప్రతినాయకుడిగా రావురమేష్‌ను పాత్రను వినూత్నంగా తీర్చిదిద్దారు. ఆయన సంభాషణలు చెప్పే తీరు వైవిధ్యంగా సాగుతుంది. సుబ్బరాజు పాత్రను వినోదాత్మక కోణంలో మలిచిన తీరు బాగుంది. వెన్నెల కిషోర్, తనికెళ్లభరణి, పోసాని కృష్ణమురళి తమ పరిధుల మేర పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికంగా దేవిశ్రీప్రసాద్ బాణీలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అస్మైక యోగ, సీటీ మార్ గీతాలు మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. దిల్‌రాజు నిర్మాణ విలువలు బాగున్నాయి. కథను నమ్మి ఎక్కడ రాజీపడకుండా సినిమాను తెరకెక్కించారు.

డీజే దువ్వాడజగన్నాథం మాస్ ప్రేక్షకుల్ని వందశాతం సంతృప్తిపరిచే సినిమా. అల్లు అర్జున్ తనదైన శైలి నటనతో సినిమాకు ప్రాణంపోశారు. మాస్‌తో పాటు క్లాస్ ప్రేక్షకుల్ని అలరించే అన్ని హంగులు ఉన్న చిత్రమిది.

13165
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles