'ఏబీసీడీ' మూవీ రివ్యూ

Fri,May 17, 2019 01:27 PM
ABCD movie review

జల్సాలకు అలవాటుపడిన ధనవంతుడైన యువకుడు డబ్బు, అనుబంధాల విలువను ఎలా తెలుసుకున్నాడనే పాయింట్ పాతదే. ఈ తరహా కథాంశాలతో తెలుగులో పిల్లా జమీందార్‌తో పాటు ఎన్నో సినిమాలు రూపొందాయి. అయినా ఈ కథలో కావాల్సినంత వినోదం, ఎమోషన్స్ ఉన్నాయి. అది నచ్చే 2013లో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా తెరకెక్కిన ఏబీసీడీ సినిమాను దర్శకనిర్మాతలు తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు.
గౌరవం, శ్రీరస్తు శుభమస్తు, ఒక్కక్షణం లాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేశారు అల్లుశిరీష్. అయితే కమర్షియల్ సక్సెస్‌ను మాత్రం అందుకోలేకపోయారు. ఒక్కక్షణం తర్వాత దాదాపు కొంత విరామం తీసుకొని శిరీష్ చేసిన సినిమా ఏబీసీడీ. సంజీవ్‌రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మధురశ్రీధర్‌రెడ్డి, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. సురేష్‌బాబు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడం, స్క్రిప్ట్‌లో బీవీఎస్వ్రి, పవన్‌సాధినేని, సుధీర్‌వర్మతో పాటు సత్యానంద్ లాంటి అనుభవజ్ఞుడైన రచయిత సహకారం అందించినట్లు ప్రచార వేడుకల్లో చిత్రబృందం పేర్కొనడంతో మంచి సినిమా అవుతుందని అంతా అనుకున్నారు. వాటికి తోడు పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచాయి.


అభి(అల్లు శిరీష్) ఓ మిలియనీర్ కొడుకు. అమెరికాలో తండ్రి సంపాదించిన డబ్బును ఖర్చు చేస్తూ సరదాగా జీవితాన్ని వెల్లదీస్తుంటాడు. తనయుడి భవిష్యత్తు గురించి నిరంతరం మనదపడుతుంటాడు అభి తండ్రి విశ్వప్రసాద్(నాగబాబు). అభికి డబ్బు విలువ తెలియజేయాలని స్నేహితుడు బాషా(భరత్)తో కలిసి అతడిని ఇండియా పంపిస్తాడు. ఇండియా అంటే ద్వేషం ఉన్నా నెల రోజులు సరదాగా గడిపి తిరిగి అమెరికా వెళ్లాలని అభి, బాషా మాతృదేశానికి వస్తారు. తాము తిరిగి అమెరికాకు వెళ్లలేమనే నిజం ఇక్కడకు వచ్చిన తర్వాతే వారికి తెలుస్తుంది. నెలకు ఐదు వేల రూపాయలతో రెండు సంవత్సరాలు ఇండియాలో వారు బతకాల్సివస్తుంది. అలా ఎందుకు జరిగింది? తండ్రి కోరుకున్నట్లుగానే అభి డబ్బు విలువను తెలుసుకున్నాడా? నేహా(రుక్సార్ థిల్లాన్)తో అభి ఎలా ప్రేమలో పడ్డాడు? అభి గమనానికి భార్గవ(రాజా) ఎలా అడ్డువచ్చాడు? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

ధనవంతుడైన ఓ యువకుడు ఒక్కసారిగా పేదరికంలో బతకాల్సివస్తే ఎలా ఉంటుందన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. ఇదే పాయింట్‌ను మలయాళ మాతృకలో చాలా ఎమోషనల్‌గా ఆవిష్కరించారు దర్శకుడు. తెలుగుకు వచ్చేసరికి వినోదానికి ప్రాధాన్యతనిస్తూ కథను నడిపించే ప్రయత్నం చేశారు. నిజంగా వినోదానికి పండించడానికి ఆస్కారం ఉన్నా అలాంటి సన్నివేశాలు రాసుకోవడంలో మాత్రం పూర్తిగా తడబడిపోయాడు.

కథానాయకుడి పరిచయ ఘట్టాలు, ప్లేబోయ్‌గా అతడిని చూపించడం కోసం సృష్టించిన సన్నివేశాల్లోనే దర్శకుడు పట్టాలు తప్పారు. దాంతో సినిమా మొత్తం గజిబిజీగా సాగుతుంది. హీరో తన స్నేహితుడితో కలిసి ఇండియాకు వచ్చిన తర్వాత వారికి ఎదురయ్యే కష్టాలన్ని టైమ్‌పాస్ వ్యవహారంగానే ఉంటాయి తప్ప ఎక్కడ కన్వీన్సింగ్‌గా అనిపించవు. తినడానికి, మందు తాగడానికి డబ్బు ఎలా అడ్జెస్ట్ చేసుకోవాలో అని వారు ఆలోచించే ఘట్టాలతో సినిమాను నింపేశారు. వాటిలో వినోదం చాలా వరకు లోపించింది. వాటికి తోడు మీడియాపై వేసే సైటర్లు కథగమనాన్ని పూర్తిగా పక్కదారి పట్టిస్తాయి. ద్వితీయార్థంలో హీరో సెలబ్రిటీగా మారడం, రాజకీయాలతో ముడిపడిన ఓ సామాజిక సమస్యపై పోరాడే క్రమంలో మంచివాడిగా మారినట్లు చూపించారు. వాటిని ఎమోషన్స్ జోడించి ఆసక్తికరంగా తీర్చిదిద్దితే బాగుండేది. ఆ ప్రయత్నం చేయలేదు. అప్పటివరకు ఇండియాలో బతకడానికి అస్సలు ఇష్ట పడని హీరో చిన్న సంఘటనతో ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా చూపించడం అంతగా అతకలేదు. హీరో, విలన్ మధ్య పోటీని అంతర్లీనంగా చూపిస్తూ కథను నడిపించిన దర్శకుడు పతాక ఘట్టాల్లో పూర్తిగా తడబడిపోయారు. ఎలాంటి మలుపులు లేని చిన్న స్పీచ్‌తో విలన్‌పై హీరో గెలిచినట్లుగా చూపించి ముగించారు. శిరీష్, రుక్సార్ థిల్లాన్ ప్రేమకథ కేవలం పాటలకే పరిమితం చేశారు దర్శకుడు.


ఎన్‌ఆర్‌ఐ కుర్రాడి పాత్రలో ఇమిడిపోవడానికి అల్లు శిరీష్ శాయశక్తులా ప్రయత్నించారు. సినిమాలో పూర్తిగా అతడితో ఇంగ్లీష్‌లోనే సంభాషణలు చెప్పించడం బాగాలేదు. అల్లు శిరీష్ స్నేహితుడిగా భరత్ పూర్తి నిడివి కలిగిన పాత్రలో కనిపించారు. కొన్ని చోట్ల తప్పితే భరత్ పెద్దగా నవ్వించలేకపోయారు. తన కామెడీ టైమింగ్‌తో పలు సినిమాల విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న వెన్నెలకిషోర్ సైతం ఈ సినిమాలో నవ్వించలేకపోయారు. మలయాళ మాతృకలో హీరోయిన్ పాత్ర పెద్దగా కనిపించదు. అందుకు భిన్నంగా తెలుగులో కథానాయిక పాత్రకు ప్రాధాన్యత పెంచడంలో కథలో బలవంతంగా ఇరికించిన భావన కలిగింది. విలన్‌గా రాజా పాత్ర సంభాషణలకే పరిమితమైంది.దర్శకుడిగానే కాకుండా రచయితగా సంజీవ్‌రెడ్డి ఈసినిమాతో ఆకట్టుకోలేకపోయారు. సినిమా క్యాప్షన్‌కు తగినట్లే పూర్తిగా కన్‌ఫ్యూజ్ అయ్యారు. మధుర శ్రీధర్‌రెడ్డి, యష్ రంగినేని నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ : 2.5/5

3012
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles