పథేర్ పాంచాలి షష్టి పూర్తి

Wed,August 26, 2015 05:31 PM
60 years of Satyajit Ray Pather Panchali


హైదరాబాద్: భారత సినిమాను ప్రపంచ సినీ పటంపై నిలబెట్టిన పథేర్ పాంచాలీ విడుదలై నేటికి సరిగ్గా 60 ఏళ్ళు. ఈ సినిమాలో గ్రామీణ మధ్య తరగతి కుటుంబ జీవనాన్ని సహజ సిద్ధంగా కళ్ళకు కట్టినట్లు చూపించారు దర్శకులు సత్యజిత్ రే.

చిత్ర కథలోకి వెళ్తే..ఓ పురోహితుడు సంపాదన కొరకు నగరానికి వెళ్తాడు. అతని భార్య, ఇద్దరు పిల్లలు దుర్గ, అప్పు, అతని చుట్టపు మహిళ గ్రామంలోనే ఉండిపోతారు. పూట గడవక చుట్టపు మహిళ ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరొకరి ఇంట్లో తల దాచుకోవడం. పిల్లలు ఊళ్ళోని చిన్న చిన్న సరదాలు..ఆటపాటలు..సాయంత్రం వేళలో రైలు పరుగులు తీస్తూ కూతలు.. జాతరలో పిల్లలు కలియ తిరగడం..పొరుగింటి తోటలోని పండ్లను దొంగతనం చేసి చుట్టపు మహిళకు దుర్గ ఇవ్వడం, నగలు పోతే దానిని దుర్గనే దొంగిలించిందని పొరుగింటావిడ నిందలు వేయడం..అదే పనిగా వర్షంలో తడుస్తూ దుర్గ ఆరోగ్యం చెడిపోవడం..చికిత్సకు డబ్బులు లేక దుర్గ చనిపోవడం..తను సంపాదించిన డబ్బులతో పురోహితుడు ఇంటికి రావడం..భార్య మౌనంగా అతని కాళ్ళపై పడటం..తన కూతురు మరిణించిందని గ్రహించిన ఆ పురోహితుడు రోదించడం..ఊరు వదిలి వెళ్ళాలని వారు నిర్ణయించుకోవడం.. దుర్గ తమ్ముడు అప్పుకు పోయిన పొరుగింటావిడ నగ దొరికినపుడు దానిని చెరువులోకి విసిరేయడం..వారు ఎడ్ల బండిలో ఊరు విడిచి వెళ్ళడం.. ఇవన్నీ సగటు ప్రేక్షకుని హృదయాన్ని బరువెక్కించేవే.

సత్యజిత్ రే ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమయ్యాడు. బిబూతి భూషన్ బందోఫాధ్యాయ్ నవల పథేర్ పాంచాలీ ఆధారంగా సత్యజిత్ రే ఈ సినిమాను రూపొందించాడు. నిధుల లేమితో ఈ సినిమా పూర్తి కావడానికి ఐదేళ్ళు పట్టింది. సినిమా కొరకు తన భార్య నగలను అమ్మాడు సత్యజిత్ రే. దొరికిన కాడ అప్పు జేసి అష్ట కష్టాలు పడి ఈ సినిమాను నిర్మించాడు. బెంగాల్ ప్రభుత్వం తన వంతు ఆర్థిక సాయం చేసింది. తను ఇచ్చిన అప్పును రహదారి నిర్మాణానికి కేటాయించినట్లుగా పద్దుల్లో పేర్కొంది అప్పటి బెంగాల్ ప్రభుత్వం.

షూటింగ్ ప్రారంభ రోజున మినహాయించి ఏ రోజు కూడా సత్యజిత్ దర్శకత్వం వహించలేదు. చైల్డ్ ఆర్టిస్టులకు స్క్రీన్ టెస్టు కూడా నిర్వహించనే లేదు. సినిమాటోగ్రాఫర్ సుబ్రతా మిత్రా అప్పటి వరకు కేవలం ఓ ఫొటో గ్రాఫర్ మాత్రమే. ఈ సినిమా కొరకు కెమెరాను అప్పుగా తీసుకొని సినిమాను షూట్ చేశాడు. కెరీర్ తొలి నాళ్ళలో ఉన్న సితార్ విద్వాంసుడు రవి శంకర్ దీనికి సంగీతం సమకూర్చారు.

బెంగాల్ ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఈ సినిమాను చూసిన అప్పటి ప్రధాని నెహ్రూ దీన్ని పొగడ్తల్లో ముంచెత్తారు. కేన్స్ చిత్రోత్సవానికి ఈ చిత్రాన్ని రికమెండ్ చేశారు. ప్రధాని చొరవతో కేన్స్‌కు వెళ్ళిన పథేర్ పాంచాలీ భారత్‌లో ఉన్న పేదరికంపై అంతర్జాతీయ స్పృహ కల్గించింది. జాన్ హౌస్టన్ ఈ మూవీని చూడటం హాలీవుడ్ దృష్టినాకర్షించింది.

స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న మొదటి సినిమా పథేర్ పాంచాలి. ప్రపంచ సినిమా పటంపై భారత్‌ను నిలబెట్టిందీ సినిమా.


1901
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles