రేనాటి వీరుడు సైరా నరసింహారెడ్డి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన సైరా చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్గా విడుదలైన సంగతి తెలిసిందే. చిరంజీవి తన 151వ చిత్రంగా చారిత్రాత్మక చిత్రం ఎంపిక చేసుకోవడం గొప్ప విషయమనే చెప్పాలి. రామ్ చరణ్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. సినిమా చూసిన వాళ్ళందరు బొమ్మ బ్లాక్ బస్టర్ అని కితాబిచ్చారు .
రేనాటి సూరీడుగా చిత్రంలో చిరు ప్రదర్శన అద్భుతం అనే చెప్పవచ్చు. ఆయన చెప్పే డైలాగ్స్, యాక్షన్ సీన్స్ లో చిరు నట ప్రదర్శన సినిమాకి ప్రధాన ఆకర్షణ . అమిత్ త్రివేది అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువలు, రత్నవేలు సినిమాటోగ్రఫీ, గ్రాండ్ విజువల్స్ సినీ ప్రేక్షకులకి ఎంతో ఆహ్లదాన్ని పంచాయి. పవన్ కళ్యాణ్ గళం మెగా అభిమానుల ఆనందాన్ని మరో మెట్టు ఎక్కేలా చేసింది.
చిరంజీవికి గురువుగా అమితాబ్ సరిగ్గా సరిపోయారు. తమన్నా, నయనతారలతో పాటు విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, నిహారిక తమ పాత్రలకి చక్కగా న్యాయం చేశారు. దేశభక్తిని ఇనుమడించే ఈ సినిమాని కమర్షియల్ అంశాలతో చాలా చక్కగా తెరకెక్కించారు. ఈ చిత్రం 30 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు.