2.0 రివ్యూ

Thu,November 29, 2018 02:49 PM

2.0... కొంతకాలంగా భారతీయ చిత్రసీమలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రమిది. భాషాభేదాలకు అతీతంగా యావత్ సినీ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజనీకాంత్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో దాదాపు అయిదు వందల కోట్ల వ్యయంతో నిర్మాత సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఇది. పూర్తిగా త్రీడీలో రూపొందిన తొలి భారతీయ చిత్రంగా 2.0 అందరి దృష్టిని ఆకర్షించింది. పలు ఆసక్తికర అంశాల సమాహారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు ఆకాశన్నాంటాయి. బాహుబలి రికార్డులను ఈ చిత్రం తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. నాలుగేళ్ల అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మాత్రం చేరుకుందో చూద్దాం.


హఠాత్తుగా ఓ రోజు నగరంలో ఉన్న సెల్‌ఫోన్లు అన్ని మాయం అవుతుంటాయి. మొబైల్ నెట్‌వర్క్ కంపెనీ అధిపతులతో పాటు టెలికాం శాఖ మంత్రి అనుమానస్పదంగా చనిపోతారు. ఈ ప్రమాదాలకు కారణం ఏమిటో అంతుపట్టదు. సైన్స్‌కు అందని ఈ సమస్య అడ్డుకోవడానికి ప్రభుత్వం డా.వశీకరణ్(రజనీకాంత్) సహయాన్ని కోరుతుంది. ఆ అదృశ్యశక్తిని అడ్డుకోవడం మానవాతీవ శక్తికి సాధ్యం కాకపోవడంతో చిట్టిని(రజనీకాంత్) పునఃసృష్టిస్తాడు వశీకరణ్. చిట్టితో పాటు మరో హ్యూమనాయిడ్ రోబో వెన్నెల(అమీజాక్సన్) సహాయంతో సెల్‌ఫోన్‌ల మాయం వెనుక ఉన్న రహస్యం ఏమిటో అన్వేషించడం మొదలుపెడతాడు. ఈ ప్రమాదాలన్నింటికి పక్షిరాజా(అక్షయ్‌కుమార్) కారణం అనే నిజం తెలుస్తుంది. చిన్నతనం నుంచి పక్షులపై ప్రేమను పెంచుకున్న పక్షిరాజా ఆర్నిథాలజీలో ఉన్నత విద్యను అభ్యసించడమే కాకుండా వాటి సంరక్షణ కోసం తన జీవితాన్ని కేటాయిస్తాడు. మొబైల్ నెట్‌వర్క్‌లకు ప్రభుత్వం ఇష్టానుసారం అనుమతులు ఇవ్వడం, ఇతర కంపెనీల పోటీని తట్టుకోవడానికి అనుమతులు ఇచ్చిన దాని కంటె అనధికారికంగా కంపెనీలు ఫ్రిక్వెన్సీలు పెంచడం, టవర్స్‌లను ఇష్టానుసారం నెలకొల్పడంతో పక్షులు అంతరించిపోతాయి. మొబైల్ కంపెనీ అధినేతలతో పాటు సెల్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరిపై ద్వేషాన్ని పెంచుకున్న పక్షిరాజా పక్షిజాతులను రక్షించడానికి ఏం చేశాడు? అతడి ప్రయత్నాల్ని వశీకరణ్, చిట్టి, వెన్నెల ఎలా అడ్డుకున్నారు? ప్రజల ప్రాణాలను ఎలా కాపాడారు అన్నదే ఈ చిత్ర కథ.

సామాజిక ఇతివృత్తాలకు వాణిజ్య విలువల్ని, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలను జోడించి సినిమాల్ని తెరకెక్కించే శంకర్ మరోమారు ఆ దారిలోనే అడుగులూ వేస్తూ 2.0 సినిమాను తెరకెక్కించారు. రోబో సినిమాలోని వశీకరణ్, చిట్టి పాత్రలను తీసుకొని వాటికో కొత్త నేపథ్యాన్ని, రజనీకాంత్ ఇమేజ్‌ను జోడించి ఈ సినిమాను రూపొందించారు. సాంకేతికత కూడిన ఈ కథలో సందేశాన్ని మేళవించిన తీరు బాగుంది. రేడియేషన్ వల్ల అంతరించిపోయిన పక్షుల తాలూకూ నెగెటివ్ పవర్ తమ అంతానికి కారణమైన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకుందనే సన్నివేశాలతో ప్రథమార్థం మొత్తం ఉత్కంఠభరితంగా సాగుతుంది. చిట్టి రంగప్రవేశంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. తనకంటే ఎన్నో రేట్లు బలవంతుడైన పక్షిరాజాను ఎదుర్కోవడానికి చిట్టి తన తెలివితేటలతో వేసే ఎత్తులతో ద్వితీయార్థం పోటాపోటీగా ఉంటుంది. చిట్టి 2.0, వెన్నెల మధ్య వచ్చే కామెడీ ఆకట్టుకుంటుంది. రోబోల మధ్య ఉన్న ఆకర్షణను చూపిస్తూ కొత్త ప్రేమకథను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.

గత చిత్రాలను భిన్నంగా పూర్తిగా గ్రాఫిక్స్ హంగులను ప్రాధాన్యతనిస్తూ ఈ సినిమాను రూపొందించారు. నాలుగేళ్ల అతడి శ్రమ, తపన ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. పక్షిరాజా రూపాన్ని గ్రాఫిక్స్ హంగులతో తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది. సెల్‌ఫోన్‌లు అన్ని కలిసి పక్షుల రూపాన్ని సంతరించుకునే వీఎఫ్‌ఎక్స్ సన్నివేశాలన్ని హాలీవుడ్ సినిమాను చూస్తున్న అనుభూతిని పంచుతాయి. పతాక ఘట్టాల్లో చిట్టి, పక్షిరాజా మధ్య వచ్చే ఫోరాట దృశ్యాలను ఉత్కంఠను రేకెత్తించాయి.

రోబో సినిమాలో గ్రాఫిక్స్ హంగులకు భావోద్వేగాల్ని జోడించడంలో సక్సెస్ అయ్యారు శంకర్. కానీ మ్యాజిక్‌లో 2.0 మిస్సయ్యింది. కథలో బలం లేకపోవడం, రియాలిటీ కంటే గ్రాఫిక్స్‌కే ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడం మైనస్‌గా మారింది. సైన్స్‌తో ముడిపడిన సంక్లిష్టమైన ఈ కథ సగటు ప్రేక్షకుడికి అర్థం అవ్వడం కొంత కష్టమే. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ సాధారణంగా ఉన్నాయి. కథను సాగతీసిన ధోరణిలో చెప్పినట్లుగా అనిపిస్తుంది. చాలా చోట్ల రోబో ఛాయలు కనిపిస్తాయి. కథాగమనం మొత్తం ఆ సినిమా దారిలోనే నడిపించారు. రోబో సినిమాలో ఉన్న ఉత్కంఠ, ఆసక్తి ఇందులో లోపించాయి.

వశీకరణ్, చిట్టిగా రెండు పాత్రల్లో మరోమారు ఒదిగిపోయారు రజనీకాంత్. చిట్టిగా తనదైన శైలి మ్యానరిజమ్స్‌తో అతడు చెప్పే డైలాగ్‌లు నవ్విస్తాయి. ఈసినిమాతో ప్రతినాయకుడిగా దక్షిణాదిలో అరంగేట్రం చేశారు బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్. అతడి పాత్ర ఎక్కువగా గ్రాఫిక్స్‌లోనే చూపించడంతో అక్షయ్ అభినయాన్ని పూర్తిస్థాయిలో చూసే అవకాశం లేకుండా పోయింది. వెన్నెలగా అమీ జాక్సన్ అతిథి పాత్రలోనే కనిపించింది. మిగతా పాత్రలకు పెద్దగా సినిమాలో ప్రాధాన్యతలేదు.

సాంకేతికంగా ఏ.ఆర్.రెహమాన్ నేపథ్య సంగీతం, నిరవ్‌షా ఛాయాగ్రహణంతో పాటు రసూల్ పూకుట్టి, శ్రీనివాస్‌ మోహన్ వంటి అగ్ర సాంకేతిక నిపుణుల ప్రతిభ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. త్రీడీ కెమెరాతో 4డీ శబ్ద సాంకేతికను ఉపయోగించి శంకర్ ఈసినిమాను తెరకెక్కించారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ నిక్‌పావెల్, కెన్నీ బాట్స్, స్టీవ్ గ్రిఫిన్స్ సమకూర్చిన పోరాట ఘట్టాలు బాగున్నాయి.

ప్రపంచస్థాయి సినిమాను తీయగలిగే సాంకేతిక ప్రతిభ, శక్తిసామర్థ్యాలు మనకు ఉన్నాయని చాటి చెప్పే చిత్రమిది. ఈ ప్రయత్నంలో శంకర్ బృందం కొంత వరకు విజయవంతమయ్యారు. గ్రాఫిక్స్ హంగులన్నీ ప్రేక్షకులని అబ్బురపరుస్తాయి. కొత్త లోకంలో విహరించిన అనుభూతిని పంచుతాయి. పెద్దలతో పాటు చిన్నపిల్లలను ఈ చిత్రం అలరిస్తుంది.

రేటింగ్: 3/5

5254
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles