2 కంట్రీస్ సినిమా రివ్యూ

Fri,December 29, 2017 07:09 PM
2 Countries movie review


శ్రీరాములయ్య, భద్రాచలం, జై బోలో తెలంగాణ వంటి సామాజిక ఇతివృత్తాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు ఎన్.శంకర్. కొంత విరామం తర్వాత స్వీయ దర్శకత్వంలో ఆయన రూపొందించిన చిత్రం టూ కంట్రీస్. తన పంథాకు భిన్నంగా పూర్తిస్థాయి వినోదభరిత కథాంశంతో శంకర్ చేసిన ప్రయత్నమిది. కుటుంబ బంధాలను తెరపై బలంగా ఆవిష్కరించడంలో శంకర్‌కు పట్టు ఉండటం, సునీల్ ఈసినిమాలో కథానాయకుడిగా నటించడంతో అభిమానుల్లో సినిమా పట్ల ఆసక్తి నెలకొంది. ఆ అంచనాలకు తగినట్లుగానే సినిమా ఉందా?శంకర్‌కు ఈ సినిమా ఎలాంటి పునరాగమనాన్ని ఇచ్చింది?సునీల్‌ను విజయాల బాట పట్టించిందా?లేదా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...

ఉల్లాస్(సునీల్) ఓ పల్లెటూరి కుర్రాడు. డబ్బుంటే అతడికి అమితమైన ప్రేమ. డబ్బు కోసం కన్నవారిని సైతం ఇబ్బందుల్లోకి నెడుతుంటాడు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలని కలలు కంటుంటాడు. డబ్బు కోసం అమెరికాకు చెందిన లయ(మనీషారాజ్) అనే అమ్మాయిని పెళ్లిచేసుకుంటాడు. ఆమె పేరిట ఉన్న కోట్ల ఆస్తిని తన సొంతం చేసుకోవాలని కలలు కంటాడు. కానీ లయ తాగుడుకు బానిస అనే నిజం అతడికి తెలుస్తుంది. దాంతో వారి కాపురంలో కలతలు రేగుతాయి. ప్రతిక్షణం ద్వేషించుకుంటుంటారు. వ్యక్తిగత సమస్యల కారణంగానే లయ తాగుడుకు అలవాటు పడిందనే నిజం ఉల్లాస్‌కు తెలుస్తుంది. దాంతో ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. ఇంతలో డబ్బు కోసమే ప్రేమ నాటకం ఆడి ఉల్లాస్ తనను పెళ్లిచేసుకున్నాడనే నిజం లయకు తెలుస్తుంది. దాంతో ఉల్లాస్ నుంచి విడాకులు తీసుకోవాలని కోర్టును ఆశ్రయిస్తుంది. ఉల్లాస్ మాత్రం లయకు దూరం కావడానికి ఇష్టపడడు. ఆ తర్వాత వారి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? కోర్టు వారికి విడాకులు మంజూరు చేసిందా?లేదా?. నిజమైన ప్రేమ వారిద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పును తీసుకొచ్చిందన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

రెండేళ్ల క్రితం మలయాళంలో విడుదలైన టూ కంట్రీస్ ఆధారంగా రూపొందిన చిత్రమిది. వినోదానికి కుటుంబ బంధాలు, భావోద్వేగాలను జోడించి దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈజీ మనీ కోసం సునీల్ తన స్నేహితుడితో కలిసి చేసే ప్రయత్నాలు చక్కటి వినోదాన్ని పంచుతాయి. అమెరికా సంస్కృతిని, అక్కడ తెలుగువారికి ఎదురయ్యే సమస్యల్ని, తల్లిదండ్రులు విడిపోవడం వల్ల పిల్లలు ఎదుర్కొనే మానసిక వేదనను హృద్యంగా సినిమాలు చూపించారు. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా తన అభిరుచులకు అనుగుణంగా ఉన్నతంగా సినిమాను రూపొందించారు శంకర్. కథకు కట్టుబడి ఎక్కడ రాజీపడకుండా అమెరికాలోని పలు అందమైన లొకేషన్స్‌లో సినిమాను రూపొందించారు.

తన కామెడీ టైమింగ్‌తో సునీల్ మరోసారి ఆకట్టుకున్నారు. వన్ మెన్ ఆర్మీలా సినిమాకు అన్ని తానై నిలిచారు. మనీషారాజ్ కొత్త నటి అయినా ఎక్కడ ఆ భావన కలగదు. గ్లామర్, అభినయంతో అలరించింది. పృథ్వీ, శ్రీనివాసరెడ్డి కనిపించే సన్నివేశాలు నవ్విస్తాయి. సాంకేతికంగా రామ్‌ప్రసాద్ ఛాయాగ్రహణం, గోపీసుందర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
వినోదాన్ని కోరుకునే ప్రతి ఒక్కరిని మెప్పించే చిత్రమిది.

రేటింగ్ - 2.75/5

8663
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles