అంగరంగ వైభవంగా 2.0 ఆడియో వేడుక

Sat,October 28, 2017 10:12 AM
 2.0 movie audio launch in grand manner

ఎన్నో రోజుల నుండి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న 2.0 ఆడియో వేడుక నిన్న సాయంత్రం దుబాయ్ పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఎలాంటి అతిధులు లేకుండానే కేవలం చిత్ర యూనిట్ సమక్షంలోనే ఆడియోని విడుదల చేసినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్, టాలీవుడ్ స్టార్ హీరో రానా ఈ ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవహరించారని తెలుస్తుండగా, ఏఆర్ రెహమాన్ స్వరపరచిన స్వరాలు సంగీత ప్రియులకి వీనుల విందుగా మారాయి. ప్రపంచ ప్రసిద్ధ 7 స్టార్ హోటల్ బుర్జ్ దుబాయోల్ లో 2.0 ఆడియో వేడుక అట్టహాసంగా జరగగా, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు భారీగా తరలి వచ్చారు. 125 సింఫొనీ కళాకారులతో కలిసి ఏఆర్ రెహ్మాన్ సంగీత విభావరి ప్రోగ్రామ్ కే స్పెషల్ హైలైట్ అని అంటున్నారు. శివమణి కూడా తన పర్ ఫార్మెన్స్ తో అదరగొట్టాడు.

దాదాపు 15 కోట్లతో 2.0 ఆడియో వేడుకని చాలా గ్రాండ్ గా నిర్వహించగా కార్యక్రమంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్, శంకర్ ల ఎంట్రీ అదిరిపోయిందని అంటున్నారు. ఇక్కడ మరో ముఖ్య విశేషమేమంటే దాదాపు యూనిట్ కి సంబంధించిన వారందరు కూడా బ్లాక్ కలర్ డ్రెస్ లో ఈ ఆడియో వేడుకకి హాజరు కావడం. కళాకారుల నృత్యాలు కూడా వీక్షకులకి కనువిందు చేశాయి. ఇక ఈ ఆడియో వేడుకకి రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ తో పాటు ఆయన కూతురు సౌందర్య రజనీకాంత్ కూడా హాజరయ్యారు. త్వరలోనే ఈ ప్రోగ్రాంకి సంబంధించిన వీడియోని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక వచ్చే నెలలో హైదరాబాద్లో ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తునే జరపనున్నారని సమాచారం. 2018 జనవరిలో 2.0 చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

1689
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles