పీఎఫ్ ఖాతాల్లో హెచ్ఎన్ఐ జిమ్మిక్కులు

- పన్ను తప్పించుకునేందుకు వేల కోట్ల రూపాయలు జమ
- ఒక్కరి ఖాతాలోనే 103 కోట్లు
- వెల్లడించిన రెవిన్యూ శాఖ వర్గాలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)లో జమ చేసే మొత్తానికి వచ్చే వడ్డీ ఎక్కువ. దీనికి ఆదాయం పన్ను మినహాయింపూ ఉంది. దీంతో కొందరు హై నెట్వర్త్ ఇండివీడ్యువల్స్ (హెచ్ఎన్ఐ లేదా సంపన్నులు) ఎక్కువ డబ్బులను జమ చేస్తున్నారు. ఓ వ్యక్తి తన పీఎఫ్ ఖాతాలో ఏకంగా రూ.103 కోట్లు జమ చేశాడు. మరో ఇద్దరి ఖాతాల్లో ఒక్కొక్కరి దాంట్లో రూ.86 కోట్ల మేర ఉన్నాయి. మొదటి 20 మంది మొత్తం పీఎఫ్ నగదు విలువ రూ.825 కోట్లు కావడం గమనార్హం. ఇక టాప్-100 ఖాతాల్లో ఉన్న మొత్తం రూ.2 వేల కోట్లపైనే. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) లేదా ప్రభుత్వ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఖాతాల్లో ఏటా రూ.2.5 లక్షలు అంతకంటే ఎక్కువ విరాళాలపై పొందే వడ్డీకి పన్ను పడుతుందని ఇటీవలి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానున్నది. అయితే దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కొందరు హెచ్ఎన్ఐల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సంక్షేమ నిధులు దుర్వినియోగం కావద్దనే ఈ పన్ను ప్రతిపాదన అని రెవిన్యూ శాఖ సమర్థించుకుంటున్నది.
హెచ్ఎన్ఐలపైనే భారం
నిజానికి ఈ పన్ను నిర్ణయంతో సాధారణ ఈపీఎఫ్, జీపీఎఫ్ ఖాతాదారులకు ఎలాంటి నష్టం వాటిల్లదని, అక్రమార్కులకే చెక్ పెట్టినట్లు అవుతుందని అధికారులు వివరిస్తున్నారు. 4.5 కోట్లకుపైగా ఈపీఎఫ్ ఖాతాల్లో 1.23 లక్షల ఖాతాలు హెచ్ఎన్ఐలవి. మొత్తం ఖాతాల్లో ఇవి కేవలం 0.27 శాతానికి సమానమే అయినా వీరిలో ఒక్కో వ్యక్తి సగటున రూ.5.92 కోట్లు జమ చేస్తున్నారు. పొందే సగటు వార్షిక వడ్డీ రూ.50.3 లక్షలు. దీనిపై పన్నులు వర్తించట్లేదు. ఇలాగే 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.62,500 కోట్లు జమైంది. నిబంధనల ప్రకారం అందరికీ ఇచ్చినట్లే ఈ సొమ్ముకూ కేంద్రం 8 శాతం వడ్డీరేటును చెల్లించింది. పన్ను మినహాయింపులూ అందాయని రెవిన్యూ అధికారులు తెలిపారు. కాబట్టి పన్ను విధానం మారితే హెచ్ఎన్ఐల అక్రమాలకు కళ్లెం వేసినట్లేనంటున్నారు.