బుధవారం 03 జూన్ 2020
Business - Mar 28, 2020 , 01:17:00

ఈఎంఐలు కట్టక్కర్లేదు

ఈఎంఐలు కట్టక్కర్లేదు

-అన్ని టర్మ్‌ లోన్ల ఈఎంఐలపై మూడు నెలలు మారటోరియం  

-కీలక వడ్డీరేట్లు భారీగా తగ్గింపు

-రెపోరేటు 4.4శాతానికి, రివర్స్‌ రెపో  4 శాతానికి కుదింపు  

-వారం ముందే ఆర్బీఐ సమీక్ష

ముంబై, మార్చి 27: కరోనా వైరస్‌ కాటుతో అల్లాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకొనేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక నిర్ణయాలు తీసుకొన్నది. ఈ సంక్షోభం నుంచి సామాన్యులకు ఊరట కల్పించేలా అన్ని రకాల టర్మ్‌ లోన్లకు సంబంధించిన ఈఎంఐల చెల్లింపులపై మూడునెలలపాటు మారటోరియం విధించేందుకు బ్యాంకులకు, ఇతర ఆర్థిక సంస్థలకు అనుమతి ఇచ్చింది. దీనివల్ల రుణగ్రహీతల క్రెడిట్‌ హిస్టరీపై ప్రతికూల ప్రభావమేమీ ఉండదని హామీ ఇచ్చింది. అంతేకాకుండా కీలక వడ్డీ రేట్లను గత 11 ఏండ్లలో ఎన్నడూ లేనంత భారీస్థాయిలో తగ్గించింది. రోజురోజుకూ వేగవంతంగా వ్యాప్తిచెందుతున్న కొవిడ్‌-19 మహమ్మారిపై పోరాడేందుకు ఆర్బీఐ తన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశాన్ని గతంలో నిర్ణయించిన షెడ్యూల్‌ (ఈ నెల 31 నుంచి ఏప్రిల్‌ 3) కంటే వారంరోజులు ముందుగానే నిర్వహించింది. మార్కెట్లలో ద్రవ్య లభ్యతను 3.2 శాతం పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించిన ఆర్బీఐ.. రెపోరేటును 75 బేసిస్‌ పాయింట్లు, రివర్స్‌ రెపోరేటును 90 పాయింట్లు చొప్పున తగ్గించింది. దీంతో ప్రస్తుతం రెపోరేటు 4.40 శాతానికి, రివర్స్‌ రెపోరేటు 4 శాతానికి చేరుకొన్నది. అలాగే నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్‌ఆర్‌ను) కూడా 100 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో అది 3 శాతానికి చేరింది. 2009 జనవరి తర్వాత కీలక వడ్డీరేట్లను ఇంత భారీగా తగ్గించడం ఇదే తొలిసారి. 2004 అక్టోబర్‌ తర్వాత ఇవే అతితక్కువ వడ్డీరేట్లు. 

వర్కింగ్‌ క్యాపిటల్‌ లోన్లపై వడ్డీ వాయిదా

మరోవైపు వ్యాపార వర్గాలకు ఊరట కల్పించేందుకు వర్కింగ్‌ క్యాపిటల్‌ లోన్లపై వడ్డీని మూడు నెలలపాటు వాయిదా వేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. ఈ నెల 24 నుంచి 27 వరకు జరిగిన ఎంపీసీ సమావేశాల్లో పై నిర్ణయాలను తీసుకొన్నట్టు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ శుక్రవారం మీడియాకు వివరించారు.

సంక్షోభం కొనసాగితే మరింత ప్రమాదం

ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2019-20) మూడో త్రైమాసికం (నవంబర్‌-డిసెంబర్‌)లో 4.7 శాతానికి పతనమై ఆరేండ్ల కనిష్ఠస్థాయికి దిగజారిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)లో కొంతమేరకైనా పుంజుకొంటుందన్న ఆశలను కరోనా సంక్షోభం నీరుగార్చిందని ఆర్బీఐ గవర్నర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితులను ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తున్నదని, దేశ ఆర్థిక స్థిరత కోసం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతామని ఆర్బీఐ తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, దాని తీవ్రత ఎంతకాలం కొనసాగుతుందన్న అంశాలపైనే భవిష్యత్‌ వృద్ధిరేటు, ద్రవ్యోల్బణ అంచనాలు ఉంటాయన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు కరోనా సంక్షోభంలో కూరుకుపోయాయని, ఇది ఇలాగే కొనసాగితే పరిస్థితులు మరింత దిగజారే అవకాశమున్నదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

ఆర్బీఐ సమీక్షలోని ముఖ్యాంశాలు

  • అన్ని రకాల రుణాల ఈఎంఐలపై మూడు నెలల మారిటోరియం
  • రెపోరేటు 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో రేటు 4.4 శాతానికి చేరిక
  • రివర్స్‌ రెపోరేటు 90 బేసిస్‌ పాయింట్లు కోత విధించడంతో 4 శాతానికి 
  • 4:2 ఎంపీసీ కమిటీ సభ్యులు 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించడానికి ఓటువేశారు
  • వివిధ మార్గాల ద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రూ.3.74 లక్షల కోట్లు
  • సీఆర్‌ఆర్‌ని 1% తగ్గించడంతో మార్కెట్లోకి రూ.1.37 లక్షల కోట్లు
  • కరోనా వైరస్‌తో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రస్థాయిలో ప్రభావం

మారటోరియం అంటే..

బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకొన్న రుణాలను సదరు రుణగ్రహీతలు వడ్డీతో కలిపి ఈఎంఐల రూపంలో తిరిగి చెల్లిస్తుంటారు. వీటిని కొంతకాలంపాటు చెల్లించాల్సిన అవసరంలేకుండా రుణగ్రహీతలకు వెసులుబాటు కల్పించే వ్యవధినే మారటోరియం పీరియడ్‌ లేదా ‘ఈఎంఐ హాలిడే’ అంటారు. సాధారణ సమయాల్లో ఈఎంఐల చెల్లింపు ఆలస్యమైతే సదరు రుణగ్రహీతలను ఎగవేతదారులుగా పరిగణిస్తారు. అంతేకాకుండా వారి క్రెడిట్‌ హిస్టరీ (సిబిల్‌ స్కోర్‌)పై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో మున్ముందు రుణాలను పొందడంలో వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ప్రస్తుతం నిర్దేశించిన మారటోరియం పీరియడ్‌లో ఈఎంఐల చెల్లింపు ఆలస్యమైనప్పటికీ సదరు రుణగ్రహీతలను ఎగవేతదారులుగా పరిగణించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈఎంఐల చెల్లింపుల్లో జాప్యం జరిగినా రుణగ్రహీతల క్రెడిట్‌ హిస్టరీ (సిబిల్‌ స్కోర్‌)పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని ఆర్బీఐ భరోసా ఇచ్చింది. అయితే క్యాష్‌ క్రెడిట్‌/ఓవర్‌డ్రాఫ్ట్‌ రూపంలో మంజూరుచేసిన మూలధన రుణాలపై ఈ మూడు నెలలపాటు వడ్డీ విధింపును యథాతథంగా కొనసాగించవచ్చని, ఈ విధంగా పేరుకుపోయిన వడ్డీని మారటోరియం పీరియడ్‌ ముగిసిన వెంటనే రుణదాతలు వసూలుచేసుకోవచ్చని శుక్రవారం విడుదల చేసిన సర్క్యులర్‌లో ఆర్బీఐ వివరించింది.

కరోనా వైరస్‌ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఆర్బీఐ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నది. దీంతో ద్రవ్య లభ్యత పెరుగుతున్నది. రుణాలు చౌకగా లభిస్తాయి. ఇది మధ్యతరగతి, వ్యాపార వర్గాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

దేశ ఆర్థిక స్థిరత్వానికి శక్తికాంత దాస్‌ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నా. నెలవారి చెల్లింపులపై మూడు నెలల మారటోరియం, వడ్డీరేట్లను తగ్గించడంతో రుణాలు తీసుకున్నవారికి భారీ ఊరట లభించనున్నది. తగ్గించిన వడ్డీరేట్లు వెంటనే అమల్లోకి రావాలి

- నిర్మతా సీతారామన్‌ 

కీలక వడ్డీరేట్లను రేటును తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఈఎంఐలపై ఇచ్చిన మారటోరియం అస్పష్టంగా, అర్దరహితంగా ఉన్నది.  

- చిదంబరం, మాజీ కేంద్ర మంత్రి

కరోనా వైరస్‌తో దిగాలు పడుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి ఆర్బీఐ బోల్డ్‌గా నిర్ణయాలు తీసుకున్నది. దీంతో మార్కెట్లో నగదు లభ్యత పెరుగడంతోపాటు ఆర్థిక మార్కెట్లలో స్థిరత్వం రానున్నది. 

- రజనీశ్‌ కుమార్‌, ఎస్బీఐ చైర్మన్‌

పడకేసిన ఆర్థిక, ఫైనాన్షియల్‌ మార్కెట్లు ఈ ఉద్దీపన ప్యాకేజీతో మళ్లీ తేరుకునే అవకాశాలున్నాయి. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడేందుకు ఆస్కారం ఉన్నది”

- సంగీతా రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్‌

మూడు నెలలపాటు ఈఎంఐలపై మారటోరియం విధించడంతో ప్రజలకు, మరోవైపు వ్యాపారవేత్తలకు భారీ ఊరట లభించినట్లు అయింది.

- పీయూష్‌ గోయల్‌, కేంద్ర వాణిజ్య మంత్రి


logo