శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Business - Mar 06, 2020 , 08:29:22

యెస్‌ బ్యాంక్‌కు ఊపిరి!

యెస్‌ బ్యాంక్‌కు ఊపిరి!
  • రూ.12 వేల కోట్ల నుంచి 14 వేల కోట్ల సాయం అందించనున్న ఎస్బీఐ కన్సార్టియం

న్యూఢిల్లీ/ముంబై, మార్చి 5: ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ సంస్థ యెస్‌ బ్యాంక్‌కు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ, మరికొన్ని ఆర్థిక సంస్థలు ఊపిరిలూదనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)లు యెస్‌ బ్యాంక్‌ను ఆదుకోవాలని ఎస్బీఐకి సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎస్బీఐతోపాటు ప్రైవేట్‌ రంగ బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ మహీంద్రా, యాక్సిస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లతో కూడిన కూటమి యెస్‌ బ్యాంక్‌కు చేయూతనివ్వనున్నట్లు గురువారం సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. 


మెజారిటీ వాటా కొంటారా?

ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకర్ల కూటమిని యెస్‌ బ్యాంక్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు తెలుస్తున్నది. ముంబైలో జరిగిన ఎస్బీఐ బోర్డు సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలియవస్తుండగా, ఏ నిర్ణయం తీసుకున్నారన్నదానిపై మాత్రం సమాచారం లేదు. మరోవైపు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీని కూడా వాటా కొనుగోలుకు మోదీ సర్కారు ముందుకు తోస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే యెస్‌ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి 8 శాతం వాటా ఉన్నది. ఈ క్రమంలో ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ కలిసి 49 శాతం వాటాను పొందే వీలున్నది. ఒకప్పుడు మదుపరులకు అత్యంత ఇష్టదాయకమైన సంస్థగా ఉన్న యెస్‌ బ్యాంక్‌లో యాజమాన్య మార్పులు జరిగిన దగ్గర్నుంచి కష్టాలు మొదలైయ్యాయి. గతేడాది మార్చిలో కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రవ్నీత్‌ గిల్‌ రాగా, గత ఆరు నెలలుగా రూ.15 వేల కోట్ల నిధులను సమీకరించేందుకు నానా సమస్యల్ని ఎదుర్కొంటున్నది.


రూ.50వేలకు మించి తీసుకోవద్దు

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యెస్‌ బ్యాంక్‌ను ఆదుకునేందుకు ఆర్బీఐ విశ్వప్రయత్నాలనే చేస్తున్నది. సంస్థ పునరుద్ధరణలో భాగంగా గురువారం మారటోరియం విధించిన సెంట్రల్‌ బ్యాంక్‌.. నగదు ఉపసంహరణలపైనా పరిమితులు పెట్టింది. ఖాతాదారులు నెలకు రూ.50 వేలకు మించి తీసుకోరాదని నిర్ణయించింది. అంతకుమించి కావాలంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరి. ఇక తక్షణమే బోర్డును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎస్బీఐ మాజీ సీఎఫ్‌వో ప్రశాంత్‌ కుమార్‌ను బ్యాంక్‌ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. డిపాజిటర్ల ప్రయోజనాల రక్షణార్థం ప్రభుత్వంతో చర్చించి ఆర్బీఐ ఈ నిర్ణయాలు తీసుకున్నది.


logo