ఆదివారం 29 మార్చి 2020
Business - Mar 07, 2020 , 00:33:30

ఖాతాదారుల పరుగులు

ఖాతాదారుల పరుగులు
  • యెస్‌ బ్యాంకు శాఖల ఎదుట పడిగాపులు
  • పనిచేయని నెట్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ
  • ఫోన్‌ బ్యాంకింగ్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ మార్పు

న్యూఢిల్లీ/ముంబై, మార్చి 6: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యెస్‌ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించడంతోపాటు ఖాతాదారులు నెలకు రూ.50 వేలకు మించి నగదు ఉపసంహరించడానికి వీల్లేదని పరిమితి విధించడంతో తీవ్ర ఆందోళన చెందుతున్న కస్టమర్లు శుక్రవారం పలుచోట్ల ఆ బ్యాంకు శాఖల ఎదుట భారీసంఖ్యలో బారులుతీరారు. గురువారం సాయం త్రం నుంచి యెస్‌ బ్యాంకు నెట్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ పనిచేయడంలేదని, నగదు ఉపసంహరణకు ప్రయత్నిస్తుంటే ‘కనెక్షన్‌ ఎర్రర్‌' అని సమాధానం వస్తున్నదని వారు ఆవేదన వ్యక్తంచేస్తూ సంబంధిత స్క్రీన్‌షాట్లను ట్విట్టర్‌లో పోస్టు చేస్తున్నా రు. 


‘యెస్‌ బ్యాంకులో నా పొదుపు ఖాతాను మూసేయాలని భావిస్తున్నా. కానీ ఇప్పుడు నెట్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ పనిచేయకపోవడంతో ఆన్‌లైన్‌లో ఆ పని ఎలా చేయాలో తెలియడంలేదు’ అని ఓ ఖాతాదారుడు ట్వీట్‌ చేశాడు. దీనిపై యెస్‌ బ్యాంకు స్పందిస్తూ.. ప్రస్తుతం నెట్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థలో తాము తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నామని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఖాతాదారులు కొంతకాలం తర్వాత ప్రయత్నించాలని సూచించింది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న యెస్‌ బ్యాంకు తమ ఫోన్‌ బ్యాంకింగ్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా 18001200 నుంచి 18002000కు మార్చింది.


పడకేసిన ‘ఫోన్‌పే’


‘ఎంకి పెండ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు’గా యెస్‌ బ్యాంకుపై మారటోరియం ఆ బ్యాంకుకు అనుబంధంగా పనిచేస్తున్న డిజిటల్‌ పేమెంట్‌ సంస్థలను దెబ్బతీస్తున్నది. దీని ఫలితంగా ప్రస్తుతం ‘ఫోన్‌పే’ లాంటి కొన్ని ఫిన్‌టెక్‌ సంస్థలు తమ సేవలను అందించలేకపోతున్నాయి. ఈ సంస్థలు తమ లావాదేవీల కోసం యెస్‌ బ్యాంకుపై ఆధారపడటమే ఇందుకు కారణం. ‘మా సేవల్లో అంతరాయం ఏర్పడినందుకు చింతిస్తున్నాం. మా భాగస్వామ్య బ్యాంకు (యెస్‌ బ్యాంకు)పై ఆర్బీఐ మారటోరియం విధించడమే ఈ అంతరాయానికి కారణం. సాధ్యమైనంత త్వరలో సేవలను పునరుద్ధరించేందుకు మా బృందమంతా నిరంతరం శ్రమిస్తున్నది’ అని ఫోన్‌పే సీఈవో సమీర్‌ నిగమ్‌ శుక్రవారం ఉదయం ట్వీట్‌ చేశారు.


logo