ఆదివారం 29 మార్చి 2020
Business - Jan 15, 2020 , 00:30:20

విప్రో లాభం రూ.2,456 కోట్లు

విప్రో లాభం రూ.2,456 కోట్లు
  • క్యూ3లో 2.17 శాతం క్షీణత

న్యూఢిల్లీ, జనవరి 14: దేశీయ ఐటీ రంగ సంస్థ విప్రో ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసికం (అక్టోబర్‌-డిసెంబర్‌)లో గతంతో పోల్చితే 2.17 శాతం క్షీణించింది. రూ.2,455.9 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) ఇదే వ్యవధిలో రూ.2,510.4 కోట్లుగా ఉన్నది. అయితే ఆదాయం ఈసారి 2.7 శాతం పుంజుకుని రూ.15,470.5 కోట్లకు చేరింది. నిరుడు రూ.15,059.5 కోట్లుగా ఉన్నట్లు మంగళవారం విప్రో వెల్లడించింది. ఈ జనవరి-మార్చిలోనూ 2 శాతం వరకు ఆదాయ వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. కాగా, ఒక్కో ఈక్విటీ షేర్‌/ఏడీఎస్‌కు రూ.1 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ఈ సందర్భంగా విప్రో ప్రకటించింది.

స్వల్పంగా పెరిగిన మైండ్‌ట్రీ లాభం

మధ్య శ్రేణి ఐటీ రంగ సంస్థ మైండ్‌ట్రీ ఏకీకృత నికర లాభం అక్టోబర్‌-డిసెంబర్‌లో 3 శాతం పెరిగి రూ.197 కోట్లుగా నమోదైంది. పోయినసారి అక్టోబర్‌-డిసెంబర్‌లో రూ.191.2 కోట్లుగా ఉన్నది. ఆదాయం సుమారు 10 శాతం పెరిగి రూ.1,965.3 కోట్లకు చేరింది. క్రిందటిసారి రూ.1,787.2 కోట్లుగా ఉన్నట్లు సంస్థ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. గతేడాది జూలైలో లార్సెన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ).. మైండ్‌ట్రీలో 60.06 శాతం వాటాను దక్కించుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ ఆఖరు నాటికి సంస్థలో 21,561 మంది ఉద్యోగులున్నారు.

రెండింతలైన బంధన్‌ బ్యాంక్‌ లాభం

దేశీయ ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ సంస్థ బంధన్‌ బ్యాంక్‌ నికర లాభం డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలల కాలంలో రెండింతలకుపైగా ఎగిసి రూ.731.03 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో రూ.331.25 కోట్లకే పరిమితమైంది. మొత్తం ఆదాయం ఈసారి రూ.3,075.31 కోట్లుగా ఉంటే, క్రిందటిసారి రూ.1,883.65 కోట్లుగానే ఉన్నట్లు మంగళవారం స్పష్టం చేసింది. స్థూల నిరర్థక ఆస్తులు 1.93 శాతం క్షీణించినట్లు తెలిపింది. నికర నిరర్థక ఆస్తులు మాత్రం 0.81 శాతం పెరిగాయి.

ఇండస్‌ఇండ్‌ లాభం ఆకర్షణీయం

ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ సంస్థ ఇండస్‌ఇండ్‌ నికర లాభం ఈ అక్టోబర్‌-డిసెంబర్‌లో రూ.1,300.20 కోట్లుగా ఉన్నది. గతంతో పోల్చితే ఇది 32 శాతం అధికం. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌-డిసెంబర్‌లో బ్యాంక్‌ లాభం రూ.985.03 కోట్లుగానే ఉన్నది. ఆదాయం ఈసారి రూ.9,073.93 కోట్లుగా, పోయినసారి రూ.7,232.32 కోట్లుగా ఉన్నట్లు మంగళవారం సంస్థ తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తులు 2.18 శాతం పెరుగగా, నికర నిరర్థక ఆస్తులు 1.05 శాతం పెరిగాయి.


logo