శనివారం 08 ఆగస్టు 2020
Business - Jul 14, 2020 , 23:47:17

విప్రో లాభం 2,390 కోట్లు

విప్రో లాభం 2,390 కోట్లు

న్యూఢిల్లీ, జూలై 14: ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో..విశ్లేషకుల అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,390.4 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.2,387.60 కోట్ల లాభంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. లాభాల్లో వృద్ధి సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నూతన కాంట్రాక్టులు బుకింగ్‌లు ఆరంభించినట్లు కంపెనీ సీఈవో, ఎండీ థిర్రీ డెలాపోర్ట్‌ ఈ సందర్భంగా తెలిపారు. గత త్రైమాసికంలో సంస్థ రూ.15,571.40 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు ఆర్థిక ఫలితాల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు.

అంతక్రితం ఏడాది ఇది రూ.15,566.60 కోట్లుగా ఉన్నది. దీంట్లో ఐటీ సేవలు అందించడం ద్వారా రూ.15,033 కోట్లు సమకూరగా, మిగతా రూ.500 కోట్లు ఎఫ్‌ఎంసీజీ రంగం నుంచి లభించినట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. సమీకృత విషయానికి వస్తే రూ.14,913.10 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కరోనా వైరస్‌ కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేసిన సంస్థ...అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు సంస్థ బ్రెజిల్‌కు చెందిన ఐవీఐఏ సర్వీసును రూ.169 కోట్లతో కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ షేరు ధర 1.1 శాతం తగ్గి రూ.225.05 వద్ద ముగిసింది.

రెండింతలైన మైండ్‌ట్రీ లాభం

మైండ్‌ ట్రీ లాభాల్లో దూసుకుపోయింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.213 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2018-19 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.92.7 కోట్లతో పోలిస్తే రెండ్లు రెట్ల కంటే అధిక వృద్ధిని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో సంస్థ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 4.1 శాతం ఎగబాకి రూ.1,908.8 కోట్లు ఆర్జించింది. 


logo