గురువారం 28 మే 2020
Business - Apr 16, 2020 , 00:55:16

విప్రో లాభం 2,345 కోట్లు

విప్రో లాభం 2,345 కోట్లు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15: దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ. 2,345. 20 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.2,493.90 కోట్లతో పోలిస్తే ఆరు శాతం పతనం చెందింది. కరోనా వైరస్‌తో అతలాకుతలమవుతున్న ప్రస్తుత తరుణంలో ఆర్థిక ఫలితాలు విడుదల చేసిన తొలి సంస్థ విప్రో కావడం విశేషం. జనవరి-మార్చి మధ్యకాలానికిగాను కంపెనీ రూ.15, 711 కోట్ల ఆదాయాన్ని గడించింది. 2018-19 ఏడాది ఇదే కాలానికి వచ్చిన రూ.15,006.30 కోట్లతో పోలిస్తే 4.6 శాతం ఎగబాకింది. డాలర్‌ రూపంలో కంపెనీ ఆదాయం 2,095 మిలియన్‌ డాలర్ల నుంచి 2,073.70 మిలియన్‌ డాలర్లకు పడిపోయింది. ప్రతి త్రైమాసిక ఫలితాల సమయంలో గైడెన్స్‌ను విడుదల చేసే సంస్థ..ఈసారి కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆదాయ, లాభాల్లో వృద్ధిని అంచనావేయలేకపోతున్నది. 

గత త్రైమాసికంలో ముందస్తు అంచనావేసిన మాదిరిగానే ఆర్థిక ఫలితాలు నమోదైనప్పటికీ, కరోనాతో ఆదాయంలో 14-16 మిలియన్‌ డాలర్లు కోల్పోవాల్సి వచ్చిందని కంపెనీ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. ఈ వైరస్‌ మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు భవిష్యత్తు అంచనావేయడం కష్టతరమవుతున్నదని, దీంతో ఆదాయ, లాభాల ముందస్తు అంచనావేయడం లేదని పేర్కొంది. 


logo