ఆదివారం 24 మే 2020
Business - Feb 01, 2020 , 00:29:31

విప్రో సీఈవో అబిదాలీ రాజీనామా

విప్రో సీఈవో అబిదాలీ రాజీనామా

న్యూఢిల్లీ, జనవరి 31: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో సీఈవో అబిదాలీ జెడ్‌ నీముచ్‌వాలా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో నూతన వ్యక్తిని ఎంపిక చేయడానికి కంపెనీ బోర్డు కసరత్తును ప్రారంభించింది. 52 ఏండ్ల వయస్సు కలిగిన నీముచ్‌వాలా గతేడాది జూలై 31 నుంచి అదనంగా మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవిని కూడా నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది చివరినాటికి ముగియనున్న ఆయన సీఈవో పదవి అంతలోనే రాజీనామా చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది. కుటుంభమైన కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు నీముచ్‌వాలా వెల్లడించారు. నూతన సీఈవో నియమించే వరకు ఈ పదవిలో కొనసాగాలని నీముచ్‌వాలాను సంస్థ కోరింది. 2015లో గ్రూపు ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారిగా చేరిన ఆయన ఆ తర్వాతి క్రమంలో సీఈవోగా పదొన్నతి పొందారు. అంతకుముందు నీముచ్‌వాలా టీసీఎస్‌లో 23 ఏండ్ల పాటు విధులు నిర్వహించారు కూడా. విప్రోకు నాయకత్వం వహించినందుకు నీముచ్‌వాలాకు కృతజ్ఞతలు..గడిచిన నాలుగేండ్లలో విప్రో బలమైన వృద్ధిని సాధించిందని, డిజిటల్‌ వ్యాపారాల్లో భారీ వృద్ధిని నమోదు చేసుకున్నదని విప్రో చైర్మన్‌ రిశద్‌ ప్రేమ్‌జీ తెలిపారు. ‘75 ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన విప్రోకు నాయకత్వం వహించడం చాలా సంతోషంగా ఉన్నదని, అజీం ప్రేమ్‌జీ, రిశద్‌ , బోర్డు డైరెక్టర్లకు కృతజ్ఞతలు..సంస్థ ఉద్యోగులు, వినియోగదారుల నుంచి లభించిన మద్దతుతోనే అన్ని విభాగాల్లో విజయం సాధించినట్లు నీముచ్‌వాలా పేర్కొన్నారు. logo