శుక్రవారం 23 అక్టోబర్ 2020
Business - Oct 18, 2020 , 01:05:19

జెట్‌ ఎయిర్‌వేస్‌కు మళ్లీ రెక్కలు

జెట్‌ ఎయిర్‌వేస్‌కు మళ్లీ రెక్కలు

  • కల్‌రాక్‌-జలాన్‌ ప్రణాళికకు సీవోసీ ఓకే
  • సంస్థ పునరుద్ధరణకు మార్గం సుగమం
  • ఇక ఎన్‌సీఎల్‌టీ ఆమోదమే తరువాయి

న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయి నేలకు పరిమితమైన జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు త్వరలో మళ్లీ గాల్లోకి లేచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంస్థను పునరుద్ధరించేందుకు దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా బ్రిటన్‌కు చెందిన కల్‌రాక్‌ క్యాపిటల్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన వ్యాపారవేత్త మురారీ లాల్‌ జలాన్‌లతో కూడిన కన్సార్టియం సమర్పించిన ప్రణాళికను జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణదాతల కమిటీ (సీవోసీ) ఆమోదించింది. సంబంధిత ప్రతిపాదనపై శనివారం ఈ-ఓటింగ్‌ జరిగిందని, అనంతరం దివాలా చట్టంలోని సెక్షన్‌ 30(4) కింద సీవోసీ ఈ ప్రణాళికను ఆమోదించిందని జెట్‌ ఎయిర్‌వేస్‌ రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ ఆశిష్‌ చావ్చరియా బాంబే స్టాక్‌ ఎక్సేంజీకి తెలియజేశారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ను దక్కించుకునేందుకు హర్యానాకు చెందిన ఫ్లైట్‌ సిమ్యులేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌, ముంబైకి చెందిన బిగ్‌ చార్టర్‌, అబూధాబీకి చెందిన ఇంపీరియల్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌సీతో కూడిన కన్సార్టియం కూడా బిడ్‌ను దాఖలు చేసింది. కానీ చివరకు కల్‌రాక్‌ క్యాపిటల్‌-మురారీ లాల్‌ జలాన్‌ కన్సార్టియం బిడ్‌నే విజయం వరించింది. ఇక ఈ పరిష్కార ప్రణాళికను నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) కూడా ఆమోదిస్తే జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణకు అన్ని లాంఛనాలు పూర్తయినట్టే. బ్యాంకులకు రూ.8 వేల కోట్లకుపైగా బాకీపడిన జెట్‌ ఎయిర్‌వేస్‌ గతేడాది ఏప్రిల్‌ నుంచి అన్ని కార్యకలాపాలను నిలిపివేసింది. వీటిలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలే ఎక్కువగా ఉన్నాయి. వీటిని రాబట్టుకునేందుకు రుణదాతలు దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ గతేడాది జూన్‌లో విచారణకు స్వీకరించింది. ఈ పరిష్కార ప్రక్రియ ఈ ఏడాది జూన్‌ నాటికే పూర్తవుతుందని మొదట్లో భావించినప్పటికీ కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల వల్ల సాధ్యపడలేదు. దీంతో దివాలా పరిష్కార ప్రక్రియ గడువును రెండుసార్లు పొడిగించాల్సి వచ్చింది.logo