శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Business - Feb 20, 2020 , 00:34:50

ఒప్పందాల్లేవ్‌!

ఒప్పందాల్లేవ్‌!
  • వాణిజ్య అంశాలపై అమెరికాను భారత్‌ తక్కువగా చూస్తున్నది: ట్రంప్‌

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 19: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కారు. వాణిజ్యపరమైన అంశాల్లో అమెరికాతో భారత్‌ వైఖరి సరిగ్గా లేదని ఆరోపించారు. తమ దేశానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం లేదని ఆక్షేపించారు. ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్‌ భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడిన మాటలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు భారత ప్రభుత్వంతో పెద్ద ద్వైపాక్షిక ఒప్పందాలేవీ ఉండకపోవచ్చని సంకేతాలిచ్చారు. దీంతో రాబోయే పర్యటనలో అమెరికా-భారత్‌ మధ్య చెప్పుకోదగ్గ డీల్స్‌ ఉండవని ట్రంప్‌ చెప్పకనే చెప్పారు. ‘భారత్‌ మమ్మల్ని పట్టించుకోవడం లేదు’ అని తాజాగా వ్యాఖ్యానించిన ట్రంప్‌.. గతంలో భారత్‌ను ‘సుంకాల రారాజు’గా అభివర్ణించిన విషయం తెలిసిందే. అమెరికా ఉత్పత్తులపై పెద్ద ఎత్తున పన్నులు వేస్తున్నారని మండిపడ్డ సంగతి విదితమే. ‘మేము చాలా పెద్ద వాణిజ్య ఒప్పందాన్ని భారత్‌తో కుదుర్చుకోవాలని చూస్తున్నాం. కానీ ఎన్నికలకు ముందే ఇది జరుగుతుందా? లేదా? అన్నది మాత్రం నాకు తెలియదు’ అన్నారు. 


రాబర్ట్‌ లైథీజర్‌ రావట్లేదా?

అమెరికా అధ్యక్షుడైన తర్వాత తొలిసారి భారత్‌కు విచ్చేస్తున్న ట్రంప్‌ పర్యటనలో ఇరు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందాలు జరుగనున్నాయన్న అంచనాలున్నాయి. భార త వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, అమెరికా వాణిజ్య మంత్రి రాబర్ట్‌ లైథీజర్‌ మధ్య గత కొద్ది వారాలుగా పలుమార్లు టెలిఫోన్‌ సంభాషణలు జరిగాయి. దీంతో ట్రంప్‌ పర్యటన సందర్భంగా అమెరికా-భారత్‌ మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదురుతాయన్న వార్తలు మీడియాలో వినిపించాయి. కానీ ఈ పర్యటనలో రాబర్ట్‌ లైథీజర్‌ లేరని సమాచారం. ఈ క్రమంలో ట్రంప్‌ వ్యాఖ్యలు.. ఈ టూర్లో పెద్దగా ట్రేడ్‌ డీల్స్‌ ఉండవని తేల్చేస్తున్నాయి. జీఎస్పీలో భారత్‌ను చేర్చాలని, తమ ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అధిక సుంకాలను ఎత్తివేయాలని అమెరికాను మోదీ సర్కారు డిమాండ్‌ చేస్తుండగా.. వ్యవసాయ, తయారీ, పాల ఉత్పత్తులు, వైద్య పరికరాలకు మరింత మార్కెటింగ్‌ అవకాశాలను కల్పించాలని, ఐసీటీ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తొలగించాలని భారత్‌ను అమెరికా కోరుతున్నది. గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో భారత్‌తో అమెరికా వాణిజ్య లోటు 16.9 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. దీన్ని ట్రంప్‌ ఎంతమాత్రం సహించడం లేదు. మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి భారత్‌ది ఆమాత్రం పైచేయి ఉంటే తప్పేం కాదని కేంద్రం వాదిస్తున్నది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ట్రంప్‌ పర్యటనపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొన్నది.


logo