సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 31, 2020 , 02:12:13

జీఎస్టీ నష్టపరిహారం వచ్చేనా!

జీఎస్టీ నష్టపరిహారం వచ్చేనా!

  • రాష్ర్టాలకు కేంద్రం మొండిచెయ్యి?.. 
  • నిధుల సమీకరణకు మార్కెటే దిక్కు

న్యూఢిల్లీ, జూలై 30: కేంద్రం నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నష్టపరిహారం రాష్ర్టాలకు అందే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ర్టాల జీఎస్టీ ఆదాయం పడిపోతే.. దాన్ని తమ ఖజానాల్లో నుంచి చెల్లించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి చట్టరిత్యా ఏమీ లేదని అటార్నీ జనరల్‌ అభిప్రాయపడినట్లు తెలుస్తున్నది. దీంతో కరోనా వైరస్‌ కష్టాల నుంచి గట్టెక్కాలంటే మార్కెట్‌లో నిధుల సమీకరణే రాష్ర్టాలకు దిక్కన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నష్టపరిహార నిధిలో తగ్గుదలను చట్టబద్ధంగా మార్కెట్‌ రుణాలుగా మార్చుకోవచ్చా? విలాసవంతమై న ఉత్పత్తులపై అదనపు సుంకాలతో కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చా? అన్నదానిపై ఈ ఏడాది మార్చిలో అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ అభిప్రాయాలను మోదీ సర్కారు కోరింది. 

దీంతో జీఎస్టీ అమలుతో రాష్ర్టాలు నష్టపోయిన ఆదాయాన్ని భర్తీ చేయడానికి కేంద్రం తమ ఖజానా నిధులను ఖర్చు చేయాల్సిన అవసరం చట్టరిత్యా ఏమీ లేదని వేణుగోపాల్‌ అన్నట్లు సమాచారం. దీంతో జీఎస్టీ నష్టపరిహారాల విషయంలో కేంద్రం రాష్ర్టాలకు మొండిచెయ్యి చూపించే ఆస్కారమున్నది. ఇదే జరిగితే అన్ని రాష్ర్టాలపై పిడుగు పడినట్లే. అసలే కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌లతో ఆర్థిక వ్యవస్థలో భీకర స్తబ్ధత నెలకొన్నది. ఇప్పట్లో ఈ మందగమనం ఛాయలు తొలిగే అవకాశాలూ కనిపించడం లేదు. ఈ క్రమంలో జీఎస్టీ నష్టాలను భరించడం రాష్ట్ర ప్రభుత్వాలకు తలకు మించిన భారమే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మార్కెట్‌ రుణాలపై తుది నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్‌దేనని అటార్నీ జనరల్‌ అన్నట్లు తెలిసింది.

జీఎస్టీ రేట్లను పెంచుతారా?

కరోనా ప్రభావంతో బక్కచిక్కిన ఖజానాను కొంతైనా పరిపుష్ఠం చేసుకునేందుకు జీఎస్టీ రేట్లను పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా లగ్జరీ వస్తూత్పత్తులపై పన్నుల భారం మోపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 


logo