బుధవారం 03 మార్చి 2021
Business - Feb 13, 2021 , 03:01:45

40 వేల మంది ఉద్యోగులపై వేటు

40 వేల మంది ఉద్యోగులపై వేటు

  • ఖర్చుల కుదింపునకు చర్యలు
  • ఆర్సెలార్‌మిట్టల్‌ ప్రకటన

న్యూఢిల్లీ/న్యూయార్క్‌, ఫిబ్రవరి 12: ప్రపంచ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్‌మిట్టల్‌ వచ్చే సంవత్సరం చివరి నాటికి 1 బిలియన్‌ డాలర్ల (రూ.7,261 కోట్ల) ఖర్చులను తగ్గించుకోవాలని నిశ్చయించుకున్నది. దీనిలో భాగంగా తన కార్పొరేట్‌ కార్యాలయ ఉద్యోగుల్లో 20 శాతం మందిని తొలగించనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఉక్కు ఉత్పత్తి, మైనింగ్‌లో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా కొనసాగుతున్న ఆర్సెలార్‌మిట్టల్‌.. ప్రస్తుతం 60 దేశాల్లో కార్యకలాపాలను సాగిస్తున్నది. 17 దేశాల్లో ఉక్కు ఉత్పత్తి కేంద్రాలను కలిగి ఉన్న ఈ కంపెనీలో సుమారు 1.90 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఖర్చుల కుదింపునకు సంబంధించిన ప్రణాళికలో భాగంగా కార్పొరేట్‌ కార్యాలయాల్లోని ఉద్యోగులు, కాంట్రాక్టర్ల సంఖ్యను తగ్గించడం, వనరుల మళ్లింపు లాంటి చర్యలు చేపట్టనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. కొవిడ్‌-19 సంక్షోభానంతరం మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు, ఇతర సంస్థల నుంచి ఎదురయ్యే పోటీని సమర్థంగా అధిగమించి లాభదాయకతను కాపాడుకునేందుకు ఈ చర్యలు చేపట్టక తప్పడంలేదని స్పష్టం చేసింది. తద్వారా దాదాపు 40 వేల మంది సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు వెల్లడించింది. వ్యాపారాన్ని మెరుగుపర్చుకోవడంలో భాగంగా క్రాకోవ్‌ (పోలెండ్‌)లోని బ్లాస్ట్‌ ఫర్నేస్‌, స్టీల్‌ ప్లాంట్‌తోపాటు దక్షిణాఫ్రికాలోని సల్దన్హా కేంద్రాన్ని, ఫ్లోరెంజ్‌ కోక్‌ ఒవెన్‌ బ్యాటరీని ఇప్పటికే శాశ్వతంగా మూసివేసినట్లు ఆర్సెలార్‌మిట్టల్‌ వివరించింది.

ఐపీవోకి టెక్నో పెయింట్స్‌

హైదరాబాద్‌ కేంద్రస్థానంగా రంగుల తయారీ సంస్థ టెక్నో పెయింట్స్‌..స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కావడానికి సిద్ధమవుతున్నది. ప్రస్తుతం దక్షిణాది వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సారించిన సంస్థ..వచ్చే ఐదేండ్లలో దేశవ్యాప్తంగా విస్తరించడంతోపాటు స్టాక్‌ మార్కెట్లోకి అడుగు పెట్టాలని చూస్తున్నది. టెక్నో పెయింట్స్‌ పేరుతో రంగులను విక్రయిస్తున్న ఫార్చ్యూనర్‌ గ్రూపు ఫౌండర్‌ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ..ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లో ఐదు యూనిట్లను నెలకొల్పినట్లు, కంపెనీ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో భాగ్యనగరంలోనే రూ.25 కోట్లతో మరో యూనిట్‌ను నెలకొల్పబోతున్నట్లు చెప్పారు. మిగతా యూనిట్లు 100 శాతం ఉత్పత్తిని సాధించడంతో కొత్త యూనిట్‌ను నెలకొల్పాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. నూతన ప్లాంట్‌ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభంకానుండగా, డిసెంబర్‌ నాటికి సిద్ధంకానున్నట్లు చెప్పారు. 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన ఈ నూతన ప్లాంట్‌ను 3 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నది. 

జీఎమ్మార్‌ నష్టం 1,120 కోట్లు

 జీఎమ్మార్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ లాభాలకు కరోనా సెగ గట్టిగానే తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.1,120.51 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రకటించింది. 2019-20 ఏడాది ఇదే సమయంలోనూ రూ.280.74 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. కన్సాలిడేటెడ్‌ ఆదాయం కూడా రూ.2,297.65 కోట్ల నుంచి రూ.1,673.53 కోట్లకు పడిపోయింది. వీటిలో విమానాశ్రయాల నుంచి రావాల్సిన ఆదాయం రూ.1,636 కోట్ల నుంచి రూ.816.19 కోట్లకు తగ్గడంతో ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపిందని పేర్కొంది. 

VIDEOS

logo