2021 బాగుంటుందా?

రాయ్ బిజినెస్ సర్వేలో రిటైలర్ల మిశ్రమ స్పందన
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో ఈ ఏడాది వ్యాపారాన్ని దారుణంగా కోల్పోయిన రిటైలర్లు.. వచ్చే ఏడాదిపై ఆశలు పెట్టుకున్నారు. గత నెలలో పరిస్థితులు మెరుగు పడటం, పండుగల షాపింగ్ నేపథ్యంలో దేశీయ రిటైల్ పరిశ్రమలో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. అయితే అంతా సర్దుకుంటుందనుకుంటున్న సమయంలో దక్షిణాఫ్రికా, బ్రిటన్లలో కొత్త వైరస్ కలకలం మళ్లీ భయాలను తట్టి లేపింది. దీంతో 2021పై మిశ్రమ స్పందన కనిపిస్తున్నది. కాగా, గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నవంబర్‌లో అమ్మకాలు 13 శాతం తగ్గినప్పటికీ.. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 12 శాతం విక్రయాలు పుంజుకున్నాయి. ఆహార, పప్పుధాన్యాల అమ్మకాలూ 5 శాతం పెరిగాయని భారతీయ రిటైలర్ల సంఘం (రాయ్) 10వ ‘రిటైల్ బిజినెస్ సర్వే’లో తేలింది. అయితే దుస్తుల విక్రయాలు ఇంకా కోలుకోవాల్సి ఉందని, కరోనాకు ముందున్న పరిస్థితులతో పోల్చితే 12 శాతం తగ్గాయని తాజా సర్వే చెప్తున్నది. ‘పండుగలు, పెండ్లిండ్ల సీజన్ కొన్నింటి అమ్మకాలను పెంచాయి. అయితే ప్రయాణాలు ఇంకా పూర్తిస్థాయిలో జరుగలేకపోతుండటం వ్యాపారాలకు దెబ్బే’ అని రాయ్ సీఈవో కుమార్ రాజగోపాలన్ అంటున్నారు.
కొత్త వైరస్‌తో భయం
కరోనా మహమ్మారి రూపాంతరం చెందడం.. వ్యాపారాలకు ప్రతికూలమేనని రాయ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. కొత్త వైరస్‌తో అంతర్జాతీయ ప్రయాణాలు మళ్లీ ఇబ్బందుల్లో పడ్డాయని, దేశంలోనూ ఆంక్షలు వచ్చిపడుతున్నాయని తెలిపింది. దీంతో కొత్త ఏడాదిపై రిటైలర్లలో సందిగ్ధత నెలకొన్నదని రాజగోపాలన్ చెప్తున్నారు. అయినప్పటికీ వచ్చే 6 నెలల్లో కరోనాకు ముందున్న వ్యాపారంలో దాదాపు 85 శాతం అందుకుంటామన్న ధీమాను అయన వ్యక్తం చేశారు. అయితే దేశవ్యాప్తంగా వ్యాపార పరిస్థితులు ఒకేలా లేవని ఈ సందర్భంగా రాయ్ వెల్లడించింది.
పశ్చిమాది రాష్ర్టాల్లో వృద్ధిరేటు -18 శాతంగా, తూర్పు ప్రాంతా ల్లో -17 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఉత్తర, దక్షిణాది రాష్ర్టాల్లో వ్యాపారాలు వేగంగా కోలుకుంటున్నాయని, ఇక్కడ వ్యాపార ప్రగతి -9 శాతంగా ఉందన్నది. ప్రభుత్వ మద్దతుతో పరిస్థితులు మరింత మెరుగుపడగలవన్న ఆశాభావాన్ని వెలిబుచ్చింది. రిటైల్ వ్యాపా రం పరిపుష్ఠిగా ఉంటే నే లక్షలాది మందికి ఉపాధి ఉంటుందని, కాబట్టి ఈ రంగానికి చేయూతనివ్వాలని రాయ్ కోరింది.