ఆదివారం 31 మే 2020
Business - Apr 12, 2020 , 00:53:32

ఉద్దీపనా ప్రపంచం

ఉద్దీపనా ప్రపంచం

కరోనా వైరస్‌ ధాటికి అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థల్ని చక్కదిద్దేందుకు యావత్‌ ప్రపంచం ఉద్దీపనల బాట పట్టింది. అభివృద్ధి చెందిన దేశాలను సైతం ఈ మహమ్మారి కోలుకోలేని దెబ్బ తీస్తున్నది. దీంతో తమతమ ఆర్థిక వ్యవస్థల్ని కాపాడుకునేందుకు అగ్రరాజ్యాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాల వరకు ఆర్థిక ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి. జీడీపీలో చెప్పుకోదగ్గ పరిమాణంలో ఈ ఉద్దీపనలు ఉంటున్నాయి. తద్వారా ఓ వైపు లాక్‌డౌన్‌తో ప్రజా రక్షణ.. మరోవైపు ఉద్దీపనలతో దేశ ఆర్థిక వ్యవస్థల్ని పరిరక్షించుకుంటున్నాయి.

అమెరికా రూ.150 లక్షల కోట్లు 

కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతున్న అమెరికా 2 లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపనల్ని ప్రకటించింది. ఇది ఆ దేశ జీడీపీలో 10 శాతానికి సమానం. మొదట్నుంచి ఆర్థిక నష్టాన్ని అరికట్టాలనే తలంపుతో ఉన్న ట్రంప్‌.. ఈ విషయంలో ఉదారంగా స్పందిస్తున్నారు.

బ్రిటన్‌ రూ.30 లక్షల కోట్లు

బ్రెగ్జిట్‌తో ఆర్థిక ఇబ్బందులనుఎదుర్కొంటున్న బ్రిటన్‌.. తమ ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవడానికి 350 బిలియన్‌ యూరో ల ఉద్దీపనల్ని ప్రకటించింది. ఇది ఆ దేశ జీడీపీలో 15 శాతానికి సమానం.

జపాన్‌ రూ.75 లక్షల కోట్లు 

కరోనా వైరస్‌ కాటునుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడు కునేందుకు జపాన్‌ రూ.75 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఇది ఆ దేశ జీడీపీలో దాదాపు 20 శాతానికి సమానం కావడం విశేషం. పన్ను ప్రోత్సాహకాలు, వడ్డీలేని రుణాలందిస్తున్నారు. 

సింగపూర్‌ రూ.4.5 లక్షల కోట్లు

ఈ వైరస్‌ నేపథ్యంలో తమ ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు మూడు విడుతల్లో ఇప్పటిదాకా సుమారు 60 బిలియన్‌ డాలర్ల ఉద్దీపనల్ని ఆ దేశం ప్రకటించింది. ఇది ఆ దేశ జీడీపీలో 12 శాతానికి సమానం.


logo