బుధవారం 05 ఆగస్టు 2020
Business - Aug 03, 2020 , 00:11:24

క్రెడిట్‌ కార్డు పోయిందా

క్రెడిట్‌ కార్డు పోయిందా

వెంటనే చేయాల్సిన పనులు ఇవీ ఆధునిక సమాజంలో క్రెడిట్‌ కార్డు వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో ఎంతో మంది వీటిని ఉపయోగిస్తున్నారు. ఆర్థిక అవసరాల కోసం కొంత మంది క్రెడిట్‌ కార్డులపై అధికంగా ఆధారపడుతుంటే.. కనీసం ఒక క్రెడిట్‌ కార్డునైనా నిత్యం వెంట ఉంచుకోవడం మరికొందరికి అలవాటుగా మారింది. ఇలాంటివారు క్రెడిట్‌ కార్డులను పోగొట్టుకుంటే ప్రశాంతంగా ఉండలేరు. ఇవి ఇతరులకు అంది దుర్వినియోగమయ్యే ప్రమాదం అధికంగా ఉండటమే ఇందుకు కారణం.

మీ క్రెడిట్‌ కార్డు పోయినా లేక చోరీకి గురైనా వెంటనే ఆ విషయాన్ని మీకు కార్డు జారీచేసిన బ్యాంక్‌కు (ఇష్యూవర్‌కు) తెలియజేయాలి. మీ కార్డును ఇతరులెవరూ దుర్వినియోగం చేయకముందే ఈ విషయాన్ని తెలియజేయడం చాలా ముఖ్యం. తద్వారా ఆ కార్డుతో మున్ముందు జరిగే అక్రమ లావాదేవీలకు మీరు బాధ్యులుగా నిలువరు. కార్డు ఇష్యూవర్‌ ఫోన్‌ నంబరు తెలియకపోతే మీ క్రెడిట్‌ కార్డు స్టేట్‌మెంట్లను ఓసారి పరిశీలించండి. అందులో మీ కార్డు ఇష్యూవర్‌ ఫోన్‌ నంబర్‌ ఉంటుంది. ఆ నంబర్‌కు కాల్‌చేసి మీ ఖాతా నంబర్‌తోపాటు కార్డు పోయిన తేదీ, చివరిసారిగా మీరు జరిపిన లావాదేవీ విలువ తదితర వివరాలను తెలియజేయండి.

తదారా మీ కార్డును బ్లాక్‌/ఫ్రీజ్‌ చేయించుకొని అది దుర్వినియోగం కాకుండా అడ్డుకోవచ్చు. చాలా బ్యాంకులు తమ మొబైల్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారానే కాకుండా ఫోన్‌కాల్‌ ద్వారా కూడా కార్డును బ్లాక్‌ చేసుకునే సదుపాయాన్ని వినియోగదారులకు కల్పిస్తున్నాయి. మీ క్రెడిట్‌ కార్డు బ్లాక్‌ అయ్యేవరకు ఆ కార్డు స్టేట్‌మెంట్‌పై మీరు తప్పనిసరిగా దృష్టి సారించాలి. ఆ కార్డుతో అక్రమంగా ఏవైనా లావాదేవీలు జరిగినట్టు మీ దృష్టికి వస్తే ఆ విషయాన్ని వెంటనే మీ బ్యాంకుకు తెలియజేయాలి. కార్డును బ్లాక్‌ చేసిన తర్వాత మీకు కొత్త కార్డును జారీచేసేందుకు సదరు బ్యాంకు చర్యలు చేపడుతుంది. మీ పాత క్రెడిట్‌ కార్డును రద్దుచేసి కొత్త కార్డును జారీచేస్తుంది.

ప్రొటెక్షన్‌ ప్లాన్లతో భరోసా

దేశంలోని పలు బ్యాంకులతోపాటు బీమా కంపెనీలు కార్డు ప్రొటెక్షన్‌ ప్లాన్‌ (సీపీపీ) సేవలను అందిస్తున్నాయి. చోరీలు, మోసాల నుంచి మీ కార్డులకు ఇవి ఎంతో రక్షణ కల్పిస్తాయి. వాస్తవానికి ఈ ప్లాన్లతో కేవలం మీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులకే కాకుండా శాశ్వత ఖాతా నంబర్‌ (పాన్‌ కార్డు) లాంటి ముఖ్యమైన డాక్యుమెంట్లకూ రక్షణ లభిస్తుంది. ఈ ప్రయోజనాలను పొందాలంటే కొంత మొత్తాన్ని వార్షిక ప్రీమియంగా చెల్లించి మీ కార్డులకు బీమా సదుపాయాన్ని కల్పించుకోవాలి. మీకు అందించే సేవలు, బీమా కాలపరిమితిని బట్టి ఈ ప్లాన్ల ధరలు రూ.900 నుంచి రూ.2,100 వరకు ఉంటాయి.


logo