ఆదివారం 31 మే 2020
Business - Apr 06, 2020 , 23:32:04

ఉద్దీపనల్లో మనమెక్కడ

ఉద్దీపనల్లో మనమెక్కడ

మానవాళి మనుగడనే కరోనా వైరస్‌ ప్రశ్నార్థకం చేస్తున్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ఈ మహమ్మారి చిన్నాభిన్నం చేస్తున్నది. ఈ పెను ఉత్పాతం నుంచి తమ ప్రజలను, ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు అనేక దేశాలు పటిష్ఠమైన చర్యల్నే తీసుకుంటున్నాయి. కరోనాను సమర్థంగా తట్టుకుని ఆర్థికంగా నిలబడేందుకు ప్రతీ దేశం ప్రయత్నిస్తున్నది. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతి కంటే రెట్టింపు స్థాయిలో ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మనకంటే ఎంతో చిన్న దేశం ఇండోనేషియా.. కోవిడ్‌ను తట్టుకునేందుకు రెండుసార్లు ఉద్దీపనలను ప్రకటించింది. పలు దేశాలు చిన్న, మధ్యస్థ వ్యాపార పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకునేందుకు నడుం బిగించాయి. కొన్ని ఆర్థిక వ్యవస్థలోకి నేరుగా సొమ్మును ప్రవేశపెట్టగా.. మరికొన్ని ప్రజా ఆహార పంపిణీ వ్యవస్థ మీద దృష్టి పెట్టాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి తమ సభ్య దేశాలకు లక్ష కోట్ల డాలర్ల సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఒక దేశం కోవిడ్‌-19కు ఎదురొడ్డి శ్రమిస్తున్న వైద్య సిబ్బందికి గౌరవ వేతనం ప్రకటించింది. ఈ కోవలో మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా నిలుస్తారు. డాక్టర్లు, మెడికల్‌ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు దేశంలోనే ప్రప్రథమంగా నగదు ప్రోత్సాహాన్ని అందజేస్తామని అధికారికంగా ప్రకటించారు. రిటైల్‌ సంస్థలు, హోటళ్లు, విమానయాన సంస్థలు వంటి వాటిని పలు దేశాలు ప్రత్యేకంగా ఆదుకుంటున్నాయి.

బ్రిటన్‌

 • ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడానికి 350 బిలియన్‌ యూరోలు, ఇతర అత్యవసరాల కోసం 20 బిలియన్‌ యూరోలను కేటాయించారు
 • వ్యాపార సంస్థలకు ఏడాదిపాటు వడ్డీలేని రుణాల్ని అందజేస్తుంది
 • అద్దె గృహాల్లో నివసించేవారికి సాయం చేసేందుకు ఒక బిలియన్‌ పౌండ్లను కేటాయించింది

కెనడా

 • కరోనాతో నష్టపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు 52 బిలియన్‌ డాలర్ల ప్రత్యేక ఉద్దీపన ప్యాకేజీ
 • 214 బిలియన్‌ డాలర్ల రుణాల మంజూరుకు బ్యాంకులు అంగీకారం
 • 7.1 బిలియన్‌ డాలర్ల మేరకు వ్యాపార రుణాలు మంజూరు

అమెరికా

 • 2 ట్రిలియన్‌ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన
 • కేవలం వృద్దులకు 1000 డాలర్ల చొప్పున చెల్లించేందుకు 500 బిలియన్‌ డాలర్ల కేటాయింపు
 • చిన్న వ్యాపార సంస్థలకు 500 బిలియన్‌ డాలర్లు
 • వ్యక్తిగతంగా, కుటుంబాలకు నేరుగా చెల్లించేందుకు 250 బిలియన్‌ డాలర్లు 
 • నిరుద్యోగులకు బీమా ప్రయోజనాల్ని అందించేందుకు 250 బిలియన్‌ డాలర్లు 

ఫ్రాన్స్‌

 • 49 బిలియన్‌ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ
 • సామాజిక భద్రత పన్ను గణనీయంగా తగ్గింపు
 • నిరుద్యోగ భృతి
 • దుకాణదారులు, స్వయం ఉపాధి పొందేవారికి ప్రత్యేక ఫండ్‌
 • వ్యాపారాలకు ఆర్థిక సాయం అందించేందుకు సుమారు 327 బిలియన్‌ డాలర్లదాకా బ్యాంకు గ్యారెంటీ

జర్మనీ 

 • కరోనా వైరస్‌ వల్ల ఆర్థికంగా చితికిపోయిన సంస్థలను  ఆదుకునేందుకు  610 బిలియన్‌ డాలర్లు 
 • బావారియా రీజియన్‌ పది బిలియన్ల యూరోలతో ప్రత్యేకంగా ఫండ్‌ను ప్రకటించింది
 • చిన్న సంస్థలకు 100 శాతం పూచీకత్తు రుణాలు
 • మధ్యశ్రేణి కంపెనీలకూ ఆర్థిక చేయూత

యూఏఈ

 • చిన్నతరహా సంస్థలను (ఎస్‌ఎంఈ) ఆర్థికంగా ఆదుకునేందుకు 27.2 బిలియన్‌ డాలర్లు కేటాయింపు
 • ప్రజలు, వ్యాపార సంస్థలకు మంచినీరు, విద్యుత్తును అందించేందుకూ సహాయం
 • ఈ ఏడాది ఆఖరుదాకా టోల్‌ ట్యాక్సులు రద్దు
 • మార్కెట్‌ ఫండ్ల కోసం ఒక బిలియన్‌ దినార్ల నగదు లభ్యత
 • పర్యాటక, వినోద రంగాలు చెల్లించే పన్నుపై ఇరవై శాతం వెనక్కి 

సింగపూర్‌

 • వ్యాపార సంస్థలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు, ఉద్యోగంతో పాటు నగదు ప్రవాహాన్ని కల్పించేందుకు దాదాపు 4 బిలియన్‌ డాలర్ల  ప్యాకేజీ కేటాయించింది
 • ఆర్థిక వ్యవస్థ మెరుగయ్యేంత వరకూ 8.3 బిలియన్‌ డాలర్లను కేటాయించింది
 • వ్యాపారులకు, కుటుంబాలను ఆదుకునేందుకు 5.6 బిలియన్‌ డాలర్లను ప్రత్యేకంగా కేటాయించింది


మన ఉద్దీపన ప్యాకేజీ మాటేమిటి?

కోవిడ్‌-19 ఉత్పాతాన్ని సమర్థంగా అధిగమించేందుకు భారత ప్రభుత్వం రిజర్వు బ్యాంకుతో కలిసి ప్రత్యేక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. 

 • రెపో, రివర్స్‌ రెపో రేట్లను తగ్గించింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో సొమ్ము లభ్యత పెరుగుతుంది
 • నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)ని ఒక శాతం తగ్గించింది. దీంతో 1.37 లక్షల కోట్లు బ్యాంకింగ్‌ రంగంలోకి అందుబాటులోకి వస్తున్నాయి
 • టర్మ్‌ రుణాలపై మూడు నెలల మారటోరియం 
 • ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ పథకం కింద గ్రామీణ, పట్టణ నిరుపేదలు, రైతులు, వలస కార్మికుల శ్రేయస్సు కోసం రూ.1.70 లక్షల కోట్లను కేటాయించింది. రోజువారీ కూలీలు, వితంతువులు, స్వయం సహాయక బృందాలు, పింఛన్‌దారులు, వికలాంగులకు ఆహార భద్రతను కల్పించడంతోపాటు పట్టణ, గ్రామీణ వ్యవస్థను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది.logo