మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Jun 29, 2020 , 17:24:55

ఫేస్‌బుక్‌కు ఎదురుదెబ్బ?

ఫేస్‌బుక్‌కు ఎదురుదెబ్బ?

న్యూయార్క్‌ : తమ లాభాల కోసం విద్వేషపూరిత సమాచారాన్ని ఉపేక్షిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్‌కు అమెరికాలో గడ్డురోజులు ఎదురవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఒకరి  తరువాత మరొకరు అన్నట్లుగా పెద్ద. చిన్న ప్రకటనదారులు వరుసకట్టి మరీ ఫేస్‌బుక్‌కు ప్రకటనలు ఇవ్వమంటూ ప్రకటిస్తున్నారు. ఫేస్‌బుక్‌పై తిరుగుబాటు ఉద్యమం కాస్తా.. అక్కడి నుంచి ట్విట్టర్, స్నాప్‌చాట్‌, టిక్‌టాక్, యూట్యూబ్‌తో సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కూడా చేరుకొనే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫేస్‌బుక్‌ నిజయంగానే విద్వేషపూరిత సమాచారాన్ని ఉపేక్షిస్తున్నదా? దీని ఫలితంగానే ప్రకటనదారులకు కొపం వచ్చిందా? ఫేస్‌బుక్‌, ప్రకటనదారుల మధ్య ఏంజరుగుతున్నది? జుకర్‌బర్గ్‌ కోట్లలో ఆదాయం కోల్పోవడానికి వెనుకున్న కారణాలేంటనేది ఒక లుక్కేస్తే.. 

ఉద్యమం ఎలా మొదలైంది..

అమెరికాలో పోలీసుల అదుపులో మరణించిన జార్జి ఫ్లాయిడ్‌ ఘటన అనంతరం సోషల్‌ మీడియాలో అవాంఛిత, విద్వేషపూరిత సమాచారానికి వ్యతిరేకంగా అమెరికాకు చెందిన ఫ్రీ ప్రెస్‌, కామన్ సెన్స్‌ సంస్థలు మానవ హక్కుల సంఘాలతో కలిసి ఉద్యమాన్ని మొదలెట్టాయి. తాత్కాలిక హామీలు కాకుండా సమగ్ర విధానం తీసుకురావాలంటూ ఈ ఉద్యమ నిర్వాహకులు డిమాండ్‌ చేస్తున్నారు. లాభాలు పొందేందుకు విద్యేషపూరిత సమాచారాన్ని చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారని.. దీనికి నిరసనగా #stophateforprofit (స్టాప్‌ హేట్‌ ఫర్‌ ప్రాఫిట్‌) పేరుతో ఈ నెల తొలివారంనుంచి ఉద్యమం ప్రారంభమైంది.  

ఇందులో భాగంగా ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇవ్వకూడదని అమెరికాకు చెందిన 100 కుపైగా దిగ్గజ కంపెనీలు నిర్ణయించాయి. తమతో చేతులు కలుపాల్సిందిగా యూరప్‌కు కూడా ఉద్యమాన్ని  విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు. 'స్టాప్ హేట్ ఫర్ ప్రాఫిట్' ప్రచారంలో భాగంగా బెన్ & జెర్రీస్, స్టార్‌బక్స్, కోకా కోలా, యూనీలీవర్‌, డియాజియో, హోండా, లెవిస్, మొజిల్లా, పెప్సి, ది నార్త్ ఫేస్, ది హెర్షే కంపెనీ, వైబర్ మరియు వెరిజోన్ వంటి  ప్రముఖ సంస్థలు ఫేస్‌బుక్‌కు ప్రకటనలు బహిష్కరించాయి. ఈ జాబితా రోజురోజుకు పెరుగుతుండటం గమనార్హం. 

సోషల్‌మీడియాకు దెబ్బ!

ప్రపంచంలో అతిపెద్ద ప్రకటనదారులలో ఒకరైన యూనీలీవర్‌ సంస్థ కూడా సోషల్ మీడియా నెట్‌వర్క్‌లకు ఎటువంటి ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయించింది. “అమెరికాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లలో ప్రకటనలను నిలిపివేయాలని నిర్ణయించాం. మా చర్య 2020 చివరి వరకు అమలులో ఉంటుంది”అని యూనీలీవర్‌ వెల్లడించింది. యూనీలీవర్‌ బ్రాండ్లలో డోవ్, లైఫ్‌బాయ్, లిప్టన్, లక్స్, రెక్సోనా, బ్లూయిర్, పాండ్స్, బేరి, వాల్స్, ట్రెసెమ్ తదితర వస్తువులు ఉన్నాయి. అడ్వర్టైజింగ్ అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ పాత్మాటిక్స్ ప్రకారం.. యూనీలీవర్‌ గత ఏడాది అమెరికా ఫేస్‌బుక్‌లో 42.4 మిలియన్ డాలర్లను ప్రకటనల కోసం ఖర్చు చేసింది. ఒక్క యూనీలీవర్‌ ప్రకటన కారణంగా ఫేస్‌బుక్‌ తన ఆదాయంలో దాదాపు రూ.1,890 కోట్లను కోల్పోనున్నట్లుగా తెలుస్తున్నది.

ప్రపంచంలో జాత్యహంకారానికి చోటు లేదు.. అలాగే సోషల్ మీడియాలో కూడా జాత్యహంకారానికి చోటు లేదు అని ప్రకటించిన కోకాకోలా కంపెనీ.. ప్రపంచవ్యాప్తంగా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చెల్లింపు ప్రకటనలను నెల రోజుల పాటు నిలుపుదల చేస్తున్నట్టు ఆ కంపెనీ చైర్మన్, సీఈవో జేమ్స్ క్విన్సీ ప్రకటించారు. పాత్మాటిక్స్ డేటా ప్రకారం, కోకాకోలా గత సంవత్సరం ఫేస్‌బుక్‌ ప్రకటనల కోసం 22.1 మిలియన్ డాలర్లు, ట్విట్టర్లో ప్రకటనలకు 18 మిలియన్‌ డాలర్లకు పైగా ఖర్చు చేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఫేస్‌బుక్‌తోపాటు ఇతర సోషల్‌మీడియాల్లో ప్రకటనలను విరమించుకొంటున్నట్టు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మద్యం తయారీకంపెనీ డియాజియో ప్రకటించింది. 

రంగంలోకి జూకర్‌బర్గ్‌

తిరుగుబాటు రావడాన్ని గమనించిన ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్ జుకర్బర్గ్ కీలక ప్రకటన చేశారు. ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌లోని ప్రకటనల్లో విద్వేషపూరిత సంభాషణలను నిషేధిస్తామని, సోషల్ మీడియాపై దాడుల నుంచి హాని కలిగించే గ్రూపులను రక్షించే పోస్ట్‌లను కూడా పరిమితం చేస్తున్నట్టు ప్రకటించారు. కంటెంట్ మోడరేషన్ విధానాలను ఉల్లంఘించే పోస్టులను లేబుల్ చేస్తామని చెప్పారు. కొన్ని వారాల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఆయనకు చెందిన కొన్ని పోస్టులను ట్విట్టర్‌ లేబుల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్‌ తీవ్రంగానే స్పందించారు. ఇలాంటి తప్పుడు విధానాలను అవలంభిస్తే ట్విట్టర్‌ను బహిష్కరిస్తామని కుండబద్దలు కొట్టారు.

ఫేస్‌బుక్‌కు భారీ నష్టం

ప్రకటనదారుల తిరుగుబాటు ఫేస్‌బుక్‌ను చాలా బాధపెడుతున్నది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఫేస్‌బుక్ స్టాక్స్ 8 శాతం తగ్గిపోయాయి. ఫేస్‌బుక్‌ మార్కెట్ విలువ నుంచి 56 బిలియన్ డాలర్ల మేర నష్టపోయినట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతకుముందు త్రైమాసికంలో ఫేస్‌బుక్ 17.7 బిలియన్ డాలర్ల ప్రకటనల ఆదాయాన్ని సంపాదించింది. సంస్థ జుకర్‌బర్గ్‌ సంపద 82.3 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. ఫలితంగా ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన మూడు నుంచి నాలుగో స్థానానికి చేరుకొన్నారు. ఈ ఉద్యమం ఇలాగే కొనసాగితే ఫేస్‌బుక్‌ ఆదయానికి భారీగా గండిపడటం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.


logo