ఆదివారం 07 మార్చి 2021
Business - Jan 29, 2021 , 12:11:27

ఎక‌న‌మిక్ స‌ర్వే అంటే ఏంటి? దానికి ఎందుకంత ప్రాధాన్యత‌?

ఎక‌న‌మిక్ స‌ర్వే అంటే ఏంటి? దానికి ఎందుకంత ప్రాధాన్యత‌?

న్యూఢిల్లీ: బ‌డ్జెట్ సెష‌న్‌లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ పార్ల‌మెంట్‌లో ఎక‌న‌మిక్ స‌ర్వేను ప్ర‌వేశ‌పెట్టారు. ప్ర‌తిసారీ బ‌డ్జెట్ ముందు రోజు ఆర్థిక స‌ర్వేను ప్ర‌వేశ‌పెట్ట‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అయితే ఈసారి బ‌డ్జెట్ సోమ‌వారం వ‌స్తుండ‌టంతో బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభం రోజునే ఆర్థిక మంత్రి ఈ స‌ర్వేను ప్ర‌వేశ‌పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు ఆర్థిక స‌ర్వే అంటే ఏంటి?  దానికి ఎందుకంత ప్రాముఖ్య‌త అన్న‌ది ఒక‌సారి చూద్దాం.

ఆర్థిక స‌ర్వే అంటే ఏంటి?

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఓ రోడ్ మ్యాప్‌లాంటిది ఆర్థిక స‌ర్వే. వ‌చ్చే ఏడాది బడ్జెట్ ఎలా ఉండాలో ఈ స‌ర్వే నిర్దేశిస్తుంది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఎలా ముందడుగు వేసిందన్న‌ది చెప్ప‌డంతోపాటు ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప్ర‌ధాన అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల గురించి వెల్ల‌డిస్తుంది. ఈ స‌ర్వేను చీఫ్ ఎక‌న‌మిక్ అడ్వైజ‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక‌న‌మిక్ అఫైర్స్‌కు చెందిన ఎక‌న‌మిక్స్ డివిజ‌న్ సిద్ధం చేస్తుంది. ప్ర‌స్తుతం సీఈఏగా కృష్ణ‌మూర్తి సుబ్ర‌మ‌ణియ‌న్ ఉన్నారు. 

ఎందుకంత ప్రాధాన్యత?

బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న‌లో ఆర్థిక స‌ర్వే ప్ర‌ముఖ పాత్ర పోషిస్తుంది. ఇది దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను క‌ళ్ల‌కు క‌డుతుంది. దేశంలోని ప్ర‌ధాన రంగాలైన వ్య‌వ‌సాయం, ప‌రిశ్ర‌మ‌లు, మౌలిక స‌దుపాయాలు, ఎగుమ‌తులు, దిగుమ‌తులలోని ట్రెండ్స్‌ను విశ్లేషిస్తుంది. ఆర్థిక వృద్దిని అంచ‌నా వేస్తుంది. కొన్నిసార్లు తీసుకురావాల్సిన సంస్క‌ర‌ణ‌ల గురించి కూడా వివ‌రిస్తుంది. 2020లో క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఈసారి ఆర్థిక స‌ర్వేకు మ‌రింత ప్రాముఖ్య‌త ఏర్ప‌డింది. ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై క‌రోనా ప్ర‌భావం ఎంత మేర ఉంద‌న్న‌ది ఈ ఆర్థిక స‌ర్వే వెల్ల‌డించ‌నుంది. 

ఆర్థిక స‌ర్వే చ‌రిత్ర‌

బ‌డ్జెట్‌కు ముందు ఆర్థిక స‌ర్వేను ప్ర‌వేశపెట్ట‌డం మ‌న దేశంలో చాలా కాలంగా ఆన‌వాయితీగా వ‌స్తోంది. 1950-51న తొలిసారి ఆర్థిక స‌ర్వేను లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. అప్ప‌టి నుంచి 1964 వ‌ర‌కు బ‌డ్జెట్‌తో క‌లిపే ఈ స‌ర్వేను ప్ర‌వేశ‌పెట్టేవారు. అయితే 1964 నుంచి బ‌డ్జెట్‌కు ముందు రోజు ఆర్థిక స‌ర్వేను ప్ర‌వేశ‌పెడుతున్నారు.


ఇవి కూడా చ‌ద‌వండి

ఇండియాలో వాట్సాప్‌ను ఎంత మంది డిలీట్ చేశారో తెలుసా?

5 వేల క‌రోనా వ్యాక్సిన్ డోసులు వృథా

మూడు రోజుల్లోనే 50 ల‌క్ష‌ల డౌన్‌లోడ్స్‌.. రికార్డులు సృష్టిస్తున్న ఫౌజీ

VIDEOS

logo