బడ్జెట్లో సామాన్యుడు ఏం ఆశిస్తున్నాడు?

యావత్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా వైరస్.. భారత ఆర్థిక వ్యవస్థనూ కుంగదీసింది. ఈ మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలూ స్తంభించిపోగా.. ఎన్నో వ్యాపారాలు, సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఒక్కసారిగా నగదు కొరత, మందగమనం మార్కెట్‌ను ఆవహించాయి. ఫలితంగా ఎందరికో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దూరమయ్యాయి. ఈ నేపథ్యంలో వస్తున్న బడ్జెట్లో సామాన్యుడు కోరుకుంటున్నదేమిటి?.. ఇదే అంశంపై ఆదిత్యా బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ దేశవ్యాప్తంగా 150 నగరాల్లో సర్వే చేపట్టింది. ఇందులో ఐదు కీలక అంశాలపై 1043 మంది (35-55 ఏండ్ల వయసువారు) తమ అభిప్రాయాలను తెలియజేశారు. వచ్చే 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంట్లో ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.
వేతన జీవులకు ఊరట?
స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపుపై 74 శాతం పరిశ్రమ ఆశాభావం
ఆదాయం పన్ను (ఐటీ) చట్టం 1961 కింద వేతన జీవులందరి కోసం రూ.50వేల నిర్దిష్ట తగ్గింపు అందుబాటులో ఉన్నది. అయితే రాబోయే బడ్జెట్లో దీన్ని పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని 74 శాతం పరిశ్రమ అంచనా వేస్తున్నది. ఈ మేరకు 2021-22 బడ్జెట్‌పై చేసిన కేపీఎంజీ ఇండియా సర్వేలో స్పష్టమైంది. లక్ష రూపాయలకు పెంచవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొత్తగా కొవిడ్-19 సెస్సు రావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
డిస్కంలకు రూ.3 లక్షల కోట్లు?
ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న విద్యుత్ పంపిణీ సంస్థలకు బడ్జెట్లో రూ.3 లక్షల కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం.
‘కరోనా వైరస్ ప్రభావంతో చితికిపోయిన రంగాలకు బడ్జెట్లో చేయూతనివ్వాలి. మౌలిక రంగానికి మరిన్ని పెట్టుబడులను అందించాలి. ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలకు పెద్దపీట వేయాలి.’
-గీతా గోపీనాథ్, ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త