ఆదివారం 31 మే 2020
Business - Apr 22, 2020 , 16:51:17

జియోలో ఫేస్‌బుక్ వాటాల కొనుగోలు దేనికి సంకేతం?

జియోలో ఫేస్‌బుక్ వాటాల కొనుగోలు దేనికి సంకేతం?

హైదరాబాద్: టెలికాం దిగ్గజం జియోలో సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్‌బుక్ పెట్టుబడులు పెట్టడం వాణిజ్య వర్గాల్లో సంచలనం సృష్టించింది. 570 కోట్ల డాలర్లతో (రూ.43,574 కోట్లు) పదిశాతం వాటా సొంతం చేసుకున్నది. దీంతో జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ల ధరలు ఒక్కుమ్మడిగా పదిశాతం పెరిగాయి. అంతకాకుండా భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ షేర్లు కూడా అధికధరలకు అమ్ముడవుతున్నాయి. జియోలో బయటి కంపెనీలు వాటాలు కొనుగోలు చేయడం అనేది సెంటిమెంటల్‌గా భారతి, వొడాఫోన్‌లకు సానుకూలమైన విషయమని దోలత్ కేపిటల్ మార్కెట్ విశ్లేషకులు ఒక నోట్‌లో తెలిపారు. ఏదేమైనా తాజా పరిణామాలు తదుపరి టారిఫ్ పెంపులకు అడ్డుపడొచ్చనే సందేహాలు వినవస్తున్నాయి. టారిఫ్‌లు తగ్గించి బిజినెస్ పెంచుకునే ధోరణి జియోకు అలవాటే కనుక ఇప్పుడప్పుడే మార్కెట్‌లో టారిఫ్ పెంపుదలలు ఉండకపోవచ్చనే అంటున్నారు. రిలయన్స్ టారిఫ్ తగ్గించచడం అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే కొత్తకంపెనీ టారిఫ్ తగ్గింపు వంటి దుందుడుకు చర్యలకు దిగవచ్చు. కానీ మార్కెట్ లీడర్‌కు అది కుదరదు. ఇప్పటికే జియో టారిఫ్ పోటీదార్ల కన్నా 7 నుంచి 20 శాతం తక్కువగా ఉంది. అదేస్థాయిలో కొనసాగిస్తే గతంలోలాగా సబ్‌స్క్రైబర్లను విస్తరించుకంటూపోవచ్చునని జెఫరీస్ ఇండియా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రకారకాల కారణాల వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో 2020లో టారిఫ్ పెంపుదలలు ఉండకపోవచ్చనే అంటున్నారు. అంతిమంగా చూస్తే సాంకేతికంగా, ఆర్థికంగా బలమైన ప్రత్యర్థి ఉండడం ప్రస్తుత పోటీదార్లకు అంత సానుకూలమైన విషయమేమీ కాదని చెప్పొచ్చు.


logo