మంగళవారం 31 మార్చి 2020
Business - Jan 23, 2020 , 00:20:01

కలిసి పనిచేస్తేనే వృద్ధి

కలిసి పనిచేస్తేనే వృద్ధి
  • గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌

దావోస్‌, జనవరి 22: ఒక సంస్థ వృద్ధిపథంలో నడువాలంటే అందులోని అందరూ బాగా పనిచేయాలని గూగుల్‌ సీఈవో, భారత సంతతి టెక్కీ సుందర్‌ పిచాయ్‌ అన్నారు. మాతో పనిచేస్తున్నవారు బాగా పనిచేసినప్పుడే మేమూ పని చేయగలమని చెప్పారు. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సమావేశాల్లో పిచాయ్‌ పాల్గొన్నారు. డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపక, ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ క్లాస్‌ స్వాబ్‌తో బుధవారం మాట్లాడుతూ స్టార్టప్‌లను కొనుగోలు చేస్తున్నామని, మరిన్ని స్టార్టప్‌లలో మాకు అనుబంధంగా ఉన్న సంస్థలతో పెట్టుబడులను పెట్టిస్తున్నామని చెప్పారు. కాగా, గూగుల్‌ మరింత శక్తివంతమైతే ఏవైనా ఇబ్బందులు తలెత్తవచ్చా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ ఉండదని కొట్టిపారేశారు. ఈ క్రమంలోనే కృత్రిమ మేధస్సు (ఏఐ) రెగ్యులేషన్స్‌పై అన్ని దేశాలూ కలిసి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

మెరుగైన భారత్‌ ప్రతిభ

ఈ ఏడాది అంతర్జాతీయ పోటీయుత ప్రతిభ సూచీలో భారత్‌ స్థానం మెరుగైంది. 8 స్థానాలు ఎగబాకి 72కు చేరింది. వృద్ధి, ఆకర్షణ, సుస్థిర ప్రతిభ ఆధారంగా ఆయా దేశాలకు ఈ ర్యాంకులు దక్కాయి. 132 దేశాల ఈ జాబితాలో స్విట్జర్లాండ్‌ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో అమెరికా, మూడో స్థానంలో సింగపూర్‌ ఉన్నాయి. కాగా, అధికారిక విద్యలో భారత్‌కు 68వ స్థానం దక్కగా, ఉపాధి కల్పనలో భేష్‌ అని తేలింది. అయితే మధ్యస్థాయిలో నైపుణ్యం పేలవంగా ఉందని స్పష్టమైంది. ఇక టాప్‌-10 దేశాల్లో స్వీడన్‌ నాలుగో స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో వరుసగా డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, ఫిన్లాండ్‌, లగ్జెంబర్గ్‌, నార్వే, ఆస్ట్రేలియా ఉన్నాయి.


logo
>>>>>>