ఆదివారం 24 మే 2020
Business - Jan 14, 2020 , 00:59:45

వాల్‌మార్ట్‌లో ఉద్యోగులపై వేటు

వాల్‌మార్ట్‌లో ఉద్యోగులపై వేటు
  • 56 మంది తొలగింపు
  • భారత్ నుంచి వైదొలగబోమన్న సంస్థ

న్యూఢిల్లీ, జనవరి 13: ప్రపంచంలో అతిపెద్ద రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఇండస్ట్రీ..దేశవ్యాప్తంగా 56 మంది ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులను తొలగించింది. వీరిలో ఎనిమిది మంది సీనియర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు. వ్యాపార పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాల్‌మార్ట్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో క్రిశ్ ఐయర్ ఒక ప్రకటనలలో తెలిపారు. అయినప్పటికీ భారత్‌లో హోల్‌సేల్ రిటైల్ వ్యాపారాన్ని కొనసాగిస్తామన్న ధీమాను ఆయన వ్యక్తంచేశారు. తొలగించిన వారిలో రియల్ ఎస్టేట్ డివిజన్‌కు చెందిన విభాగంలో పనిచేసేవారే అధికంగా ఉన్నారని, ఈ విభాగం స్టోర్లు భారీగా విస్తరించినప్పటికీ ఆశించిన స్థాయిలో పనితీరు కనబరుచలేకపోయామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో సంస్థ 28 హోల్‌సేల్ స్టోర్లను ఏర్పాటు చేసి చిన్న స్థాయి కిరాణా స్టోర్లకు వస్తువులను విక్రయిస్తున్నది. ఏప్రిల్‌లో మరోదఫా ఉద్యోగులు తొలగించనున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. ప్రస్తుతం తొలగించిన వారిలో భారత్‌లో ఉన్న మొత్తం సిబ్బందుల్లో ఒక్కశాతం మాత్రమేనని పేర్కొన్నారు. 


logo