కొత్త కార్లకు ఫుల్ డిమాండ్.. పది నెలలు ఆగాల్సిందే!

చెన్నై: దేశంలో కొత్త కార్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సొంత కారు కావాలని అనుకునే వాళ్ల సంఖ్య రోజురోజుకూ ఎక్కువ అవుతుండటం, తక్కువ వడ్డీకే లోన్లు వస్తుండటంతో కొత్త కార్లకు గిరాకీ విపరీతంగా పెరిగిపోతోంది. కొన్ని కార్ల కోసమైతే ఏకంగా పది నెలలు వేచి చూడాల్సి వస్తుండటం కార్లకు ఉన్న డిమాండ్‌కు అద్దం పడుతోంది. బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీలతోపాటు మధ్యతరగతి కార్లయిన మారుతి ఆల్టో, వేగర్ ఆర్, స్విఫ్ట్, హ్యుండాయ్ ఐ20 కార్లకు కూడా చాలా కాలం వేచి చూడాల్సి వస్తోంది.
మారుతియే టాప్
ఇండియాలో మారుతి కార్లకు తిరుగు లేదు. మధ్యతరగతి వాళ్లకు కూడా అందుబాటులో ఉండే ధరలలు, ఈజీ మెయింటెనెన్స్.. చాలా మంది మారుతి వైపు మొగ్గేలా చేస్తాయి. ఈ కంపెనీ మోడల్స్ అయిన స్విఫ్ట్, వేగన్ ఆర్కు 3 నుంచి 4 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. అదే ఎర్టిగా అయితే 6 నుంచి 8 నెలలు వెయిట్ చేయాల్సిందే.
హ్యుండాయ్ పరిస్థితీ అంతే
మారుతి తర్వాత ఇండియాలో హ్యుండాయ్ కార్లకు ఆ స్థాయి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీ మోడల్ కార్లకు కూడా ఫుల్ డిమాండ్ ఉండటంతో వాటి ఉత్పత్తిని భారీ పెంచేసినట్లు సంస్థ వెల్లడించింది. గతేడాది బెస్ట్ ఎస్‌యూవీగా నిలిచిన హ్యుండాయ్ క్రెటా మోడల్ ఉత్పత్తిని 340 యూనిట్ల నుంచి 640 యూనిట్లకు పెంచారు. దీంతో వెయిటింగ్ పీరియడ్ 6 నెలల నుంచి 3 నెలలకు తగ్గింది. వెన్యూ, వెర్నా మోడల్స్ ఉత్పత్తిని కూడా పెంచేసింది. ఇక ఐ20 కారుకు కూడా 2 నుంచి 3 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉండటంతో ఆ మోడల్ ఉత్పత్తిని కూడా పెంచాలని నిర్ణయించింది.
కియాకూ అదే డిమాండ్
సౌత్ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా మోడల్స్‌కు కూడా ఈ మధ్య ఇండియాలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆ సంస్థ టాప్ మోడల్స్ అయిన సెల్టోస్, సోనెట్‌లకు 2-3 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ సంస్థ నాసిక్ ప్లాంట్‌లో నెలకు 2 వేల కార్లను తయారు చేయాలని భావించినా.. పెరిగిన డిమాండ్ నేపథ్యంలో ఇప్పుడు 3000 నుంచి 3500 కార్లు ఉత్పత్తి చేస్తున్నారు. నిసాన్ మాగ్నెట్ కారుకు కూడా 6 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. దీంతో ఆ సంస్థ నెలకు 2700 కార్లకు బదులు 4000 కార్లను తయారు చేయాలని నిర్ణయించింది.
గత డిసెంబర్లో మొత్తంగా దేశవ్యాప్తంగా 2,76,500 కార్లు అమ్ముడుపోయాయి. గత దశాబ్ద కాలంలో ఒక నెలలో ఇన్ని కార్లు అమ్ముడుపోవడం ఇదే తొలిసారి. డిసెంబర్లో భారీ డిమాండ్‌తో నెలాఖరులో కొన్ని కంపెనీలు షట్‌డౌన్ చేశాయి. దీనివల్ల కూడా ఉత్పత్తి తగ్గి, డిమాండ్ పెరిగి వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత పెరిగిపోయింది.