గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 31, 2021 , 17:08:15

అంబానీ.. అమితాబ్‌పై ఈడీ దాడులు

అంబానీ.. అమితాబ్‌పై ఈడీ దాడులు

న్యూఢిల్లీ: ‌దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అమ‌లులో ఉన్న లైసెన్స్ రాజ్ విధానానికి విశ్వ‌నాథ ప్ర‌తాప్ సింగ్ తొలుత తిలోద‌కాలు ఇచ్చారు. ఇందిరాగాంధీ దారుణ హ‌త్య అనంత‌రం 1984 డిసెంబ‌ర్‌లో జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన రాజీవ్ ‌గాంధీ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా విశ్వ‌నాథ ప్ర‌తాప్ సింగ్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 1985-87 మ‌ధ్య ఆర్థిక మంత్రిగా ఉన్న వీపీసింగ్ అలియాస్ విశ్వ‌నాథ ప్ర‌తాప్ సింగ్‌.. ప్ర‌ధాని సూచ‌న‌ల మేర‌కు ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు అమ‌లులో ఉన్న క‌ఠిన నిబంధ‌న‌ల‌ను క్ర‌మంగా స‌ర‌ళ‌త‌రం చేయ‌డం ప్రారంభించారు. 

ప‌న్ను ఎగ‌వేత‌దారుల భ‌ర‌తం ప‌ట్టేందుకు పూనుకున్నారు. అందుకోసం ప‌న్ను ఎగ‌వేత‌దారుల‌పై కొర‌డా ఝుళిపించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ)కి అధికారాలు క‌ట్ట‌బెట్టారు. ఆయ‌న నుంచి అందిన ఆదేశాలు త‌డ‌వుగా ఈడీ దేశంలోని ప్ర‌ముఖుల ఇండ్లు, కార్యాల‌యాల‌పై దాడులు చేసింది. 

ఈనాడు ప్ర‌పంచ కుబేరుల్లో ఒక‌రిగా పేరొందిన ముకేశ్ అంబానీ తండ్రి.. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ స్థాప‌కుడు ధీరూబాయి అంబానీ, నెహ్రూ-గాంధీ కుటుంబానికి ప్ర‌త్యేకించి రాజీవ్‌కు అత్యంత స‌న్నిహితుడైన బాలీవుడ్ న‌టుడు బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఇత‌ర కాంగ్రెస్ అనుకూల పారిశ్రామిక‌వేత్త‌ల‌పైనా ఈడీ దాడులు చేసింది. ఫ‌లితంగా వీపీసింగ్‌కు భారీ ప్ర‌జాద‌ర‌ణ ల‌భించింది. దీంతో పారిశ్రామిక‌వేత్త‌లంతా రాజీవ్‌గాంధీని ఆశ్ర‌యించారు. త‌త్ఫ‌లితంగా ఆర్థిక‌శాఖ నుంచి తొల‌గించి.. వీపీసింగ్‌ను ర‌క్ష‌ణ మంత్రిగా నియ‌మించారు. 

ర‌క్ష‌ణ మంత్రిగా వీపీ సింగ్ ఉన్న‌ప్పుడే బోఫోర్స్ కుంభ‌కోణం వెలుగు చూడ‌టంతో మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగి జ‌న‌తా పార్టీతో స‌హా ప‌లు కాంగ్రెస్ వ్య‌తిరేక పార్టీల‌ను క‌లుపుకుని తొలుత జ‌న‌మోర్చా.. అటుపై జ‌న‌తాద‌ళ్ ఏర్పాటు చేశారు. 1989 ఎన్నిక‌ల్లో నేష‌న‌ల్ ఫ్రంట్ త‌ర‌పున విజ‌యం సాధించారు. బీజేపీ, లెఫ్ట్ పార్టీల మ‌ద్ద‌తుతో దేశ ఏడ‌వ ప్ర‌ధానిగా నియ‌మితుల‌య్యారు.

ఓబీసీల‌కు రిజర్వేష‌న్ల అమ‌లుకు మండ‌ల్ క‌మిష‌న్ సిఫార‌సుల‌ను అమ‌లు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. బీజేపీ మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకోవ‌డంతో  1989 డిసెంబ‌ర్ రెండో తేదీన ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన వీపీసీంగ్‌.. 1990 న‌వంబ‌ర్ 10న రాజీనామా చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo