ఆదివారం 31 మే 2020
Business - Apr 21, 2020 , 00:23:18

మాల్యాకు ఎదురుదెబ్బ

మాల్యాకు ఎదురుదెబ్బ

  • భారత్‌కు అప్పగింత కేసులో పరాజయం
  • బ్రిటన్‌ హైకోర్టులో సీబీఐ, ఈడీకి విజయం

లండన్‌, ఏప్రిల్‌ 20: విజయ్‌ మాల్యాకు బ్రిటన్‌ హైకోర్టులో చుక్కెదురైంది. భారత్‌కు అప్పగింత కేసును సోమవారం ఆయన ఓడిపోయారు. బ్యాంకులకు రూ.9వేల కోట్లకుపైగా రుణాలను ఎగ్గొట్టి 2016 మార్చిలో మాల్యా లండన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై మోసం, మనీ లాండరింగ్‌ కేసులు నమోదవగా, తమకు అప్పగించాలని బ్రిటన్‌లో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లు న్యాయపోరాటం చేస్తున్న సంగతీ విదితమే. 2018 డిసెంబర్‌లో తనను భారత్‌కు అప్పగించాలంటూ లండన్‌ వెస్ట్‌మినిస్టర్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ మాల్యా హైకోర్టుకెక్కారు. ఇప్పుడు హైకోర్టు సైతం క్రింది కోర్టు తీర్పునే సమర్థించింది. అయితే ఈ కేసులో సుప్రీం కోర్టుకు వెళ్లవచ్చని మాల్యాకు 14 రోజుల గడువును హైకోర్టు ఇచ్చింది. ఈలోగా మాల్యా సుప్రీంలో పిటిషన్‌ వేస్తే తీర్పు వచ్చేదాకా బ్రిటన్‌ హోం శాఖ కార్యాలయం వేచిచూడాల్సి వస్తుంది. లేనిపక్షంలో భారత్‌-బ్రిటన్‌ అప్పగింత ఒప్పందం ప్రకారం 28 రోజుల్లోగా మాల్యాను స్వదేశానికి అప్పగించాల్సి ఉంటుంది. 


logo