శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Feb 19, 2020 , 00:24:04

కేసీపీ చీఫ్‌ వెలగపూడి లక్ష్మణదత్‌ కన్నుమూత

కేసీపీ చీఫ్‌ వెలగపూడి లక్ష్మణదత్‌ కన్నుమూత

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: ప్రముఖ వ్యాపారవేత్త, కేసీపీ సంస్థల అధినేత వెలగపూడి లక్ష్మణదత్‌ (82) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. లక్ష్మణదత్‌కు భార్య ఇందిరాదత్‌, కుమార్తె కవిత ఉన్నారు.  డిసెంబర్‌ 27, 1937న జన్మించిన ఆయన..రాష్ట్ర పారిశ్రామికీకరణలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఫిక్కీ) ప్రెసిడెంట్‌గా 1991-92లో విధులు నిర్వహించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు, గుంటూరు జిల్లా మాచర్ల, చెన్నైలలో సిమెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసిన ఆయన..వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించారు.  లండన్‌లోని బిజినెస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పట్టాపొందిన ఆయన సారథ్యంలో కేసీపీ గ్రూపు సిమెంట్‌, చక్కెర, భారీ యంత్రాల వ్యాపారాలకు విస్తరించింది. దత్‌ మృతిపట్లా ప్రస్తుత ఫిక్కీ ప్రెసిడెంట్‌ సంగీతా రెడ్డి తన ప్రగాడ సంతాపాన్ని వ్యక్తంచేశారు. దేశం, పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన సేలు అమోఘమని, దేశ ఆర్థిక వ్యవస్థ పతనవ్యవస్థలో ఉన్నప్పుడు ఫిక్కీ చైర్మన్‌గా వ్యవహరించినట్లు ఆమె చెప్పారు. 


పారిశ్రామికానికి లోటు: వెంకయ్యనాయుడు 

వీఎల్‌ దత్‌ మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మరణవార్త తెలిసిన అనంతరం ఆ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి పరామర్శించారు. దత్‌ మృతి భారత పారిశ్రామిక రంగానికి తీరని లోటన్నారు. 


మిత్రుడినికోల్పోయా : నామా నాగేశ్వర్‌రావు 

కేసీపీ సిమెంట్స్‌ అధినేత  వీఎల్‌ దత్‌ మరణం  పట్ల టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా  నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి మిత్రుడిని కోల్పోయానన్నారు. దత్‌ మంచి వ్యాపారవేత్త అనీ, ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో ముందుండేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి పరామర్శించారు. బుధవారం చెన్నై వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొంటానని నామా తెలిపారు. 


logo