ఆదివారం 31 మే 2020
Business - May 08, 2020 , 02:07:05

త్వరలో వెహికల్‌ స్క్రాపింగ్‌ పాలసీ

త్వరలో వెహికల్‌ స్క్రాపింగ్‌ పాలసీ

  • రూ.15 లక్షల కోట్లతో రహదారుల నిర్మాణం
  • కేంద్ర రవాణాశాఖ మంత్రి గడ్కరీ వెల్లడి

న్యూఢిల్లీ, మే 7: దేశంలో ఆటోమొబైల్‌ రంగానికి ఊతమిచ్చేందుకు త్వరలో వెహికల్‌ స్క్రాపింగ్‌ పాలసీని ఖరారు చేయనున్నట్టు కేంద్ర రోడ్డురవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం వెల్లడించారు. వచ్చే రెండేండ్లలో దేశవ్యాప్తంగా రూ.15 లక్షల కోట్లతో రహదారులను నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నట్టు ఆయన తెలిపారు. ‘వెహికల్‌ స్క్రాపింగ్‌ పాలసీని త్వరలో ఖరారు చేస్తాం. దీంతో ఉత్పత్తి వ్యయం తగ్గి ఆటోమొబైల్‌ పరిశ్రమకు ఊతం లభిస్తుంది. ఈ విషయమై నేను బుధవారం కూడా మా కార్యదర్శితో చర్చించా. సాధ్యమైనంత త్వరలో ఈ విధానాన్ని తీసుకొస్తాం’ అని భారత వాహన తయారీ సంస్థల సమాఖ్య (సియామ్‌) సభ్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గడ్కరీ చెప్పారు. కాలుష్యాన్ని వెదజల్లుతున్న పాత వాణిజ్య వాహనాలను నిర్మూలించడంపై దృష్టిసారించే ఈ విధానానికి కేంద్ర మంత్రివర్గం నుంచి తుది అనుమతి లభించాల్సి ఉన్నది. టూవీలర్లు, త్రీవీలర్లు సహా అన్నిరకాల వాహనాలకు వర్తించే ఈ విధానానికి ఆమోదం లభిస్తే దేశం వాహన తయారీ కేంద్రంగా ఆవిర్భవిస్తుందని, స్టీలు, అల్యూమినియం, ప్లాస్టిక్‌ లాంటి తుక్కు రీసైక్లింగ్‌తో కీలకమైన ముడిపదార్థాలు విరివిగా అందుబాటులోకి వచ్చి వాహన ధరలు 20 నుంచి 30 శాతం మేరకు తగ్గుతాయని గడ్కరీ వివరించారు.

పతనం అంచున ఎంఎస్‌ఎంఈలు

ప్రస్తుతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగం పతనం అంచున ఉన్నదని గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి పెద్ద పరిశ్రమలు చెల్లించాల్సిన పాత బకాయిలను నెలరోజుల్లోగా విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎంఎస్‌ఎంఈలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలతోపాటు పెద్ద పరిశ్రమలు చెల్లించాల్సిన బకాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయని గడ్కరీ అన్నారు. 

త్వరలో అన్ని రంగాలకూ ప్యాకేజీ

 కరోనా కాటుతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్నది. కేవలం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికే కాకుండా అన్ని రంగాలకు సమగ్రమైన ప్యాకేజీని ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ కార్యదర్శి గిరిధర్‌ అర్మాణీ తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని కార్యాలయానికి, ఆర్థిక వ్యవహారాల విభాగానికి మధ్య ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నట్టు గురువారం  సియామ్‌ సభ్యులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.


logo