మంగళవారం 07 ఏప్రిల్ 2020
Business - Jan 15, 2020 , 00:36:45

కూర‘గాయాలు’

కూర‘గాయాలు’
  • గత నెల భగ్గుమన్న టోకు ధరల సూచీ
  • 8 నెలల గరిష్ఠానికి చేరిక
  • ఉల్లి, బంగాళదుంపల దెబ్బ
  • డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 2.59 శాతంగా నమోదు

న్యూఢిల్లీ, జనవరి 14: ఠారెత్తిస్తున్న కూరగాయల ధరలు.. ద్రవ్యోల్బణాన్ని ప్రమాదకరంగా మార్చేస్తున్నాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు డిసెంబర్‌లో 8 నెలల గరిష్ఠాన్ని తాకాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు కార్యాలయం మంగళవారం విడుదల చేసిన వివరాల ప్రకారం గత నెల హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణం 2.59 శాతంగా నమోదైంది. అంతకుముందు నెల నవంబర్‌లో 0.58 శాతంగానే ఉండగా, గతేడాది డిసెంబర్‌లో 3.46 శాతంగా ఉన్నది. నిరుడు ఏప్రిల్‌లో 3.24 శాతంగా ఉండగా, మళ్లీ డిసెంబర్‌లోనే ఆ స్థాయి గణాంకాలు నమోదైయ్యాయి. ఉల్లి, ఆలుగడ్డ వంటి ఆహారోత్పత్తుల ధరలు భగ్గుమనడంతో ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఆందోళనకర స్థాయికి ఎగిసింది. సోమవారం వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా ఎగబాకిన విషయం తెలిసిందే. ఐదున్నరేండ్ల గరిష్ఠాన్ని చేరి డిసెంబర్‌ సీపీఐ ద్రవ్యోల్బణం 7.35 శాతంగా ఉన్నది. ఆహారోత్పత్తుల అధిక ధరలే ఇందుకు కారణమని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) స్పష్టం చేసిన సంగతీ విదితమే.
Vegetables1


అదుపు తప్పిన ఆహార ద్రవ్యోల్బణం

క్రమేణా పెరుగుతున్న ఆహారోత్పత్తుల ధరలు.. అటు రిటైల్‌, ఇటు హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నాయి. డిసెంబర్‌లో ఆహారోత్పత్తుల ధరలు 13.12 శాతం పెరుగగా, ఉల్లిగడ్డ, బంగాళదుంప ధరలు ఇందుకు ప్రధాన కారకాలుగా నిలుస్తున్నాయి. కూరగాయల ధరలు 69.69 శాతం పెరుగగా, ఉల్లిగడ్డ వాటానే 455.83 శాతంగా ఉన్నది. ఆలుగడ్డ ధర 44.97 శాతం ప్రియమైనట్లు తేలింది. కాగా, దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భారీ స్థాయిలో పెరుగగా, పలు మార్కెట్లలో కిలో రూ.100కుపైగా పలికింది. అధిక వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బతిన్నది. దీంతో మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ధరలు పరుగులు పెట్టాయి. చివరకు విదేశాల నుంచి ఉల్లి దిగుమతుల్ని కేంద్రం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరింత పెరగొచ్చు

ఈ నెలకుగాను విడుదలయ్యే ద్రవ్యోల్బణం గణాంకాలు మరింత పెరుగవచ్చని ఎస్బీఐ రిసెర్చ్‌ రిపోర్ట్‌-ఎకోరాప్‌ అంచనా వేసింది. జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 8 శాతానికిపైగానే ఉంటుందని అంటున్నది. పెరుగుతున్న రిటైల్‌ ద్రవ్యోల్బణం కారణంగానే ఇప్పటికే డిసెంబర్‌ ద్రవ్యసమీక్షలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లలేకపోయింది. ఈ క్రమంలో మరో ఆరు నెలలు ద్రవ్యోల్బణం గణాంకాలు పెరుగుతూపోయే వీలుందన్న అంచనాలున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలోనే తగ్గవచ్చని మెజారిటీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో ఆర్బీఐ వరుస వడ్డీరేట్ల కోతలకు వరుస బ్రేక్‌లు తప్పేలా లేవన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 6న ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను చివరి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను ప్రకటించనున్నది.



logo