గురువారం 02 జూలై 2020
Business - May 31, 2020 , 00:03:02

మరికొన్నేండ్లు కరోనాతో పోరాడాల్సిందే వ్యాక్సిన్‌ ఇప్పట్లో రాదు

మరికొన్నేండ్లు కరోనాతో పోరాడాల్సిందే వ్యాక్సిన్‌ ఇప్పట్లో రాదు

  • మరికొన్నేండ్లు కరోనాతో పోరాడాల్సిందే
  •  బయోకాన్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా

న్యూఢిల్లీ, మే 30: కరోనా వైరస్‌ నిర్మూలన కోసం సురక్షితమైన వ్యాక్సిన్‌ రావడానికి చాలాకాలం పట్టవచ్చని బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా అన్నారు. ఈ మహమ్మారితో మరికొన్నేండ్లు పోరాడక తప్పదన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. హెల్త్‌కేర్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడుల అవసరం ఉన్నదని గుర్తుచేశారు. శనివారం కార్ప్‌గిని నిర్వహించిన ఓ వెబినార్‌లో షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫార్మా-హెల్త్‌కేర్‌ రంగాలు, అనిశ్చిత పరిస్థితుల్లో వినియోగదారులతో మమేకం, కొవిడ్‌-19 అనంతర వ్యాపార విధానం అంశాలపై చర్చించారు. ‘కరోనా వైరస్‌ నియంత్రణ వ్యాక్సిన్‌ రావడానికి చాలా కాలమే పడుతుందని మనం నమ్మాలి. ఇక యావత్‌ దేశానికి ఇది అందుబాటులోకి రావాలంటే మరెంతో సమయం కావాలి. వ్యాక్సిన్‌ అభివృద్ధి ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ అని మనం అర్థం చేసుకోవాలి. మందు అందుబాటులోకి రావడానికి కనీసం నాలుగేైండ్లెనా పడతుంది’ షా అన్నారు. ఈ క్రమంలోనే ఏడాదిలోగా వ్యాక్సిన్‌ను తీసుకురావడం చాలా కష్టమని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్‌ ఆవిష్కరణను రక్షణ, సామర్థ్యం, ఓర్పుతో కూడిన ప్రక్రియగా అభివర్ణించారు.

హెల్త్‌కేర్‌కు పెద్దపీట వేయాలి: సునితారెడ్డి

వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కొరతను కరోనా వైరస్‌ స్పష్టంగా తెలియజేసిందని అపోలో హాస్పిటల్స్‌ ఎండీ సునితారెడ్డి అన్నారు. భారతీయ హెల్త్‌కేర్‌ రంగంలో మరిన్ని పెట్టుబడులకు అవకాశాలున్నాయని, మౌలిక రంగంపైనేగాక నైపుణ్యాభివృద్ధిపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. దేశంలో ఐటీ రంగాభివృద్ధికి ఎలాంటి ప్రేరణను ఇస్తున్నారో.. అలాగే హెల్త్‌కేర్‌ రంగంలో అదనపు మౌలిక వసతుల కల్పనకూ పెద్దపీట వేయాలన్నారు. తదుపరి ఐటీ రంగంగా హెల్త్‌కేర్‌ను ప్రభుత్వం భావిస్తుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఆమె వ్యక్తం చేశారు.


logo