సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Feb 26, 2020 , 00:12:00

పెట్టుబడులతో రండి

పెట్టుబడులతో రండి
  • భారతీయ పారిశ్రామికవేత్తలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పిలుపు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: అమెరికాలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార, పారిశ్రామికవేత్తలను ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ కోరారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి విదేశీ పెట్టుబడుల కోసం చూస్తున్నామన్న ఆయన వ్యాపారానికి అనువైన పరిస్థితులను నెలకొల్పుతామని, అడ్డంకులను తొలగించి.. నిబంధనలను మరింత సరళతరం చేస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు విచ్చేసిన అగ్రరాజ్య అధిపతి డొనాల్డ్‌ ట్రంప్‌.. మంగళవారం ఇక్కడ దేశీయ పరిశ్రమ దిగ్గజాలతో సమావేశమైయ్యారు. ఇందులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ, మహీం ద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీం ద్రా, టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌, ఆదిత్యా బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా తదితరులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మీ అందరికీ నా కృతజ్ఞతలు. మీ విజయాలకు నా శుభాకాంక్షలు. మీరు అమెరికాకు వచ్చి మరిన్ని బిలియన్ల పెట్టుబడులు పెడుతారని ఆశిస్తున్నా. మీ పెట్టుబడులు నా దృష్టిలో ఉద్యోగాలు’ అన్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో వ్యాపార నిర్వహణకు ఎన్నో రెగ్యులేటరీ సవాళ్లు, ముఖ్యంగా పాలనా, చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న ఆందోళనలపై ట్రంప్‌ స్పందిస్తూ వాటన్నిటిని తొలగిస్తామని, తేడాను మీరే గమనిస్తారన్నారు. ఇరు దేశాల సంస్థలు పరస్పరం ఒకరి దేశంలో మరొకరు పెట్టుబడులు పెట్టుకోవాలని పిలుపునిచ్చిన ఆయన ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వాలు కేవలం సహాయం చేస్తాయని, నిజానికి ఉద్యోగాలను కల్పించేది ప్రైవేట్‌ పరిశ్రమలేనని చెప్పారు. తాను భారత్‌లో, మోదీ అమెరికాలో ఉద్యోగాలను సృష్టిస్తున్నామన్న ఆయన మోదీతో చాలా దగ్గరగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మోదీ పనితీరు భేష్‌ అని కితాబిచ్చారు. ఇక భారత్‌లో అమెరికా పెట్టుబడులు, వ్యాపారంపై దేశీయ పరిశ్రమ ట్రంప్‌ను కొనియాడింది.


వాణిజ్య ఒప్పందం ఉంది కానీ..

భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఉందన్న ట్రంప్‌.. దానికి సంబంధించిన వివరాలను మాత్రం తెలియజేయలేదు. నిజానికి ఈ పర్యటనకు ముందు నుంచే వాణిజ్య ఒప్పందంపై స్పష్టత ఇవ్వని ట్రంప్‌.. చివరిదాకా అదే తీరును కనబరిచారు. ఇరు దేశాలు ఓ అద్భుతమైన వాణిజ్య ఒప్పందానికి కృషి చేస్తున్నాయన్న ఆయన ఈ డీల్‌ రెండు దేశాలకు ఎంతో ప్రతిష్ఠాత్మకం, కీలకమని పేర్కొన్నారు. ట్రంప్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్య చర్చల తర్వాత కూడా ఈ వాణిజ్య ఒప్పందంపై ఎటువంటి ప్రకటన లేకపోవడం గమనార్హం. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాతే ఈ డీల్‌కు లైన్‌ క్లియరవుతుందన్న అంచనాలు వినిపిస్తుండగా, ఈ ఏడాది ఆఖరుదాకా ఆగాల్సిందేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 


నేను ఓడితే.. మార్కెట్‌ మటాషే

రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోతే స్టాక్‌ మార్కెట్లు భారీగా పడిపోతాయని ట్రంప్‌ అన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా స్టాక్‌ మార్కెట్లు నష్టాలను చవిచూస్తాయని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనుండగా, మళ్లీ తనదే అధికారమన్న ధీమాను ట్రంప్‌ వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాను గెలిస్తే మార్కెట్లకు పండగేనని.. ఓడిపోతే మాత్రం దండగేనన్నారు. తమ ప్రభుత్వం అమెరికా ఆర్థిక, ఆరోగ్య, సైనిక రంగాల కోసం ఎంతో చేసిందని చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే కరోనా వైరస్‌పై స్పందిస్తూ పరిస్థితులను గమనిస్తున్నామని, చైనాతో మాట్లాడుతున్నామని చెప్పారు. వైరస్‌ను మట్టుబెట్టేందుకు అమెరికా సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని, దాదాపు 2.5 బిలియన్‌ డాలర్లను వెచ్చిస్తున్నామన్నారు. వైరస్‌ అంతానికి చైనా చాలాచాలా శ్రమిస్తున్నదని చెప్పారు. చైనాయేతర దేశాలకూ వైరస్‌ విస్తరిస్తుండటంతో సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 807 పాయింట్లు పతనమవగా, అమెరికా స్టాక్‌ మార్కెట్‌ డోజోన్స్‌ సైతం వెయ్యి పాయింట్లకుపైగా క్షీణించింది.


పదింతలైన చమురు కొనుగోళ్లు

అమెరికా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లు గడిచిన రెండేండ్లలో పదింతలు పెరిగాయి. ఇరు దేశాల మధ్య ఇంధన సంబంధాలను ఇది బలపరుస్తుండగా, 2017లో రోజుకు 25 వేల బారెల్స్‌గా ఉన్న చమురు, గ్యాస్‌ సరఫరా.. ఇప్పుడు 2.5 లక్షల బ్యారెళ్లకు చేరుకుందని అమెరికా ఇంధన శాఖ మంత్రి డాన్‌ బ్రౌల్లెట్టే తెలిపారు. దీంతో అమెరికా-భారత్‌ ద్వైపాక్షిక ఇంధన వాణిజ్యంపై సంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్‌.. డాన్‌ పనితీరును ప్రశంసించారు. 2017 నుంచే అమెరికా ముడి చమురును భారత్‌ కొనుగోలు చేస్తున్నది. ఇక ప్రస్తుతం భారత్‌కు చమురు సరఫరాదారుల్లో అమెరికాది ఆరో స్థానమని దేశ చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. నిరుడు ద్వైపాక్షిక హైడ్రోకార్బన్‌ వాణిజ్యం 7.7 బిలియన్‌ డాలర్ల మార్కును తాకిందని చెప్పారు.


logo